హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్ళీ 'ప్రత్యేకాంధ్ర' ఉద్యమం రాజుకుంటుందా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Andhra Pradesh
హైదరాబాద్: ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రాంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పరిశ్రమలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతున్నాయని, ఫలితంగా కోస్తా ఆంధ్ర వెనుకబడిపోయిందని, ఈ ప్రాంతంలో నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చిందన్నది ప్రధాన వాదన. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధికి అవకాశముటుందని ఒక అభిప్రాయం. గతంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు ఈ ప్రాతిపదిక మీదనే నడిచాయి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడం వల్ల యువకులు, విద్యార్ధులు ఈ ఉద్యమానికి ఆకర్షితులయ్యే అవకాశముంది. పొలం పనుల వత్తిడి తక్కువగా ఉండడం వల్ల గ్రామీణ యువత కూడా కదులుతారనే అభిప్రాయముంది.

ఆప్కాబ్‌ చైర్మన్‌, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ప్రత్యేక ఆంధ్ర సాధనకు ఉద్యమం చేపడతానని గురువారం చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులను కూడదీసుకుని ఏఐసీసీ చైర్మన్‌ సోనియాగాంధీని కలసి రాష్ట్ర విభజన ఆవశ్యకతను వివరిస్తానని వసంత పేర్కొన్నారు. వసంత ప్రకటన పట్ల తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేసినా, ఆంధ్ర నేతల స్పందన ఇంకా స్పష్టం కాలేదు.

1969 నుంచి 72 వరకు జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వసంత అదే స్ఫూర్తితో మళ్లీ ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చేపడతానంటున్నారు. ఆంధ్ర నాయకులు దీని కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చుతున్న నేపథ్యంలో వసంత చేసిన ప్రకటన ఆంధ్ర ప్రజల్లో ఆలోచన కలిగించిందనడటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేక ఆంధ్ర వస్తే లభించే లాభాలేమిటీ? నష్టాలేమిటీ అనే అంశాలపై పలుచోట్ల చర్చించుకోవడం కనిపించింది. అప్పటి ఉద్యమం తాలూకు వివరాలు, సమైక్యాంధ్రపై అవగాహన కలిగిన నేతలు వసంత ప్రకటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పతాక స్థాయికి చేరిన జై ఆంధ్ర ఉద్యమం మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం మృతితో 1972లో నిలిచిపోయింది.

ఆ తరువాత కూడా అడపా దడపా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు తలెత్తాయి. ప్రజలు స్పందించకపోవడంతో ఈ తరహా ఉద్యమాలు చేపట్టడానికి నాయకులు ముందుకు రాలేదు. 2003లో కోస్తా ఆంధ్ర అభివృద్ధి సంస్థను కొంతమంది నాయకులు ఏర్పాటు చేసి, ఆంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని సదస్సుల ద్వారా ప్రజలకు తెలియ చేయడం ప్రారంభించారు. విజయవాడతో ప్రారంభమైన సదస్సులు రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు విస్తరించాయి. అన్ని సదస్సులకు ప్రజలు నామమాత్రంగా రావడంతో సంస్థ స్థాపకులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమైక్యాంధ్రకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ నాయకులు ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చినా, ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించారే కాని ప్రత్యేక తెలంగాణకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆంధ్రలోని ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది వైఎస్‌ అనుచరులే ఉండడంతో వసంత ప్రకటనకు వారు స్పందించరనే అభిప్రాయం మరో వైపు నుంచి వినపడుతోంది. కానీ వైఎస్ లేరు కాబట్టి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మళ్ళీ వేళ్ళూనుకునే అవకాశం లేకపోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X