హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుని వణికిస్తున్న కెసీఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్నికల తర్వాత మహాకూటమి వ్యూహాల గురించి కెసీఆర్ గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితాల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో చూసుకుని అందుకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని, తెలంగాణ సాధించుకోవడం కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధపడాలని కెసీఆర్ తన సన్నిహితులకు చెబుతున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్-టీఅర్ ఎస్-ప్రజారాజ్యం కూటమి ఏర్పడాలని కెసీఅర్ కోరుకుంటున్నట్టు కన్పిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పడితే తెలుగుదేశం కూటమిలో ఉండడం వల్ల ప్రయోజనం ఉండదని, కేంద్ర ఫలితాలను బట్టి రాష్టంలో వ్యూహం మార్చుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. అందువల్ల అక్కడా ఇక్కడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మూడు నాలుగు రోజులు పట్టేట్టుంది. ఏ కూటమికీ కట్టుబడి ఉండకుండా ఆ నాలుగురోజుల్లో అప్పటికప్పుడు లాభదాయకమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ సాధించాలన్నది కెసీఆర్ వ్యూహంలా కన్పిస్తోంది.

కెసీఅర్ నిన్ననే ఢిల్లీ వెళ్ళి సోనియాగాంధీతో, బిజెపి నాయకులతో ఎన్నికల అనంతర పరిస్ధితిపై చర్చించాలనుకున్నారు. అయితే సోనియాగాంధీ కెసీఅర్ ను బుట్టలో వేసుకునే ప్రమాదముందని గ్రహించిన చంద్రబాబు ఈనెల ముప్పై వరకు హైదరాబాద్ లోనే ఉండమని కోరినట్టు తెలుస్తోంది. ఈలోపు మహాకూటమిలోని అందరి చేత తెలంగాణ అనుకూల ప్రకటన చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణపై మాట తప్పేది లేదని చంద్రబాబు నిన్న టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

అయినా చంద్రశేఖరరావుకు తనవైన వ్యూహాలు, లెక్కలు, చంద్రబాబుపై అనుమానాలు ఉన్నాయి. టిడిపి, వామపక్షాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత బలం వస్తే చంద్రబాబు టీఅర్ ఎస్ ను లైట్ గా తీసుకుని తెలంగాణను నిర్లక్ష్యం చేస్తారేమోనన్న అనుమానం ఆయనకుంది. అదీగాక చంద్రబాబు మహాకూటమిలోనే తాము కొనసాగితే కేంద్రంలో తృతీయ కూటమిలో ఉండాల్సి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తృతీయ కూటమి వల్ల సాధ్యం కాదని కెసీఆర్ భావిస్తున్నారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ కూటమి- ఈ రెంటిలో ఒకటి అధికారంలోకి రావడం ఖాయం. ఈ నేపధ్యంలో మహాకూటమిలో ఉండడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని కెసీఆర్ అనుకుంటున్నారు. టీఅర్ ఎస్ తొమ్మిది లోక్ సభ స్ధానాలకు పోటీ చేసింది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం తన తెలంగాణ డిమాండ్ ను సీరియస్ గా తీసుకోవాలంటే ఆ పార్టీ కనీసం నాలుగైదు లోక్ సభ స్ధానాలను గెలుపొందవలసి ఉంటుంది.

మొత్తానికి చంద్రబాబు, చంద్రశేఖరరావు వ్యవహారం పెళ్ళి కాకముందే విడాకులకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇద్దరూ రాజకీయ దురంధరులు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో దిట్టలు. చంద్రబాబు దృష్టి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మీద ఉంటే చంద్రశేఖరరావు కన్ను కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం మీద ఉంది. మే 16 తర్వాత వీరు ఎత్తులు పై ఎత్తులు మహారంజుగా ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X