హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ను ఎందుకు స్మరించాలి?

By Staff
|
Google Oneindia TeluguNews

NTR
హైదరాబాద్: ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన మరణించినప్పుడు మాత్రం పేదవారి చేతుల్లోని అన్నం గిన్నెలు కిందపడిపోయాయి. ఆ శబ్ధాలు ఎంతో విషాదకరం, హృదయ విదారకం. ఆయనే మహా నటుడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు. తెలుగువారు కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఆయనను స్మరించుకోవాలి. నేడు ఎన్టీఆర్ జయంతి.

సినిమాల్లో నటించడానికి ఆయన బంగారం వంటి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదులుకున్నారు. ఆ తర్వాత వెండితెరపై పసిడి పంట పండించారు. సగటు తెలుగువాడికి ప్రతిరూపం ఆయన. ఆవేశం, ఆగ్రహం, ఆలోచన అన్నీ సమపాళ్ళలో ఆయనలో ఉండేవి. సినిమారంగంలో ఉన్నప్పుడే ఆయన అనేక సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1982 లో రాష్ట్రంలో అన్ని రకాలుగా కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయినప్పుడు ఆయన ఆంధ్రుల ఆత్మాభిమానం నినాదంతో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అనే ఎజెండాతో తెలుగుదేశం పార్టీని స్ధాపించారు. రాజకీయాల్లో ధనబలం లేకపోయినా విజయం సాధించవచ్చని నిరూపించారు. క్లీనర్లు, కండక్టర్ల వంటి వారిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత ఆయనది.

పైకి ఎంతో గర్విష్టిలా కన్పించినా ఆయన గొప్ప మానవతావాది, సంస్కరణవేత్త. వెనుకబడిన కులాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి వారికి అధిక సంఖ్యలో టికెట్లు ఇచ్చి ప్రాధాన్యం గల మంత్రిపదవులను కట్టబెట్టిన ఘనత ఆయనదే. రాజకీయాల్లో పెత్తందారీ వర్గాల ప్రాధాన్యం ఆయన వల్ల తగ్గిపోయింది. మితిమీరిన స్వార్ధ పరుడిగా సినిమారంగంలో ఆయన మీద ముద్ర ఉంది. రాజకీయాల్లో మాత్రం ఆయన మచ్చలేని నాయకుడు. ప్రజాధనం దుర్వినియోగమవుతోందంటే ఆయన కళ్ళు చింతనిప్పుల్లా మారేవి. ముఖ్యమంత్రిగా ఆయన అవినీతి రోజుకు ఓ పది లీటర్ల విజయ (ప్రభుత్వ సంస్ధ) పాలే అని చెప్పాలి. అందులో అధిక భాగం తనను కలుసుకోడానికి వచ్చిన వారికి టీ కాఫీలు ఇవ్వడానికే.

తాను మంచి అనుకున్నది చేయడం ఆయనలోని గొప్ప నాయకత్వ లక్షణం. రెండు రూపాయలకు కిలో బియ్యం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేశారు. కుటుంబసభ్యులు వద్దని వేడుకున్నా ఆయన లక్ష్మీపార్వతిని పెళ్ళాడారు. తనకు సేవ చేసి తననే నమ్ముకున్న మహిళకు ఆయన అన్యాయం చేయలేదు. ఆయనలోని మరో గొప్ప లక్షణానికి ఇది ప్రతీక. ముసలి వయసులో రెండో పెళ్ళి చేసుకున్నా సామాన్యులు మరో విధంగా అనుకోలేదు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన లక్ష్మీపార్వతి వెంటబెట్టుకుని ప్రచారానికి వెళ్ళి టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చారు.

ఆ తర్వాత ఏడు నెలలకే ఆయనను తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దానిని వెన్నుపోటు అని కొందరు, పార్టీ శ్రేయస్సు కోసమేనని మరికొందరు ఇప్పటికీ వాదించుకుంటారు. ఆయన లేని లోటు ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులకు బాగా కన్పించింది. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో రారాజుగా వెలుగొందిన వ్యక్తికి నీరాజనాలు అర్పించడం తెలుగువారి బాధ్యత.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X