వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ మైండ్ సెట్ మారిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హీరో జూనియర్ ఎన్టీఆర్ మైండ్ సెట్ మారినట్లే కనిపిస్తోంది. మాస్ మాసాలాతో మాత్రమే సినిమాలను హిట్ చేయించలేమని, కథాబలం తప్పకుండా కావాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. మాస్ అపీల్ కు కొరత లేకపోయినా వరుస ఫ్లాప్ లతో విసిగిపోయిన ఎన్టీఆర్ తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మాస్ అపీల్ దెబ్బ తినకుండా కథాబలం ఉన్న సినిమాల్లో నటించాలని అనుకున్నట్లున్నారు. బృందావనంలో నటించాలని ఆయన నిర్ణయించుకోవడం వెనక ఆయన ఆలోచనా ధోరణి మారడమే కారణమని అంటున్నారు. ఈ సినిమాలో నటించే సమయంలో తాను తెగ భయపడ్డానని ఆయన చెప్పారు. బహుశా, అది మాస్ ఇమేజ్ దెబ్బ తింటుందనే భయం కావచ్చు. ఈ సినిమా విజయం తర్వాత ఆయనకు ఆత్మవిశ్వాసం పెరిగి ఉంటుంది. అందుకే, తాత సీనియర్ ఎన్టీఆర్ లాగా విభిన్నమైన పాత్రలు పోషించాలని ఉందని ఆయన ప్రకటించారు. అసలు ఎన్టీఆర్ మైండ్ సెట్ చాలా క్రితమే మారిందని, కానీ మారిన మనసు ప్రకారం సినిమా రూపుదిద్దుకోవడానికి బృందావనం దాకా రావాల్సి వచ్చిందని అంటున్నారు.

ఆరు ఫైట్లు, ఆరు పాటల ద్వారా సినిమాను తన ఇమేజ్ తో బాక్సాఫీసు వద్ద బద్దలు కొట్టించగలమనే నమ్మకం చాలా మంది మాస్ హీరోలకు ఉందే. ఆ మాస్ ఇమేజ్ కు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే భయంతో కథాబలం ఉన్న సినిమాలను, మాస్ మసాలా లేని సినిమాలను, ఫైట్లూ డ్యూయెట్లూ లేని సినిమాలను హీరోలు ఒప్పుకోవడం లేదు. అందరి కన్నా ముందుగా ఫెయిల్యూర్ కు అసలు కారణం కనిపెట్టిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నే చెప్పుకోవాలి. పోకిరి తర్వాత అంతగా హిట్టివ్వని మహేష్ బాబు కూడా ఈ ఈ విషయంలో వెనకపడే ఉన్నారని చెప్పాలి. ఖలేజా అంతగా సక్సెసు కాకపోవడానికి, బృందావనం సినిమా విజయం సాధించడానికి అదే కారణమని టాలీవుడ్ లో అనుకుంటున్నారు.

నా అల్లుడు, నరసింహుడు, అశోకా సినిమాల ఫ్లాప్ లతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమాల్లో, ఆ సినిమాల్లో పోషించే పాత్రల్లో తేడా కనిపిస్తూ వచ్చింది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది యమదొంగ సినిమాను. ఈ సినిమా కావాల్సినంత విజయం సాధించిందనే చెప్పాలి. తాత సీనియర్ ఎన్టీఆర్ ను అనుకరిస్తూ చేసిన నటన అందరి మెప్పూ పొందింది. రాఖీ, అదుర్స్ సినిమాల విషయంలో కూడా తేడాను చూస్తాం. రాఖీ కథాబలం ఉన్న సినిమా అయితే, అదుర్స్ లో విభిన్నమైన పాత్రను ఎన్టీఆర్ వేశారు. పిలక జుట్టుతో నవ్వులను పండించే పాత్రను ఎన్టీఆర్ పోషించారు. గంభీరమైన డైలాగుల ద్వారా మాస్ ఇమేజ్ ను కాపాడుకోవాలనే తత్వం ఎన్టీఆర్ లో కనిపించకపోవడమే అదుర్స్ లో ఆయన ఆ పాత్రను పోషించడానికి అంగీకరించారని చెప్పవచ్చు. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోలను పట్టి పీడిస్తున్న వ్యాధికి మందు కనిపెట్టినట్లే ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X