హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ9 సీమాంధ్ర గొంతు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
లేని పోస్టుల కోసం ఫైటింగ్ అంటూ టీవీ9 ప్రసారం చేసిన వార్తా కథనంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు మండిపడుతున్నారు. టీవీ9 సీమాంధ్ర ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తోందని వారు వాదిస్తున్నారు. టీవీ9 సిఇవో రవిప్రకాష్ ను హెచ్చరించారు. హైదరాబాదులో పోస్టులే లేవంటూ టీవీ9 ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. పోలీసు రిక్రూట్ మెంటులో వివాదమే లేదని వ్యాఖ్యానించింది. ఆరో జోన్ అంటే ఏమిటో తెలియకపోవడం వల్లనే ఆ విధమైన వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని కొంత మంది అభిప్రాయపడుతుండగా, కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఒయు జెఎసి నేతలు అంటున్నారు. నిజానికి, హైదరాబాదులోని పోస్టుల నియామకాలను మాత్రం ఆపేస్తామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్సై అభ్యర్థులకు హామీ ఇచ్చారు. కానీ, మొత్తమే రాత పరీక్ష ఆపాలని అభ్యర్థులు వాదిస్తున్నారు. నిజానికి, హైదరాబాదు ఆరో జోన్ కిందికి వస్తుంది. అయితే, ప్రభుత్వం సరిగా వాదించకపోవడం వల్ల హైదరాబాదు ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. దీనిపై తీవ్ర ఆందోళన చెలరేగడంతో హైదరాబాదును తిరిగి ఆరో జోన్ కిందికి తేవాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆలాంటి చర్యలు తీసుకునే వరకు రిక్రూట్ మెంట్ ఆపాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాదు కూడా ఆరో జోన్ కిందికి వస్తాయి. హైదరాబాద్ ఆరో జోన్ కిందికి వస్తుంది కాబట్టి హైదరాబాదులో పోస్టులు లేవని వాదిస్తున్న టీవీ9 కథనం తప్పని వాదిస్తున్నారు. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ మాలకొండయ్య కూడా తెలంగాణవాదుల వాదనలను కొట్టిపారేస్తున్నారు. 2008 డిసెంబర్ 30వ తేదీన 1293 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, హైదరాబాదులో జీరో పోస్టులు చూపించామని ఆయన చెబుతున్నారు. హైదరాబాదులో జీరో పోస్టులు చూపించడం వల్ల హైదరాబాద్ స్థానికులు హైదరాబాదు నుంచి మినహాయించి మిగతా నాలుగు జిల్లాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి, హైదరాబాద్ లోని పోస్టులకు కూడా మిగతా నాలుగు జిల్లా అభ్యర్థులు అర్హులవుతారు. హైదరాబాద్ లో జీరో పోస్టులు చూపిస్తున్నామని చెప్పడం ద్వారా, హైదరాబాద్ పోస్టులను భర్తీ చేయబోమని చెప్పడం ద్వారా హైదరాబాద్ ను ఫ్రీజోన్ గానే పరిగణిస్తూ పోస్టులను సీమాంధ్రులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది తెలంగాణవాదుల ప్రధాన ఆరోపణ. సీమాంధ్ర ప్రయోజానాల కోసమే మాలకొండయ్య మాట్లాడుతున్నారని ఒయు జెఎసి నాయకులు అంటున్నారు. వివాదమే లేదంటున్నవారు ఆరో జోన్ లోని 257 పోస్టులను ఎలా భర్తీ చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదా అని తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకుడు విఠల్ ప్రశ్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X