వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వైపు సిబిఐ అడుగులు, మంత్రులలో వణుకు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు దిశగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దూకుడు చూస్తుంటే ఆయనను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. గురువారం ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది.

జగన్ ఆస్తుల కేసులో నాలుగు నెలల క్రితం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను అరెస్టు చేసింది. వీరి అరెస్టు దగ్గర నుండి ఈ కేసులో సిబిఐ విచారణను మరింత వేగవంతం చేసింది. ఆ తర్వాత ఈ కేసులో మే 28న తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ ప్రత్యేక కోర్టు వైయస్ జగన్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయనను అదే రోజు సిబిఐ అరెస్టు చేయవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి.

ఆ తర్వాత బుధవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యే ముందు వివరణ కోసం తమ ఎదుట 25న హాజరు కావాలని సిబిఐ జగన్‌‍కు గుంటూరులో వ్యక్తిగతంగా నోటీసులు అందజేసింది. దీంతో జగన్‌ను 25న విచారణకు పిలిపించి అరెస్టు చేసే అవకాశముందని అందరూ భావించారు. కాంగ్రెసు పార్టీ నేతలు కూడా జగన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని చెబుతూ వస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరో అడుగు ముందుకేసి నెల రోజులలో జగన్ అరెస్టు ఖాయమని మూడు రోజులుగా చెబుతున్నారు.

జగన్ కూడా తనను సిబిఐ అరెస్టు చేయనుందని చెబుతూ వస్తున్నారు. బుధవారం కూడా తన ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సిబిఐ తనను నాలుగు రోజుల్లో కాదని రెండు రోజుల్లోనే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుందని చెప్పారు. అయితే తనను, తన పార్టీని దెబ్బతీసేందుకే ఉద్దేశ్య పూర్వకంగా తనను అరెస్టు చేసేందుకు కాంగ్రెసు పార్టీ సిబిఐని ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుట్ర అని ఆయన చెబుతూ వస్తున్నారు.

అయితే ఆయన ఆరోపణలను ఘాటుగా తిప్పి కొట్టేందుకు కాంగ్రెసు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రతిపక్ష తెలుగుదేశం, జగన్ చేస్తున్న ఆరోపణలను ధీటుగా తిప్పి కొట్టేందుకు జగన్‌కు లబ్ధి చేకూరేలా జివోలు జారీ చేసిన సొంత పార్టీ మంత్రులను కూడా అరెస్టు చేస్తూ జగన్ అరెస్టుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జివోలు జారీ చేసిన మంత్రులను, అధికారులను అరెస్టు చేయకుండా జగన్‌ను మాత్రమే అరెస్టు చేస్తే కాంగ్రెసు పార్టీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిబిఐ చిత్తశుద్ధిని కూడా శంకించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా సిబిఐ మోపిదేవిని అరెస్టు చేసిందని అంటున్నారు. మంత్రిని అరెస్టు చేయడం ద్వారా, ఇక ఎలాంటి విమర్శలకు తావివ్వకుండానే ఈ నెల 25న విచారణ సమయంలో గానీ, 28న కోర్టుకు హాజరైన సమయంలో గానీ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా లాభనష్టాలు బేరీజు వేసుకొని కాంగ్రెసు పార్టీ జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

కాగా మంత్రి మోపిదేవి అరెస్టుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులలో ఆందోళన ప్రారంభమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులో మోపిదేవితో పాటు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, కన్నా లక్ష్మీ నారాయణ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్నారు. ఇటీవల హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా మంత్రుల అరెస్టు నుండి జగన్ అరెస్టు దిశగా సిబిఐ పావులు కదుపుతున్న వైనం తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

English summary
It is said that, Central Bureau of Investigation(CBI) is foot to arrest YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy. After Mopidevi Venkata Ramana arrest, many are thinking that, Jagan may arrest soon. Jagan also saying he will be arrested by CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X