• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టి, హైద్రాబాద్‌లో ఆందోళన: శ్రీకృష్ణ ఐదో చాప్టర్!

By Srinivas
|

Is Centre Implementing 5th chapter of Srikrishna Committee?
మూడేళ్ల క్రితం శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఐదో పరిష్కార మార్గం ఆధారంగా కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటోంది! గతంలో తెలంగాణ సమస్యకు ఆ కమిటీ ఆరు పరిష్కార మార్గాలు చూపించిన విషయం తెలిసిందే. అందులో ఐదవది... పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు! కాంగ్రెస్ అధిష్ఠానం దీనికే మొగ్గు చూపిందంటున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకునే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారట. ఐదో ఆప్షన్‌లో శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే....

''రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రగా విభజించాలి. హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ప్రకటించి... సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి.'' (ఎ) ఇప్పుడున్న సరిహద్దుల ప్రకారం తెలంగాణ, సీమాంధ్రగా విభజించాలి. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పడే దాకా... హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఏర్పాటు కోసం అవసరమయ్యే నిధులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి ఉంటుంది.

ఈ పరిష్కార మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలన్న ఈ ప్రాంతంలోని అత్యధికుల డిమాండ్‌ను ఆమోదించినట్లవుతుంది. తద్వారా ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, సెంటిమెంట్‌ను కూడా గౌరవించినట్లవుతుంది. తమపట్ల వివక్ష, నిర్లక్ష్యం కొనసాగుతోందనే భావనను కూడా దూరం చేసినట్లవుతుంది. కమిటీ తెలంగాణలో పర్యటించిన సమయంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు ప్రజల నుంచి భారీస్థాయిలో మద్దతు లభించింది. కొంతమంది తటస్థంగా ఉన్నారు. కొన్ని వర్గాలు మాత్రం విభజన డిమాండ్‌ను వ్యతిరేకించారు.

వరంగల్, పశ్చిమ ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ ఆదిలాబాద్, మెదక్‌లోని సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని భాగాలు, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ అనుకూల భావన చాలా బలంగా ఉంది. ఇక్కడ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న వారిలో... విద్యార్థులు (ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు), నిరుద్యోగ యువత, న్యాయవాదులు, ఎన్‌జీవోలు ఉన్నారు.

తటస్థంగా ఉన్నవారిలో అసలైన హైదరాబాదీలు, మజ్లిస్‌కు చెందిన కొందరు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నవారు, సెటిలర్ గ్రామాలు, మండలాలు (ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ మొదలైన జిల్లాల్లోని), సీమాంధ్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి హెచ్ఎండిఏ పరిధిలో వలస వచ్చిన వారు ఉన్నారు.

ఉత్తర తెలంగాణలోని కొండ ప్రాంతాల గిరిజనుల్లో అత్యధికులు ప్రత్యేక మన్యసీమను కాంక్షిస్తున్నారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలను ఒకే పరిపాలన ఛత్రం కిందికి తేవాలని కోరుతున్నారు. ఇక... ఎస్సీ/బిసి, మైనారిటీలు తమకు రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు ఉండాలని, రిజర్వేషన్ ప్రయోజనాలు లభించాలనే సొంత ఆకాంక్ష వ్యక్తం చేశారు.

(బి) ప్రస్తుత సరిహద్దుల ప్రకారం సీమాంధ్ర, తెలంగాణను విభజించాలనే ఈ ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకుంటే తలెత్తే పరిణామాలు... (1) సీమాంధ్రలో ఆందోళనలు మొదలు కావొచ్చు. (2) పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. (3) కోస్తాంధ్ర నుంచి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్ కూడా తలెత్తవచ్చు. (4) నీరు, సాగునీటి అంశాలను స్వయం ప్రతిపత్తి/పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలు పర్యవేక్షించినా... కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆందోళన కొనసాగే అవకాశముంది. (5) నక్సలిజం, మత ఛాందసవాదం పెరిగే అవకాశంవల్ల... ఇది అంతర్గత భద్రతపైనా ప్రభావం చూపుతుంది.

(సి) ఎపి విభజన ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా పడుతుంది. చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకుంటాయి. అంతేకాదు, కేంద్రం మొట్ట మొదటిసారిగా రాజకీయ డిమాండ్ మేరకు... రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఒక భాష ప్రాతిపదికన ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఒకే భాష (తెలుగు) మాట్లాడే రెండు రాష్ట్రాలుగా విభజించినట్లవుతుంది. దీనివల్ల తలెత్తే పరిణామాలపై ప్రశాంత చిత్తంతో, నిష్పాక్షికంగా ఆలోచించాలి. తన రాజకీయ హోదా ఎలా ఉండాలో ఒక ప్రాంతం తనంతట తాను నిర్ణయించుకునే అవకాశం కల్పించవచ్చా? దీనివల్ల పెద్దసంఖ్యలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు తలెత్తి సమన్వయం, నిర్వహణలో సమస్యలకు దారి తీసే అవకాశం లేదా... అనే విశాల కోణంలో ఆలోచించాలి.

(డి) ఇక్కడ ఆర్థిక కోణాన్ని ఏమాత్రం విస్మరించలేం. ప్రపంచ వ్యాప్తంగా... చిన్న చిన్న దేశాలు తమ ఆర్థిక అవకాశాలు, మార్కెట్, ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆర్థిక సమూహాలుగా ఏర్పడుతున్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల అంతర్ రాష్ట్ర, రాష్ట్రం పరిధిలో వస్తువులు, సేవల వినిమయంలో గతంలో ఉన్న ఇబ్బందులకు మళ్లీ ఆస్కారమిచ్చినట్లవుతుందనే భావన ఉంది.

ఉదాహరణకు.. రకరకాలైన లోకల్ ఎంట్రీ ట్యాక్స్‌లు, సెస్‌లు స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకం కలిగించే అవకాశముంది. రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య వస్తువుల సరఫరాను నియంత్రిస్తూ స్థానిక చట్టాలు చేసే అవకాశముంది. ఇలాంటి ఆందోళనలు కోస్తాంధ్ర, రాయలసీమలో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే తమ మార్కెట్‌కు గమ్యంగా ఉన్న, సరఫరాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ తమ సరిహద్దులకు అవతల ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.

భారీ జనాభా, వ్యాపారం, హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన మార్కెట్‌ను కోస్తా ఆంధ్ర కోల్పోతుంది. ఇది కొత్త రాష్ట్రాల ఆర్థిక వృద్ధిని నిరోధిస్తుంది. విభజన వల్ల తెలంగాణ ప్రాంతం తూర్పు తీరానికి దూరమవుతుంది. విశాఖపట్నంతో సహా పలు ఇతర రేవులతో బంధం తెగిపోతుంది. భారీ స్థాయిలో ఉన్న చమురు, సహజ వాయు నిక్షేపాల ఫలితంగా తీర ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయని పక్షంలో సమీకృత ఆర్థిక వ్యవస్థలో దీనివల్ల రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారు లబ్ధిపొందవచ్చు. అయితే, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా స్థిరంగా ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇంకా చెప్పాలంటే, దేశంలోని చాలా రాష్ట్రాల స్థూల ఉత్పత్తి కంటే ఎక్కువగానే ఉంటుంది.

(ఈ) ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘంగా సాగుతున్న పోరాటం, తీవ్రస్థాయిలో ఉన్న భావోద్వేగాలు, డిమాండ్ నెరవేరకపోతే తలెత్తనున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆప్షన్‌ను పరిశీలించవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందం (1956)లోని కొన్ని ముఖ్యాంశాలను అమలు చేయకపోవ డం, నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, విద్యా సదుపాయాల కల్పనలో (హైదరాబాద్ మినహా) అలసత్వం, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో అసాధారణ జాప్యం వంటి అంశాల నేపథ్యంలో తాము వివక్షకు గురయ్యామని, తమను అణచి వేస్తున్నారనే భావన... తీవ్ర భావోద్వేగానికి కారణమైంది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లో అర్థముందని, ఇది పూర్తిగా అసంబద్ధమైనదేమీ కాదని కమిటీ అభిప్రాయపడుతోంది.

విభజిస్తే ఏం చేయాలి?

రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల ప్రకారం సీమాంధ్ర, తెలంగాణగా విభజించాలనే ఆప్షన్‌ను పరిగణించిన పక్షంలో పెట్టుబడులు, ఆస్తులు, జీవనోపాధికి సంబంధించి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల, హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతరుల, తెలంగాణలోని ఇతర జిల్లాలవారి ఆందోళనలను తగువిధంగా పరిష్కరించాలి. కొత్త రాష్ట్రంలో వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ విశ్వాసం నింపాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణలోని అత్యధికులకు సంతృప్తి కలిగిస్తూనే, పైన పేర్కొన్న సమస్యలకు కారణమవుతుందని కమిటీ అభిప్రాయపడుతోంది.

తెలంగాణ ఏర్పాటు వల్ల మిగిలిన రెండు ప్రాంతాలపై పడే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేం. దీనికి సంబంధించి మంచి చెడ్డలన్నీ పరిశీలిస్తే... విభజన అత్యుత్తమ మార్గం కాబోదు. ఇది రెండో ఉత్తమ మార్గంగా (సెకండ్ బెస్ట్ ఆప్షన్) పరిగణిస్తున్నాం. అనివార్య పరిస్థితుల్లో, అదీ మూడు ప్రాంతాల మధ్య సామరస్య పూర్వక అంగీకారం లభించిన పక్షంలో రాష్ట్రాన్ని విభజించవచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Is Centre Implementing 5th chapter of Srikrishna Committee?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more