వరాలివ్వని మోడీ: చంద్రబాబుకు తిప్పలేనా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై కాకున్నా ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేస్తారని అందరూ ఊహించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. అధికార తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కూడా మోడీ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని బట్టి మోడీపై అందరూ అశలు పెట్టుకున్నారనేది అర్థమవుతోంది.
బహుశా, చంద్రబాబు కూడా మోడీ ప్యాకేజీలకు సంబంధించి ఏ విధమైన ప్రకటన చేయకపోవడం పట్ల అసంతృప్తిగానే ఉండి ఉంటారు. కానీ, కేంద్రంతో చెడగొట్టుకోవడం ఇష్టం లేక, బిజెపి మిత్ర పక్షమైనందున ఆయన మౌనం వహిస్తూ ఉండవచ్చు. అయితే, ప్రత్యేక హోదాపై, ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం తప్పకుండా ప్రకటన చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రమే కాకుండా ఎపి బిజెపి నాయకులు చెబుతున్నారు.
Photos: అమరావతి శంకుస్థాపన

ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపన విషయంలో ఎపికి వరాలు ఇవ్వకపోవడంతో చంద్రబాబు ఇరాకటంలో పడ్డారనే చెప్పాలి. అమరావతి శంకుస్థాపన పేరుతో చంద్రబాబు గత కొంత కాలంగా హడావిడి చేస్తూ ఎన్నో ఆశలు రేపారు. దీంతో ప్రతిపక్షాలకు ప్రత్యేక హోదా విషయంపై ఆందోళనలు చేయడానికి అంతగా అవకాశం చిక్కలేదు. కానీ, అమరావతికి శంకుస్థాపన జరిగిన మర్నాడే అంటే, శుక్రవారంనాడు ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి.
తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి పలు నగరాల్లో, పట్టణాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు మాత్రమే కాకుండా కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబును చిక్కుల్లో పడేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలను ఉధృతం చేసే అవకాశం ఉంది.
పట్టిసీమ, ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన పేర్లు చెబుతూ ప్రతిపక్షాలపై ఆధిక్యం సాధించడానికి ప్రయత్నించిన చంద్రబాబు తర్వాత ఏం కార్యక్రమం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎపి ప్రజలకు నమ్మకం కుదిరించడానికి ఆయన మరో భారీ కార్యక్రమం చేపట్టక తప్పని పరిస్థితిలో పడినట్లే.












Click it and Unblock the Notifications