వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ నాడు అలా.. నేడు ఇలా: తెలంగాణ చాలన్నారుగా, జైరాంపై గుర్రెందుకు?

అధికారం ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరొకలా.. వ్యవహరించడం రాజకీయ నాయకుల తత్త్వం. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు అందుకు మినహాయింపు కాదని ఆయన వ్యాఖ్యలు, వైఖరి తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లే

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధికారం ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరొకలా.. వ్యవహరించడం రాజకీయ నాయకుల తత్త్వం. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు అందుకు మినహాయింపు కాదని ఆయన వ్యాఖ్యలు, వైఖరి తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

1999లో రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు దక్కక రెండేళ్ల తర్వాత అదును చూసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి.. ఒంటెద్దు పోకడలు అనుసరించి.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో 25 అసెంబ్లీ, ఐదు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యం టీఆర్ఎస్‌ది. ఒక బలమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పాలనను అంతమొందించేందుకు విపక్షాలు అన్నీ కలిస్తేనే బలం తప్ప.. ఏ ఒక్కరి బలమో ప్రధానం కాదన్న సంగతి తర్వాత జరిగిన పరిణామాలే చెప్తున్నాయి.

2006లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా మెజారిటీ సాధించుకున్న కేసీఆర్.. 2008 ఉప ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో ఎలా గెలిచారు. 25 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది పక్కకు తప్పుకున్నారు. మిగతా వారిలో ఏడుగురు మాత్రమే గెలుపొందారు 2008 ఉప ఎన్నికల్లో. 2009లో ఐదేళ్ల క్రితం వ్యతిరేకించిన టీడీపీతోనే పొత్తు పెట్టుకుని రెండు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన నేపథ్యం టీఆర్ఎస్‌ది.

కాంగ్రెస్ టీడీపీ ఓడలు బండ్లయ్యాయి ఇలా

కాంగ్రెస్ టీడీపీ ఓడలు బండ్లయ్యాయి ఇలా

తర్వాత విద్యార్థుల నిరసనతో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించి.. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్రం తెలంగాణ అనుకూల ప్రకటన చేసిన తర్వాత భావోద్వేగం రగిలించి సబ్బండ వర్ణాల మద్దతు కూడగట్టడంలో మాత్రం టీఆర్ఎస్ నాయకత్వం విజయం సాధించింది. కానీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్థితి అందుకు భిన్నం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. సీమాంధ్ర నాయకత్వం ప్రధాన స్థానంలో ఉన్నందున.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దూకుడుగా ముందుకెళ్లి తామే తెలంగాణ తీసుకొస్తున్నామని ప్రచారం చేసుకుని ప్రజాభిమానం మూటగట్టుకోలేని బలహీనత కలిగి ఉన్నారు. ఇక తెలంగాణకు అనుకూలమని కేంద్రానికి లేఖ ఇచ్చిన తర్వాత రెండు కళ్ల సిద్ధాంతం పార్టీ తెలుగుదేశం నాయకత్వం అనుసరించిన, అనుసరిస్తున్న తీరు తెలంగాణలో దూరమైంది. ఈ విషయాలు సీఎం కేసీఆర్ కు తెలియని విషయాలేమీ కాదు. కానీ 2004లో తమ దయాదాక్షిణ్యాలతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే నిర్ధారణలకు కూడా వెనుదీయకపోవడమే విచారకరంగా ఉన్నది.

Recommended Video

KCR lashes out at Congress leaders after returning from Maharastra
జైరాం రమేశ్ రాజ్యసభ బగ్ అని కేసీఆర్ వ్యాఖ్య

జైరాం రమేశ్ రాజ్యసభ బగ్ అని కేసీఆర్ వ్యాఖ్య

విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు నిలిపేయడంతో ఆగమేఘాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్త్రుత స్థాయిలో చర్చకు దారి తీశాయి. తన తనయుడు - రాష్ట్ర మంత్రి కే తారక రామారావుకు హిమాన్షు మోటార్స్ పేరిట వ్యాపారం ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించడంపై సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జైరాం రమేశ్ వ్యాఖ్యలపై రాజ్యసభ బగ్ అని వ్యాఖ్యానించారు. ఆయన వల్లే ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగానికి అతీతంగా చర్యలు కుదరవ్

రాజ్యాంగానికి అతీతంగా చర్యలు కుదరవ్

కానీ నాడు తెలంగాణలో రాజకీయ అస్థిరతకు తావులేకుండా ఉండేందుకే అప్పటి సనత్ నగర్ ఎమ్మెల్యే - జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నిపుణులతో చర్చించి నివేదిక సమర్పించిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 20014లో పార్లమెంట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం'లో నూతన అసెంబ్లీ స్థానాల పెంపు ప్రస్తావన చేశారు. రాజ్యాంగ సవరణ అక్కర్లేకుండా అని జైరాం రమేశ్ రాసిపెట్టి.. అసెంబ్లీ స్థానాలను పెంచాలని సీఎం కేసీఆర్ ఆలోచన. అంటే అవకాశాలు ఉంటే రాజ్యాంగానికి అతీతంగా నిర్ణయాలను తీసుకునేందుకు వెనుకాడబోరని అర్థమవుతున్నది. నాడు మూడేళ్ల క్రితం వరకు రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటుకు సబ్బండ వర్ణాలు సమరం జరిపాయి. అందుకు అనుగుణంగానే తెలంగాణ బిల్లును రాజ్యాంగ పరిధిలో ఆమోదించి రాష్ట్రం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

నాడే రాజ్యాంగ సవరణకు అవకాశాలు ఇలా

నాడే రాజ్యాంగ సవరణకు అవకాశాలు ఇలా

ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదా రాష్ట్ర అసెంబ్లీకి వచ్చింది. తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులో రాజ్యాంగ సవరణకు బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపుతోపాటు రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును పెట్టమని నాడే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేతగా కేసీఆర్ సూచించొచ్చు. కానీ ఆనాడు కేసీఆర్ తెలంగాణ బిల్లు ఆమోదం పొంది, హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత ఒక కార్పొరేట్ హోటల్ లో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఆయన వాదనలోని అసంబద్ద వైఖరిని బయటపెడుతున్నాయి. ముందు మనకు తెలంగాణ ఆవిర్భావమైతే.. తర్వాత మిగతా అంశాలు చూసుకోవచ్చునని పలు అంశాలపై వివరణలిస్తూ చెప్పారు కేసీఆర్. కానీ నాడు అసెంబ్లీ సీట్ల పెంపు ప్రస్తావనేదీ రాలేదు.

అసెంబ్లీ సీట్ల పెంపునకు సాకులివి

అసెంబ్లీ సీట్ల పెంపునకు సాకులివి

ఈనాడు కేంద్రం.. ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేదు మరి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సుముఖంగా లేదు. దానికి కారణం ఉంది. అవకాశం వచ్చినప్పుడే విస్తరించాలన్నది కమలనాథుల కల. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి క్రమక్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సఫలమైంది. ఇదే సూత్రం తెలంగాణ, ఏపీల్లోనూ అమలు చేసేందుకు బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ పూనుకున్నారు. అందుకే సీట్ల పెంపు కుదరదని, 2024 తర్వాతే అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరించాలని చట్టం అమలులో ఉన్నదని సాకు చూపారు ప్రధాని మోదీ.

సీట్ల పెంపుపై ఆశలతోనే ఇలా ఫిరాయింపులు

సీట్ల పెంపుపై ఆశలతోనే ఇలా ఫిరాయింపులు

కానీ అధికారంలో ఉన్న ప్రధాని మోదీని, బీజేపీని ఏమీ అనలేని పరిస్థితుల్లో ధ్వజమెత్తడానికి తేలిగ్గా కనిపిస్తున్నదీ కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీపైనే అభాండం వేసేసి కేసీఆర్ తన పని పూర్తి అయిందని అనిపించునుకున్నారు. 2014లో ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తన బలం పెంచుకున్న సీఎం కేసీఆర్.. అసెంబ్లీ సీట్లు పెరిగితే ఫిరాయింపు దారులు, పార్టీ వారికి సమానంగా టిక్కెట్లు ఇచ్చుకోవచ్చునన్న ఆలోచన.. కేంద్రం నిర్ణయంతో తిరగబడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయనే పేరుతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. కానీ పరిస్థితి ఎదురు తిరిగే సరికి మిగతా 20 స్థానాలకే తమకు అభ్యర్థులు లేరనే సరి కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్.

అందుకే అసెంబ్లీ సీట్ల నో అన్న కమలనాథులు

అందుకే అసెంబ్లీ సీట్ల నో అన్న కమలనాథులు

అసెంబ్లీ సీట్లు పెంచేందుకు ససేమిరా అన్న బీజేపీకి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎందుకు మద్దతునిస్తున్నారంటే షరతుల వారీగా మద్దతని సాకులు చెప్పారు. ఆ షరతులేమిటో ఆయన మాత్రం చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు మద్దతునిస్తుందా? ఏపీ కంటే అదనంగా నిదులు కేటాయించినందుకు అనుకూలంగా ఉన్నారా? ఏ ప్రాతిపదికన మద్దతు ఇచ్చారో దాటవేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన ముందే ప్రధాని తనతో మాట్లాడితే దళితుడ్ని నిలబెట్టాలని సూచించినట్లు చెప్పారు.

అంతకుముందే కాంగ్రెస్ రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినా అందుకు సుముఖత వ్యక్తం చేయకపోగా.. అధికార రాజకీయాలు చేస్తున్న నేపథ్యం టీఆర్ఎస్. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చామన్నారు కేసీఆర్. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ వాసి కావడమే కాదు.. తెలంగాణ బిల్లు ఆమోదం విషయమై రాజ్యసభలో ఎన్ని రకాల కిరికిరిలు పెట్టారో అందరికీ తెలిసిన సత్యమే. హోదా కావాలని పట్టుబట్టి.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో ప్రకటన చేయించారు. కానీ సాటి తెలుగు వాడిగా వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పక్షాన చేసిందేమిటో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెప్పాలి మరి.

తెలంగాణకు చేసిన మేలేమిటి? అన్నది అనుమానమే?

తెలంగాణకు చేసిన మేలేమిటి? అన్నది అనుమానమే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యవిద్యా కళాశాలలు పుష్కలంగా ఉన్నా.. ఆగమేఘాల మీద గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘ఎయిమ్స్' ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. 2014 తొలి బడ్జెట్ సమావేశాల తర్వాత టీఆర్ఎస్ ఎంపీల విజ్నప్తి మేరకు నాటి ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మూడేళ్లయినా అతీగతీ లేదు. కానీ ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్బంగా జితేందర్ రెడ్డి తదితరులు తీవ్ర నిరసన తెలిపాక ఏర్పాటు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభ సాక్షిగా ప్రకటించారు. కానీ తర్వాత బడ్జెట్ పద్దుల్లో ఈ విషయం చేర్చారా? లేదా? అన్న సంగతి తెలీలేదు. దాని ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం ఉంటుంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక స్థల సేకరణ జరుగడానికి చాలా సమయం ఉన్నది? ఎయిమ్స్ ఏర్పాటు సంగతి పక్కనబెడితే ‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం' మిగతా హామీల అమలు ఊసే లేదంటే అతిశేయోక్తి కాదు.

పోలీసుల దాష్టీకం వాస్తవాలివి...

పోలీసుల దాష్టీకం వాస్తవాలివి...

ఇక నేరళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం అనుకోకుండా జరిగిపోయిందని సీఎం కేసీఆర్ దాటవేయడానికి ప్రయత్నించారు. నిజమే ఆందోళనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పే.. కాదనలేరు ఎవరూ? కానీ అదుపులోకి తీసుకుని మూడు, నాలుగు రోజులు చిత్ర హింసల పాల్జేసి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన ఘనత సిరిసిల్ల మండల పోలీసులది. ఆ చిత్రహింసలు ఎలా ఉంటాయన్న విషయం బుధవారమే కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలైన బాధితులను అడిగితే తెలుస్తుంది మరి. ‘ఎవడో చస్తే మీకెందుకురా? లారీలు తగులబెడతారా?' అంటూ తమను చావ బాదారని నేరెళ్ల బాదితులు చెప్పారు. నేరెళ్ల, జిల్లెల, రామచంద్రపురం గ్రామాల వాసులను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంగతి బయటకు రావడంతో ఆందోళన జరిగింది. న్యాయస్థానం రిమాండ్ విధించిన తర్వాత జైలుకు తీసుకెళితే.. వారిని లోపలకు అనుమతించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. ఎందుకంటే వారు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు.. తమకు సమస్యగా మారుతుందనే జైలు అధికారులు నిరాకరించడంతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించారు.

అరెస్టయిన వారిపై పోలీసులు అనుసరించిన విధానం అసహ్యకరంగా ఉన్నది. కుళ్లబొడిచాక ‘మీరు మీ పెళ్లాలతో కాపురాలేం చేస్తారు. మా వద్దకు పంపండి' అని పోలీసులే వెటకారం చేశారని వార్తలు ప్రచురితం అయ్యాయంటే వారెంత దారుణంగా వ్యవహరించారో అవగతమవుతూనే ఉన్నది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ నాయకులు.. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను రప్పించడం కూడా సీఎం కేసీఆర్ కు నచ్చలేదు. అంటే ప్రభుత్వం ఏం చేసినా విపక్షాలు మద్దతుగా నిలువాలని ఆయన కోరుకున్నట్లు కనిపిస్తున్నది. కానీ వాస్తవమేమిటంటే ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం, సమాజం ద్రుష్టికి తేవాల్సిన బాధ్యత విపక్షాలదన్న సంగతి విస్మరించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
​Hyderabad: Calling the Congress party as Villain No. 1 of Telangana State and alleging that it was obstructing the development, Chief Minister K Chandrasekhar Rao asked the Congress to “stop this nuisance and nonsense”. KCR said that the Congress had played a suspicious role towards Telangana since beginning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X