• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిట్టా పట్టా: నోట్లరద్దుకు ఏడాది.. ఆగిన పెళ్లిళ్లు.. నిలిచిపోయిన శస్త్రచికిత్సలు

By Swetha Basvababu
|
  Did Notes Ban Choke Black Money

  న్యూఢిల్లీ: మన జేబులో ఉన్న పెద్ద నోట్ల విలువ కోల్పోయిన రోజు.. మనం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు బ్యాంకుకు చేరితే తప్ప చిత్తు కాగితాలుగా మారుతాయని తెలిసిన రోజు.. గత దశాబ్దిలో దేశ ప్రజలపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయం తీసుకున్న రోజు 2016 నవంబర్ 8. అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాత్రి ప్రధాని నరేంద్రమోదీ రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేస్తున్నట్లు టీవీ చానెళ్ల సాక్షిగా ప్రకటించారు. ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుందని.. ఆర్థిక చిత్రమే మారిపోతుందని ప్రకటించారు. ప్రజల్లో దేశం పట్ల ఉన్న ప్రేమనే పావుగా మార్చుకొంటూ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలను భరించాలని.. తమతో కలిసి రావాలని కోరారు. నల్లధనానికి చరమ గీతం పాడినట్లవుతుందన్న ఆయన ప్రకటనను జాతి ముక్తకంఠంతో ఆమోదించింది.

  కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని మోదీ పెద్ద నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేయడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కాయకష్టం చేసి పెద్ద అవసరాలొస్తే ఆసరాగా ఉంటాయని దాచుకున్న డబ్బును బ్యాంకులో మార్చుకొనేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల్లో దాచిన ప్రజల సొమ్ములు కూడా వారి అవసరాలకు చేతికందకుండా పోయాయి. ఫలితంగా పెళ్లిళ్లు ఆగిపోయాయి డబ్బులు సమయానికి చేతికందక శస్త్రచికిత్సలు ఆగిపోయాయి.

  బడాబాబులకు కోట్లలో కొత్త కరెన్సీలోకి మారిన నల్లధనం

  బడాబాబులకు కోట్లలో కొత్త కరెన్సీలోకి మారిన నల్లధనం

  వేతన జీవులైతే బతుకు బండి లాగేందుకు అవసరమైన సొమ్ము కోసం ఏకంగా ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ బ్యాంకుల ముందుకు కుస్తీ పడాల్సిన పరిస్థితులు ప్రజలను దాదాపు కంటతడి పెట్టించాయి. బ్యాంకుల్లో వేలల్లో సొమ్ములున్నా సర్కారు ఆంక్షలతో కేవలం రూ.2000లతో సర్దుకోవాల్సిన దుస్థితితో నానాఅవస్థలు పడ్డారు. ఇదిలా ఉంటే బ్యాంకు అధికారులు మాత్రం బడా బాబుల ఇంటి వద్దకే కమీషన్‌కు కొత్త కరెన్సీని చాటుకొని దర్జాగా కాసులు వెనుకేసుకున్నారు. వారి వద్ద రద్దు చేసిన కరెన్సీ రూపంలో ఉన్న కోట్లాది రూపాయల నల్లధనం రాత్రికి రాత్రే కొత్త కరెన్సీల రూపంలోకి మారిపోయింది. కానీ పేదలు మాత్రం పడరాని పాట్లు పడుతూ పెద్దవారితో పోటీపడలేక క్యూలైన్లలోనే తుది శ్వాస విడిచిన సంఘటనలు కోకొల్లలే.

   దేశ ప్రగతిపై ప్రతికూల ప్రభావం

  దేశ ప్రగతిపై ప్రతికూల ప్రభావం

  ఆర్థిక నిపుణులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం కేంద్రం, ప్రధాని మోదీ అద్భుత నిర్ణయం తీసుకున్నారని అభివర్ణిస్తే, మరో వర్గం నిపుణులు ప్రజలు, ఆర్థిక వ్యవస్థ పాలిట పీడకలగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కానీ కాలం ఆగదుగా.. అలా ఒక ఏడాది కాలగర్బంలో కలిసిపోయింది. మరో నవంబర్ 8 రానే వచ్చింది. నోట్ల రద్దు నిర్ణయం అమలుచేసి ఏడాది పూర్తయింది. కానీ దీని ప్రభావం దేశ ప్రగతిపై పడిందనేది ఎవరూ కాదనలేని నిష్ఠూర సత్యం. నల్లధనాన్ని రూపుమాపి, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం, ఉగ్రవాదుల మూలాలు దెబ్బ తీయడమే నోట్ల రద్దుకు ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. దీంతో అప్పటివరకు చలామణిలో ఉన్న 86 శాతం పెద్దనోట్లు బ్యాంకులకు చేరితే తప్ప పనికిరాని స్థితికి చేరుకున్నాయి. లక్ష్యాలు నిజంగా నెరవేరాయా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కానీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నోట్లరద్దుతో నల్లధనం బ్యాంకులకు చేరదని ప్రభుత్వం భావించింది.

   లక్ష్యాలు నెరవేరలేదన్న అర్థక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్

  లక్ష్యాలు నెరవేరలేదన్న అర్థక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్

  కానీ రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని ఈ ఏడాది ఆగస్టులో రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది. రూ.15.28 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దు కాగా, రూ.15.44 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరాయి. నేపాల్‌లో స్థానికులు మార్చుకున్న నోట్లు, విదేశీయుల వద్ద ఉండిపోయి మార్పిడి చేసుకోని మొత్తాన్ని ఇందులో కలుపలేదు. మరి నల్లధనం ఎందుకు బయటికి రాలేదు.? దీనికి ప్రధాన కారణం.. నల్లధనం నోట్ల రూపంలో పోగయ్యిందని ప్రభుత్వం గుడ్డిగా నమ్మడం. అవినీతిపరులు నల్లధనంలో 94శాతాన్ని ఆస్తుల రూపంలోకి మళ్లిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. దేశంలో మూడు శాతం మంది మాత్రమే నల్లధనాన్ని పోగేస్తున్నారని, వారిని నియంత్రించాలనే గుడ్డి తపనతో 97 శాతం మందిని ఇబ్బంది పెట్టారని ఆర్థికశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ విమర్శిస్తున్నారు. చివరికి అర్ధక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ సైతం తాము అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని పేర్కొనడంతో వాస్తవ పరిస్థితేమిటో తేటతెల్లమవుతున్నది.

   ఉగ్రవాదులకు తగ్గని నిధులు

  ఉగ్రవాదులకు తగ్గని నిధులు

  నోట్లరద్దుతో నకిలీ నోట్లకు చరమగీతం పాడినట్టవుతుందని, ఉగ్రవాదులకు నిధులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ కొత్త నోట్లు వచ్చిన రెండు వారాల్లోనే నకిలీ కరెన్సీ తయారైంది. కలర్ ప్రింటర్లు, జిరాక్స్ మెషిన్లు ఉపయోగించి నకిలీ కరెన్సీ తయారుచేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులు భారీగా నకిలీ కరెన్సీ తయారు చేస్తూ, సరిహద్దు దాటిస్తున్నారని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. దేశంలోని నకిలీ నోట్ల విలువతో మొత్తం కరెన్సీతో పోలిస్తే 0.002 శాతానికి మించదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వీటి నియంత్రణకు నోట్ల రద్దు వంటి చర్య తీసుకోవడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సంధించడం వంటిదేనన్నారు. మరోవైపు నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల ఆర్థిక వనరులు తగ్గిపోలేదని, సానుభూతిపరుల నుంచి సేకరించిన కొత్తనోట్లు వారివద్ద భారీ సంఖ్యలో నిల్వ ఉన్నాయని ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఉన్నది.

   ఇలా డిజిటల్ ఎకానమీకి ఊతం

  ఇలా డిజిటల్ ఎకానమీకి ఊతం

  నోట్లరద్దుతో తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నా దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు హెచ్చరించారు. వారు చెప్పినట్టే నోట్లరద్దు ప్రభావం ఉత్తరప్రదేశ్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చింది. బ్యాంకుల నిల్వలు అమాంతం పెరిగిపోయాయి. కానీ ఆర్థిక ప్రగతి రాన్రాను కుంటుపడింది. ఈ ఏడాది మేలో కేంద్రం ప్రకటించిన లెక్కల ప్రకారం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు అంతకుముందుతో ఒక శాతం తగ్గి 6.1 శాతానికి పరిమితమైంది. అసంఘటిత రంగం మొత్తం నగదు లావాదేవీలపైనే ఆధారపడుతుందని, ఇది దేశ జీడీపీలో 45 శాతమని నిపుణులు చెప్తున్నారు. నోట్లరద్దుతో 80 శాతం అసంఘటిత రంగం దెబ్బతిన్నదని, ఫలితంగా జీడీపీ తగ్గుదలకు ఓ కారణమన్నారు. నోట్ల రద్దుతో డిజిటల్ ఎకానమీకి మాత్రం ఊతం వచ్చింది. ప్రజలు, సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్ చెల్లింపుల బాట పట్టారు. దీంతో అక్టోబర్ 2016- మే 2017 మధ్య ఆన్‌లైన్ లావాదేవీలు 56 శాతం పెరిగాయి. అదేవిధంగా 56 లక్షల మంది కొత్తగా పన్నుచెల్లింపుదారుల జాబితాలో చేరారు. ఇది గత ఏడాదితో పోల్చితే 24.7 శాతం ఎక్కువ. రద్దయిన నోట్లకు సమానంగా కొత్తనోట్లు చలామణిలోకి రావడంతో ఆన్‌లైన్ లావాదేవీలు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన వారిలో అధికశాతం మంది సంపాదన సగటున రూ.2.7 లక్షలు ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. అంటే వారి నుంచి వసూలయ్యే పన్ను నామమాత్రం.

   కానీ ఇప్పుడు బడాజిరాలో కనిపించని క్యాష్ లెస్ అంతా నగదే

  కానీ ఇప్పుడు బడాజిరాలో కనిపించని క్యాష్ లెస్ అంతా నగదే

  ప్రధాని మోడీ నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నాక నగదు రహిత లావాదేవీలంటూ మార్మోగింది. మధ్యప్రదేశ్‌ లోని ఓ గ్రామాన్ని దేశంలోనే తొలి నగదు రహితమని ప్రకటించారు. కానీ ఏడాది తర్వాత అక్కడ నగదు లేనిదే ఏ పనీ కావటంలేదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బడాజిరా గ్రామమది. అక్కడ నగదు రహితమనే మాటే వినిపిరచటంలేదు. దీని ప్రభావం మచ్చుకైనా కనిపించటం లేదు. నోట్లరద్దు తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బడాజిరాను తొలి నగదు రహిత గ్రామంగా ప్రకటించింది. శివరాజ్‌ చౌహాన్‌ సర్కారు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సహకారంతో పలు కార్యక్రమాలు చేపట్టింది. పీఓఎస్‌ మిషన్లు, క్యాష్‌లెస్‌ లావాదేవీలకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బడాబాబులు మాత్రం పీఓఎస్‌ మిషన్లు ఉంచుతున్నారు. ఇప్పుడు నగదురహిత లావాదేవీలు అస్సలు జరగటంలేదని స్థానికుడు అనిల్‌ తెలిపాడు. ప్రస్తుతం పీఓఎస్‌ మిషన్లు ఉంచుకుంటే ఎలాంటి ప్రయోజనం కూడా లేదని తెలిపాడు. దేశంలో తొలి నగదురహిత గ్రామంగా చెప్పుకున్నాక.. అక్కడ కొద్ది రోజులపాటు నగదు రహిత లావాదేవీలు జరిగిన తర్వాత బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కార్ కూడా లైట్‌ తీసుకుంది. సామాన్య, పేద, మధ్యతరగతి జనం వద్ద ఉండే కొద్దిపాటి డబ్బు ఉంచుకోవటమే సరైనదే భావనతో.. నగదు రహిత గ్రామం కాస్త నగదుకే పరిమితమైంది.

   ఒక శాతం పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు

  ఒక శాతం పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు

  ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.3 లక్షల కోట్ల నల్లధనం ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం రూ.16,000 కోట్ల నల్లధనం బయటపడిందని చెప్పింది. నోట్లరద్దుతో జీడీపీ వృద్ధి రేటు ఒక శాతం మేర పడిపోయింది. ఇది రూ.1.5 లక్షల కోట్లకు సమానం. కొత్తనోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ.4,545 కోట్లు వెచ్చించింది. చెల్లకుండా పోయిన రూ.500, రూ.1000 నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. అందులో దాదాపు 99 శాతం బ్యాంకులకు తిరిగొచ్చింది.

   ఎంత మొత్తం నల్లధనం వెలికితీశారో వెల్లడి కానీ వైనం

  ఎంత మొత్తం నల్లధనం వెలికితీశారో వెల్లడి కానీ వైనం

  నోట్ల రద్దు సందర్భంగా నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణల సమయంలో బ్యాంకులు, ఏటీఎంలు తదితర ప్రాంతాల్లో 100 మంది మరణించారని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఇంతకుముందు లోక్‌సభలో రాతపూర్వకంగా చెప్పారు. పట్టుబడిన గుర్తు తెలియని ఆదాయం 13,920 కోట్లు.. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల సంఖ్య 1,152. గతంతో పొల్చితే 158 శాతం సోదాలు పెరిగాయి. నోట్ల రద్దుతో పెరిగిన పన్ను చెల్లింపుదారులు 15.2 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ప్రభుత్వం పొందిన పరోక్ష పన్నులు 4.39 లక్షల కోట్లు. కొత్తగా 1.26 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు చేరినట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. నోట్ల రద్దుకు ముందు రూ.17వేల కోట్లు డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ఉపసంహరించుకున్న 35వేల కంపెనీల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. రెండేండ్లకుపైగా క్రియాశీలంగా లేని 2.24లక్షల కంపెనీలను ప్రభుత్వం రద్దు చేసింది. గుల్ల కంపెనీల్లో అనర్హతవేటు పడిన డైరెక్టర్ల సంఖ్య 3.09 లక్షలు.. ఇవన్నీ ప్రభుత్వ అధికారిక లెక్కలు.. కానీ నోట్లరద్దు ప్రక్రియ ద్వారా ఎంత మొత్తంలో నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. నగదు రహిత లావాదేవీలు పెరుగడం, పన్ను ఎగవేత తగ్గడం ద్వారా నల్లధనాన్ని దేశం నుంచి పారదోలవచ్చని ప్రభుత్వం చెప్తున్నది.

  English summary
  NEW DELHI: In his speech on November 8 last year, announcing the ban on high value currency, Prime Minister Narendra Modi set out the reasons for the dramatic move - striking a blow against black money, terrorism and fake currency. One year later, it is time to assess whether any of these claims were achieved, starting with black money. The government initially suggested that a good chunk of demonetised notes will not enter the banking system; that amount is the black money, they said, that will get wiped out.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X