నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల ఫలితం: జగన్ స్వయంకృతం, బాబు ముందస్తు వ్యూహం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై అధికార తెలుగుదేశం పార్టీలో చేరి అందలాలు అనుభవిస్తున్నారన్న దుగ్ధ ప్రతిపక్ష పార్టీలోనూ, నాయకుడిలోనూ కలిగిందన్న అనుమానాలు ఉన్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఉత్కంఠ కనిపించినా.. ఆఖరుకు అధికార తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నంద్యాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై హఠాన్మరణం పాలైన భూమా నాగిరెడ్డికి తొలి నుంచి ఈ ప్రాంతంలో పట్టు ఉంది. అంతకుముందే మూడేళ్ల క్రితం ఆయన భార్య శోభా నాగిరెడ్డి కూడా మరణించారు.

భార్యాభర్తలు మూడేళ్లలోపు మరణించడంతో ప్రస్తుతం మంత్రి భూమా అఖిలప్రియపై వారి కుటుంబంపై సహజంగానే ప్రజల్లో సానుభూతి స్పష్టంగా ఉంటుందన్న సంగతి కాదనలేని నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై అధికార తెలుగుదేశం పార్టీలో చేరి అందలాలు అనుభవిస్తున్నారన్న దుగ్ధ ప్రతిపక్ష పార్టీలోనూ, నాయకుడిలోనూ కలిగిందన్న అనుమానాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం 2014లో ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఉప ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అఖిలప్రియనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

అప్పటివరకు గల సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల్లో భూమా కుటుంబం టీడీపీకి దగ్గరైంది. తదనంతర పరిణామాల్లో అనూహ్యంగా నాగిరెడ్డి హఠాన్మరణం పాలవ్వడం.. చంద్రబాబు క్యాబినెట్‌లోకి అఖిలప్రియను తీసుకోవడం జరిగిపోయాయి.

ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి కంటగింపుగా మారిందని విమర్శకుల అభిప్రాయం. అందుకే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపేందుకు సాహసించి.. ఓటమి పాలవ్వడంతో తన వ్యూహం తప్పిదమని రుజువు చేసుకున్నారు. ఈ క్రమంలో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ఆచితూచి ముందుకు సాగే సీఎం చంద్రబాబు వ్యూహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి, టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరిన శిల్పా మోహన రెడ్డి సోదరులు నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలతో భారీ మూల్యమే చెల్లించారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ అనుసరించిన వ్యూహం వల్లే అన్ని ప్రాంతాల్లోనూ సైకిల్ జోరుగా ముందుకు సాగిందని నంద్యాల ఉప ఎన్నిక ఫలితం చెబుతున్నది.

మైనారిటీల ప్రాంతాల్లో టీడీపీకి భారీ మెజారిటీ

మైనారిటీల ప్రాంతాల్లో టీడీపీకి భారీ మెజారిటీ

మైనారిటీలు తమ పక్షమేనని గతంలో కాంగ్రెస్‌, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా ఇదే. నంద్యాల ముస్లింలు వారి వైసీపీ అంచనాలను తల్లకిందులు చేశారు. అసాధారణ రీతిలో అధికార పక్షానికి మద్దతుగా నిలిచారు. మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల ఓట్లను లెక్కించినప్పుడు అధికార పార్టీకి భారీ మెజారిటీ నమోదైంది. అది ఇతర ప్రాంతాలకంటే దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి పట్టణ ప్రాంతంలో 20,516 ఓట్ల మెజారిటీ వచ్చింది. పాత పట్టణంలో మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు. ఈ ప్రాంతంలో 13,447 ఓట్ల మెజారిటీని టీడీపీ అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి సాధించారు. పట్టణంలోని ఇతర ప్రాంతాల్లోకానీ, నంద్యాల రూరల్‌, గోస్పాడు మండలంలోకానీ ఏ రౌండ్‌లోనూ ఈ స్థాయి మెజారిటీ నమోదు కాలేదు. ఆ ప్రాంతంలో సాంప్రదాయక టీడీపీ ఓటు బ్యాంకుకు మైనారిటీలు తోడు కావడంతో భారీగా మెజారిటీ పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మైనారిటీలు అండగా నిలిచిన సామాజికవర్గాలు నంద్యాలలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆయా సామాజిక వర్గాలు అధికార తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచాయి. ఈనెల 20న సీఎం చంద్రబాబు ఆయా సామాజిక వర్గాలతో విడివిడిగా సమావేశమై టీడీపీకి అండగా నిలవాలని కోరారు. చంద్రబాబు మాటలను ఆయా వర్గాలు విశ్వసించాయి. పట్టణంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బలిజలు, వ్యాపారులు టీడీపీ పక్షాన నిలబడ్డారు. ఎస్సీలు, క్రిస్టియన్లు సైతం సైకిల్‌పై షికారు చేశారని ఈ రౌండ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తుందని ఆపార్టీ వర్గాలు వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకపోగా టీడీపీ ప్రతి రౌండ్‌లో ఆధిక్యత ప్రదర్శించింది.

ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ పదవితోపాటు మండలి చైర్మన్ పదవి ఇస్తారా?

ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ పదవితోపాటు మండలి చైర్మన్ పదవి ఇస్తారా?

మైనారిటీల్లో అధికశాతం టీడీపీ వైపు మొగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ముస్లింలలో బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో సాన్నిహిత్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీతో జగన్ భేటీ కావడం, రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి మద్దతు పలకడం, చినజీయర్‌ స్వామికి వందనం చేయడం వంటివి ముస్లింలు, క్రిస్టియన్లలో వ్యతిరేక ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ముస్లింలలో ఓ వర్గం శిల్పా మోహన్‌రెడ్డిపై గుర్రుగా ఉంది. దీన్ని టీడీపీ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది.

ఆ వర్గాలకు చెందిన వారిపై ఉన్న కేసులను తీసివేయించి వారి నమ్మకాన్ని చూరగొంది. ఆ వర్గాలకు చెందిన నేతలు ఫరూక్‌, నౌమాన్‌ వంటి వారికి ఉన్నతస్థాయి రాజకీయ పదవులను ఇవ్వాలన్న నిర్ణయం కూడా టీడీపీకి కలిసొచ్చింది. ఇప్పుడు ఎన్ఎండీ ఫరూఖ్‌కు శాసనమండలి సభ్యత్వంతోపాటు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తారా? శాసనమండలి చైర్మన్‌గా ఎంపికచేస్తారా? అన్న సంగతి మున్ముందు తేలాల్సి ఉన్నది. ఇక నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికపై జరిగిన రాజకీయ విశ్లేషణలో పాల్గొన్న అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలు ఆయన భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా ఉన్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉండి ఉండొచ్చు. కానీ చంద్రబాబులో లేని లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సబ్బం హరి వ్యాఖ్యానించారు. అది అన్ని రాజకీయ పార్టీల నాయకులు అనుసరించాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చేశారు.

2002లో హైదరాబాద్ ఎన్నికల్లో అలా.. నంద్యాల ఎన్నికపై ఇలా

2002లో హైదరాబాద్ ఎన్నికల్లో అలా.. నంద్యాల ఎన్నికపై ఇలా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీసారి ఆపదమొక్కుల నిర్ణయాలు తీసుకోవడంలో ఘనాపాటి. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవడం కోసం క్రుష్ణ యాదవ్‌ను పక్కకు తప్పించారు. నాడు హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూనే ఈ ఎన్నికల్లో గెలుపొందకపోతే రాజకీయాలు చేయడమే వ్యర్థమని సవాల్ విసిరారు. అందుకు తగ్గట్లుగానే ఎంఐఎంకు పాతబస్తీలో భారీగా ఓట్లు పోలైన డివిజన్ల పరిధిలో బ్యాలట్ బాక్సులు తెరిచి మాయ చేశారని అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి.

తాజాగా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకముందే ‘ఈ ఎన్నిక దేశవ్యాప్త చర్చకు నాంది ప్రస్తావన కావాలి' అని అన్నారు. అంటే పరోక్షంగా తామే గెలుపొందుతామని సంకేతాలిచ్చారు. ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత తాము పోల్ మేనేజ్మెంట్ చేయలేదని మీడియాతో చెప్పారు. అదే నిజమైతే పలువురు మంత్రులు.. 60 మంది ఎమ్మెల్యేలతో నియోజకవర్గంలో తిష్ట వేయాల్సిన అవసరమేమిటో.. అదీ కూడా ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు, మంత్రులు నంద్యాలలోనే బస చేయాల్సిన అవసరం ఏమిటో మరి చంద్రబాబు గారే చెబితే బావుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘నేను మారాను‘ అని పదేపదే ప్రచారంతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్యాబినెట్ లో ఇప్పటికీ ముస్లిం నేత లేరు. కానీ ఆ విషయం మాట్లాడితే సమీకరణాల ప్రభావం అంటారు.

అంటే ఓట్లేయడానికి అన్ని వర్గాలు కావాలి. కానీ పదవులివ్వడానికి మాత్రం జిల్లాల వారీ, బంధువుల వారీ, సామాజిక వర్గాల సమీకరణాలు ముందుకు వస్తాయన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన ఎన్ఎండి ఫరూఖ్‌ను మూడేళ్లుగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సమస్యాత్మకంగా మారడంతో అకస్మాత్తుగా ఆయనకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారు. ఇందుకోసం ముందే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ ఇచ్చిన ఆనం సోదరులకు మొండి చేయి చూపారు. 2004 నుంచి మూడుసార్లు ఎన్నికల్లో ఓటమి పాలైన సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డికి ఎమ్మెల్సీగా చోటు కల్పించి.. క్యాబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు.. ఆనం సోదరుల ఊసే మరిచిపోయారు.

ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవికి మూడునెలల్లోనే తమ్ముడి రాజీనామా

ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవికి మూడునెలల్లోనే తమ్ముడి రాజీనామా

ఉప ఎన్నికలని తెలిసీ, అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నదనీ తెలిసి ఆ పార్టీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యం శిల్పా మోహన రెడ్డిది. ‘నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలో డబ్బు, భూమా కుటుంబంపై సానుభూతి పనిచేశాయి. అందుకే టీడీపీ విజయం సాధించింది. ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ ఒక్కో ఓటుకు రూ. 2000 నుంచి రూ.5000 పంచింది. నంద్యాల అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేశారనేది అవాస్తవం. మాకు మెజార్టీ వస్తుందనుకున్న ప్రాంతాల్లో కూడా రాలేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజల తీర్పును శిరసావహిస్తా. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న నా సవాల్‌కు అఖిలప్రియ స్పందించలేదు. అప్పుడు ఆమె స్పందించి ఉంటే ఇప్పుడు నేను నా నిర్ణయం చెప్పి ఉండేవాడిని' అని వ్యాఖ్యానించిన శిల్పా మోహనరెడ్డి, ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి రెంటికీ చెడ్డ రేవడిగా మారారు. 2014 ఎన్నికల్లో ఇదే నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి భూమా నాగిరెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి శిల్పా మోహనరెడ్డి మరిచిపోవడం కద్దు.

రాజకీయ అభద్రత, గెలుపుపై అతి విశ్వాసంతో అన్న! చివరికి... చివరికి ఇద్దరూ దెబ్బతిన్నారని శిల్పా సోదరులపై ఒకింత సానుభూతి వ్యక్తమవుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ సోదరులు తీసుకున్న అనూహ్య నిర్ణయాలు.. వారి జాతకాలను తారుమారు చేశాయి. 2014లో టీడీపీ నుంచి శిల్పా మోహన్‌ రెడ్డి పోటీ చేసి భూమా నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినందున, ఉప ఎన్నికల్లో తనకే అవకాశం ఇవ్వాలని శిల్పా సీఎం చంద్రబాబు వద్ద పట్టుబట్టారు. ఈ విషయంలో భూమా అఖిల ప్రియకు సర్దిచెప్పి... శిల్పా మోహన్ రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని ఒక దశలో చంద్రబాబు భావించారు.

ఈలోపే అఖిలప్రియ చకచకా పావులు కదుపుతూ, నియోజకవర్గంలో దూసుకుపోయారు. ఈ క్రమంలో శిల్పా అభద్రతా భావానికి లోనయ్యారు. నియోజకవర్గంపై పట్టు కోల్పోతామనే ఉద్దేశంతో వెనువెంటనే టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఓడిపోయారు. ‘‘అన్న వేరు.. రాజకీయాలు వేరు. నేను టీడీపీలోనే ఉంటాను'' అని తొలుత శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటానని జగన్‌ షరతు పెట్టడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పదవిని వదులుకున్నారు. నంద్యాలలో శిల్పా సోదరుల హవా తగ్గలేదని చాటాలని చక్రపాణిరెడ్డి అమలు చేసిన వ్యూహాలు పని చేయలేదు. టీడీపీలో ఉండి శాసనమండలి చైర్మన్‌ కావాల్సిన చక్రపాణిరెడ్డి తొందరపాటుతో భారీ మూల్యం చెల్లించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Nandyal assembly bye election result is expected. In this episode AP CM Chandra Babu stratergy and Opposition leader YS Jagan failure clearly indicated. Sympathy on Bhuma family played in this election. But YS Jagan didn't consider this option. At the same time Power party only wins in bye elections is natural condition. This is also YS Jagan not expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X