• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్‌కే తెలీదు-అసలు కథేంటో: జైపాల్Vsఉండవల్లి, మధ్యలో పొన్నం

|

హైదరాబాద్‌: మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఓ మీడియా ఛానెల్‌ నిర్వహించిన చర్చా వేదికలో మాట్లాడుతూ వీరిద్దరూ తమదైన శైలిలో ఒకరిపై ఒకరు వాక్బాణాలు సంధించుకున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంలో చోటు చేసుకున్న ఘటనలపై వీరిద్దరూ తమతమ వాదనను బలంగా వినిపించారు.

కాగా, తన వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో తాను అతి కీలక నిర్ణయాత్మక పాత్ర పోషించానని, చరిత్రాత్మక సమయంలో భాగస్వామిగా వ్యవహరించానని చెప్పారు. అంతేగాక, 'అప్పట్లో కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ చేతులు ఎత్తేశారు. బీజేపీపక్ష నేత సుష్మా స్వరాజ్‌ కాంగ్రెస్‌ చిత్తశుద్ధినే అనుమానిస్తున్నారు. ఆ సమయంలో కమల్‌నాథ్‌, సుష్మా స్వరాజ్‌ మధ్య సయోధ్య కుదిర్చాను. డివిజన్‌ అవసరం లేకుండా బిల్లు ఆమోదానికి మార్గం చూపాను' అని జైపాల్ వివరించారు.

హెడ్‌ కౌంట్‌ కూడా చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించారని, అప్పట్లో స్పీకర్‌ చాంబర్లో కుట్ర జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తన 'విభజన కథ' పుస్తకంలో ఊహించారు కాగా, దానిని జైపాల్‌ రెడ్డి ఖండించారు.

'బీజేపీ పక్ష నేత సుష్మా స్వరాజ్‌, స్పీకర్‌ మీరాకుమార్‌ సహకరించడం లేదని కమల్‌నాథ్‌ చెప్పారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సుష్మ మోసం చేస్తారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు న్యాయంగా ఆలోచించడం లేదని, బిల్లును పాస్‌ చేయకుండా బీజేపీని అపకీర్తి పాలు చేయాలని చూస్తున్నాడని సుష్మ చెప్పారు. ఒకరిపై మరొకరు పరస్పర అపనమ్మకంతో ఉన్నారు. సభ సజావుగా సాగనప్పుడు ఓటింగ్‌ ఎలా నిర్వహిస్తామని స్పీకర్‌ మీరాకుమార్‌ సందేహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో నేను రంగంలోకి దిగాను. స్పీకర్‌ చాంబర్లో మీరాకుమార్‌, సుష్మ, కమల్‌నాథ్‌లతో మాట్లాడాను. సుష్మ, కమల్‌నాథ్‌ మధ్య అపనమ్మకం తొలగించాను. 367-3 నిబంధన ప్రకారం డివిజన్‌ లేకుండా హెడ్‌ కౌంట్‌తో బిల్లును ఆమోదించవచ్చని చెప్పాను. స్పీకర్‌ తన సిబ్బంది ద్వారా రికార్డులను పరిశీలించుకుని నిజమని తేల్చుకున్నారు. సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత హెడ్‌ కౌంట్‌ చేపట్టారు. ఆ సమయంలో సుష్మతోపాటు ఆడ్వాణీ కూడా లేచి నుంచున్నారు' అని జైపాల్ వివరించారు.

 Jaipal and undavalli on bifurcation

తనకున్న విశ్వసనీయతతోనే ఆరోజు సుష్మ, కమల్‌నాథ్‌, మీరాకుమార్‌లను ఒప్పించానని తెలిపారు. స్పీకర్‌ చాంబర్లో జరిగిన విషయాలను బయటకు చెప్పడం సంప్రదాయం కాదనే ఇప్పటి వరకూ తాను బయట పెట్టలేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ సోనియా గాంధీకే రావాలని, దానిని పదిమంది పంచుకోరాదనే ఇప్పటి వరకూ తన కృషిని చెప్పలేదని తెలిపారు.

ప్రచారం కోసం పాకులాడే మనస్తత్వం తనది కాదని, అందుకే తెలంగాణ సాకారం కావడానికి తాను చేసిన కృషిని చెప్పలేదన్నారు. ఆరోజు స్పీకర్‌ చాంబర్లో జరిగిన చర్చ కానీ, బిల్లు ప్రవేశ పెడుతున్న విషయం కానీ కేసీఆర్‌కు తెలియదని చెప్పారు. ఉద్యమంలో ఆయనకు అద్వితీయ పాత్ర ఉన్నా.. పార్లమెంటులో బిల్లు ఆమోదంలో ఆయనకు ఎటువంటి పాత్ర లేదని, ఏం జరుగుతోందో ఆయనకు తెలియదని చెప్పారు.

ఉండవల్లి వాదన

అయితే, బిల్లును ఆమోదించడానికి కావాల్సిన సభ్యుల సంఖ్య ఆరోజు లేదని, సింపుల్‌ మెజారిటీతోనే బిల్లును ఆమోదించడానికి బలం లేదని, అందుకే 367-3 ద్వారా హెడ్‌ కౌంట్‌ కూడా జరపకుండా బిల్లు ఆమోదం పొందినట్లు చెప్పారని ఉండవల్లి ఆరోపించారు. అసలు ఆరోజు బిల్లు పాసవ్వలేదని, అందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు.

ప్రత్యక్ష సాక్షిని: సుష్మ కాళ్లు పట్టుకున్నానన్న పొన్నం

తెలంగాణ రాష్ట్రం కోసం విభజన బిల్లు సమయంలో తాను బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్న విషయం నిజమేనని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే తాను సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని, ఆమె తమ పార్టీ నేత కాదు కాబట్టి ఆ విధంగా బతిమిలాడుకోవాల్సి వచ్చిందని పొన్నం పేర్కొన్నారు.

విభజన బిల్లుకు తాము మద్దతు ఇచ్చిన తర్వాత హెడ్ కౌంట్ అవసరం లేదని నాడు సుష్మాస్వరాజ్ చెప్పారన్నారు. పార్లమెంట్ లో విభజన బిల్లు పాస్ అయినపుడు ప్రత్యక్ష సాక్షిగా తాను అక్కడ వున్నానని పొన్నం చెప్పారు.

సోనియా పట్టుదల, సుష్మ హామీ, తెలంగాణ ఎంపీల చొరవతో మొత్తంమీద బిల్లు పాసయిందని, ఆరోజు అలా చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం వ్యాఖ్యానించారు.

జరిగిన దానిని నెమరు వేసుకుని బాధ పడేకంటే రెండు రాష్ట్రాలూ అభివృద్ధిలో ముందుకు వెళ్లడం ఎలా అనే అంశాన్ని ఆలోచించాలని చెప్పారు. పార్లమెంటులో ఎన్నో బిల్లులను ఆమోదించారని, తెలంగాణ బిల్లును కూడా అలాగే ఆమోదించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు.

జైపాల్‌ రెడ్డి తన వల్లే తెలంగాణ వచ్చిందని అంటున్నారని, అది తప్పని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. సోనియా ఆదేశాలు, కేసీఆర్‌ ఒత్తిడితోనే సుష్మ, కమల్‌నాథ్‌ ఆరోజు పని చేశారని, రాజ్యాంగ నిబంధనల గురించి స్పీకర్‌ కార్యాలయానికి తెలుసని, జైపాల్‌ చెప్పాల్సిన పని లేదని విమర్శించారు. రాజు ఎప్పుడైనా వెనక ఉండే వ్యూహాన్ని నడుపుతాడని, అలాగే, కేసీఆర్‌ కూడా ఫామ్‌ హౌస్‌లో ఉండే వ్యూహ రచనలు చేశారని తెలిపారు.

ఉండవల్లిపై జైపాల్

రాష్ట్ర విభజనపై ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకంలోని ఊహలను, కట్టుకథలను తాను ఖండించకపోతే, చివరికి అవే ప్రామాణికమవుతాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఉండవల్లి తన పుస్తకంలో కట్టుకథలు రాశారని అన్నారు. తెలంగాణ బిల్లు తెచ్చే విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధిలేదని సుష్మాస్వరాజ్, అప్పటి స్పీకర్ మీరాకుమార్ తో వాదనకు దిగారని, ఆ వాదన జరుగుతుండగా తాను స్పీకర్ ఛాంబర్ కు వెళ్లానని చెప్పారు.

ఆ రోజు స్పీకర్ ఛాంబర్ లో ఏమి జరిగిందో చాలా మందికి తెలియదని, జైరాం రమేష్ కు కూడా తెలియదని ఆయన అన్నారు. నాడు పార్లమెంట్ లో విభజన బిల్లును సుశీల్ కుమార్ షిండే ప్రవేశ పెట్టారని, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ మాట్లాడారని అన్నారు. అద్వానీ కూడా బీజేపీ నిర్ణయానికి కట్టుబడి విభజన బిల్లుకు అనుకూలంగా లేచి నిలబడ్డారని అన్నారు. తెలంగాణ బిల్లు ఆరోజు పాస్ కావడంలో తనది అతి కీలకమైన పాత్ర అని, ఓటింగ్ జరుగుతుండగా పార్లమెంట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు నిలిచిపోయాయో తనకు తెలియదని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

గాందేయవాదిని

'నేను చాణక్యవాదిని కాదు, గాంధేయ వాదిని' అని జైపాల్ రెడ్డి అన్నారు. చాణక్య నీతిపై తనకు నమ్మకం లేదని, తాను గాంధేయవాదిని అని అన్నారు. 371 హెచ్ ద్వారా రాష్ట్ర విభజన చేయొచ్చని తాను సూచించానని, దానికి తగినట్టుగానే కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డ్రాఫ్ట్ తయారు చేశారని అన్నారు. 'రాజ్యాంగ సవరణ ఉండాల్సిందేనని న్యాయ నిపుణుల వాదనకు 371 హెచ్, అరుణాచల్ అనుభవాలే సమాధానం' అని జైపాల్ అన్నారు.

ఉండవల్లి ఫైర్

'విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు'లో కొన్ని అంశాలపై కథ అల్లారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పుస్తక రచయిత ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాల గురించి రాసిన ఆ పుస్తకంలో కొన్ని అంశాలు ఊహించి రాశానని ముందే చెప్పానని, ఇప్పుడు జైపాల్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేమీ లేదన్నారు.

విభజన బిల్లు ఆమోదం సమయంలో లోక్ సభ తలుపులు ఎందుకు మూసేశారన్న విషయం గురించి బయటవారికి ఏమీ తెలియదని, తెలియనప్పుడు.. ఊహించి రాయడంలో తప్పేమీ లేదని అన్నారు. మరి, తాను ఊహించి రాశానని ఆయన చెబుతున్నారు కాబట్టి, అసలు, ఆ రోజు లోక్ సభలో జరిగిన వాస్తవాలేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలని.. ఇది ప్రజలకు సంబంధించిన విషయమని ఉండవల్లి కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress senior leader Jaipal Reddy and former MP undavalli Arun Kumar responded on state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more