వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నంత పని చేసిన ట్రంప్: ప్రపంచ మనుగడకు సవాలే

అనుకున్నంతా అయింది. పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో పర్యావరణ పరిరక్షణకు పెను విఘాతం ఏర్పడింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అనుకున్నంతా అయింది. పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో పర్యావరణ పరిరక్షణకు పెను విఘాతం ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం. ఈ ఒప్పందం అమలుకు 190 దేశాలకు పైగా అంగీకరించాయి. తాజా నిర్ణయంతో... ఈ ఒప్పందాన్ని అంగీకరించని సిరియా, నికరాగువా దేశాల సరసన అమెరికా చేరింది.

తమ దేశం, పౌరుల పట్ల ఉన్న విద్యుక్త ధర్మ నిర్వహణకే ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేలా కొత్త షరతులతో ఇదే ఒప్పందంలో కొనసాగడమా?లేక కొత్త ఒప్పందాలను రూపొందించడమా అన్నదానిపై చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉందన్నది ట్రంప్‌ వాదన.

'ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమే కాదు. ఉద్యోగ కల్పననూ దెబ్బతీస్తుంది. భారత్‌, చైనా లాంటి దేశాలకు ఇది అనుకూలంగా ఉంది' అని ట్రంప్‌ అన్నారు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో, ఉద్గారాలను తగ్గించే భారం ఇతర దేశాలపై మరింతగా ఉండనున్నది. ప్రత్యేకించి చైనా, భారత్‌, ఐరోపాలోని దేశాలు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఇంతకుముందే స్పష్టం చేశాయి.

రానున్నది ఆరో మహోత్పాతం

రానున్నది ఆరో మహోత్పాతం

గత 50 కోట్ల సంవత్సరాల్లో జరిగిన ఐదు మహోత్పాతాలు భూమిపై పలు జీవజాతులను తుడిచిపెట్టేశాయి. డైనోసార్ల వంటి భారీ జంతువులు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం మరో మహోత్పాతానికి దారితీసే భయానక పరిస్థితులు భూమి మీద నెలకొన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన ఉత్పాతాలకు గ్రహ శకలాల తాకిడి వంటి ప్రకృతి శక్తులు కారణమైతే.. కొత్తగా రానున్న ఆరో మహోత్పాతానికి మనిషే కారణమని చెప్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని, ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటే ఆ మహా వినాశనం నుంచి తప్పించుకోవచ్చని హితవు చెప్తున్నారు. వాతావరణ సమతుల్యత పరిరక్షణ సాధించడానికే 2015లో పారిస్ ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి.

అంతరిస్తున్న క్షీరదాలు, పక్షులు, ఉభయ చరాలు

అంతరిస్తున్న క్షీరదాలు, పక్షులు, ఉభయ చరాలు

భూమి మీద ప్రస్తుతం మరో మహోత్పాతం వంటి పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నాయని వారు తెలిపారు. గత ఐదు మహోత్పాతాల్లో జీవరాశులు అంతరించినంత వేగంగా ప్రస్తుతం క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు కూడా అదేస్థాయిలో అంతరిస్తున్నాయని వీరు తెలిపారు. మానవుడి వికృత చేష్టలైన అవధుల్లేని వేట, జీవరాశుల ఆవాసాల ఆక్రమణలు, కాలుష్యం తదితర మానవ చర్యలతో 25 శాతం క్షీరదాలు, 13 శాతం పక్షులతోపాటు లక్షల జీవజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయని హెచ్చరించారు. కొన్ని శతాబ్దాలుగా భూమి మీద, సముద్రాల మీద మానవుడు విచ్చలవిడిగా, విచక్షణరహితంగా జరుపుతున్న కార్యకలాపాలతో జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. జీవజాతుల మీద దాడులతో వాటి సహజ ఆవాసాల ధ్వంసం, సహజ వనరులను విపరీతంగా కొల్లగొట్టటం, వాతావరణ మార్పులు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా జీవజాతులు విపరీతమైన వేగంతో అంతరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ఈ వినాశకర ప్రక్రియ కొనసాగుతున్నదని శిలాజాలపై జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీని ఫలితాలు దారుణంగా ఉండే ప్రమాదం ఉంది. జీవ వైవిధ్యాన్ని కోల్పోతే.. ప్రస్తుతం ప్రకృతి నుంచి లభిస్తున్న అనేక వసతులను మానవాళి కోల్పోయే పరిస్థితి వస్తుంది.

అంతరించి పోతున్న జీవ జాతులు

అంతరించి పోతున్న జీవ జాతులు

ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే మనిషి కార్యకలాపాల కారణంగా భూమ్మీద ఇతర జీవజాతుల ఉనికికే భంగం వాటిల్లటం అనేది ఇప్పుడే కొత్తగా కనిపించే విషయం కాదు. మానవాళి పరిణామక్రమంలో ఈ చీకటి అధ్యాయం కూడా మిళితమయ్యే ఉంది. వేట వంటి మానవ కార్యకలాపాలతోపాటు ప్రకృతిలో సంభవించిన మార్పుల కారణంగా 50 వేల ఏండ్ల కిందట ఆస్ట్రేలియాలో, 10 వేల ఏండ్ల కిందట ఉత్తర, దక్షిణ అమెరికాల్లో, 3,000-12,000 ఏళ్ల మధ్య యూరప్‌లో జీవజాతులు భారీ ఎత్తున నశించిపోయాయి. ఈ వినాశనం కొనసాగుతూ వచ్చింది. దాదాపు 3,000 ఏండ్ల కిందట భూమిపై 44 కిలోలకు పైగా బరువు ఉన్న క్షీరదజాతులు సగం వరకూ అంతరించిపోయాయి. పక్షి జాతుల్లో 15 శాతం తుడిచిపెట్టుకుపోయాయి. ఆధునిక, పారిశ్రామికయుగానికి నాంది పలికిన క్రీస్తుశకం 1500 నుంచి ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

నాగరికతపై పున: సమీక్షించుకోవాలి

నాగరికతపై పున: సమీక్షించుకోవాలి

గత 50 కోట్ల ఏండ్ల వ్యవధిలో తలెత్తిన ఐదు మహోత్పాతాల్లో జీవులు ఎంత వేగంగా అంతరించిపోయాయో ప్రస్తుతం అదేవేగంతో భూమ్మీద పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు తమ ఉనికిని కోల్పోయి అంతరించిపోతున్నాయి. భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొనటం, భారీ అగ్నిపర్వతాలు పేలిపోయి లావా ఉప్పొంగటం తదితర ప్రకృతి కారణాలు గతంలోని ఐదు మహోత్పాతాలకు కారణమని పరిశోధనలు తేల్చాయి. కానీ, ఈసారి ముంచుకొస్తున్న ఆరో మహోత్పాతానికి ఏకైక కారణం మానవుడే. భూమి మీదున్న జీవజాతుల్లో అత్యంత తెలివైన జీవిగా పేరొందిన మనిషే.. సమస్త జీవజాలానికి పెనుముప్పుగా పరిణమించటం ఒక మహావిషాదం. నాగరికత పేరుతో జరుగుతున్న ప్రస్థానంపై పునఃసమీక్ష జరుపుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆరో మహోత్పాతం నివారణకు ఇప్పటికీ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు మానవాళికి హెచ్చరికతో కూడిన భరోసానిస్తున్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, సామాజిక పరిశోధకులు కలిసికట్టుగా కృషి చేయాలని వారు సూచిస్తున్నారు.

జీవ వైవిధ్య పరిరక్షణ ఇలా

జీవ వైవిధ్య పరిరక్షణ ఇలా

జీవజాతుల ఆవాసాలను కాపాడటం, మన ఆహారం కోసం వ్యవసాయం వంటి రూపాల్లో భూమి మీద కొనసాగుతున్న ఒత్తిడిని కొంత తగ్గించి ప్రత్యామ్నాయ ప్రక్రియల ద్వారా ఆహార సముపార్జన, పర్యావరణ సమతుల్యత పరిరక్షణ వంటి చర్యలను తక్షణం, పరస్పర సహకారంతో, భారీ ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. మానవ చర్యల కారణంగా జీవవైవిధ్యం ఇంతగా దెబ్బతిన్నా కూడా భూమి ఇప్పటికీ మనకు రక్షణనివ్వగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2060 నాటికి మానవ జనాభా 1000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇంతటి జనాభాకు మాత్రమేగాక భూమి మీదున్న ఇతర జీవజాతులన్నింటికీ అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని భూమి అందించగలదని, ఆ వనరులు పుడమితల్లి ఒడిలో ఉన్నాయని వారు అంటున్నారు.

English summary
President Donald Trump has announced that the US is withdrawing from the 2015 Paris climate agreement. He said moves to negotiate a new "fair" deal that would not disadvantage US businesses and workers would begin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X