• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజమౌళి 'బాహుబలి' సినిమా: మరో కోణం

By Pratap
|

హైదరాబాద్: రాజమౌళి బాహుబలి సినిమాపై జరిగినంత చర్చ ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమాపై కూడా జరిగినట్లు లేదు. అంచనాలు, వాస్తవాల మధ్య సినిమాను బేరీజు వేసుకుంటూ సినిమా థియేటర్లలో నడుస్తోంది. సినిమా విడుదలకు ముందు నుంచే ప్రేక్షకులను భారీ అంచనాలకు తీసుకుని వెళ్లారు రాజమౌళి. ఆ అంచనాలను సినిమా పరిపూర్తి చేసిందా లేదా అనేది చర్చ.

తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకుని వెళ్లిందనే అభిప్రాయం కూడా బలంగానే వినిపిస్తూ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను రాజమౌళి నిలబెట్టారనే ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. సినిమా యావత్తూ చూసిన తర్వాత కలిగే ఫీలింగ్‌కీ, సినిమా నడకకు ఏ విధమైన పొంతన కుదిరింది అనేది కూడా ప్రశ్న. కళ్లు మిరుమిట్లు గొలిపే భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ వంటివాటిని పక్కన పెడితే సినిమా మంచీచెడులు గురించి మాట్లాడితే ఏం మిగులుతుందనేది అత్యంత ప్రధానమైన ప్రశ్న.

Rajamouli's Baahubali: Another angle

ఒక్క సినిమా గురించి అంత ఆలోచించాలా అని చాలా మంది అనుకోవచ్చు. మూడు గంటల పాటో, రెండున్నర గంటల పాటో చూసేసి దాన్ని వదిలేయాలనే బుద్ధిజీవులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ, వ్యాపారమూ కళా మిళితమైన ఓ ప్రస్తుత పరిస్థితిలో తప్పకుండా ఓ సినిమా గురించి చర్చించాల్సిన అవసరాన్ని బాహుబలి సినిమా కలిపించింది.

నీతికీ అవినీతికీ మధ్య జరిగిన ఓ పోరాట కథగా సినిమాను చెప్పవచ్చు. అదే సమయంలో విశ్వసనీయతకు, అవిశ్వసనీయతకు మధ్య పోరాటంగా కూడా చెప్పవచ్చు. వస్తువు సమకాలీనం కాకపోవచ్చు గానీ సామాజిక విలువలు, మానవ విలుపలు శాశ్వతమైనవి. సమాజం ఒక తరం నుంచి మరో తరానికో, ఒక యుగం నుంచి మరో యుగానికో ప్రయాణం చేసి ఉండవచ్చు. కానీ మానవ విలువలకు, సామాజిక విలువలు అన్ని తరాలకూ అన్ని యుగాలకూ ఒకే విధంగా ఉంటాయి. వాటికి రూపం ఉండవు. అవి అమూర్తాలే కానీ అవే సమాజం లేదా యుగం ఉన్నతిని లేదా పతనాన్ని నిర్దేశించేవి. ఆ విషయాన్ని బాహుబలి సినిమా స్పష్టంగానే చెప్పింది.

Rajamouli's Baahubali: Another angle

సినిమాలో కథ లేకపోవడానికి, కథనం మాత్రమే ఉండడానికి విలువకు పెద్ద పీట వేయడం వల్ల కావచ్చు. కథనం అత్యంత ప్రతిభావంతంగా ఉంది. వాస్తవికతకు, కాల్పనికతకు మధ్య సరిహద్దులను చేరిపేసి, విలువలు మాత్రమే ప్రధానం కావడం వల్ల ఓ కళ అత్యంత ప్రయోజనకరంగా రూపుదిద్దుకుంటుంది. బాహుబలి సినిమాలో అదే జరిగింది.

తెలుగులో హీరో కేంద్రంగా నడిచే కథలను చూస్తే, వాస్తవికత పేరుతో అసాధారణమైన ఫీట్లను, హీరో ఒక్కడే అసాధారణమైన రీతిలో శత్రువులను ఛేదించి, మట్టుబెట్టడం చూస్తాం. సాధ్యాసాధ్యాలను చర్చను కూడా పక్కన పెట్టి హీరో కేంద్రీకృత సినిమాలు తెలుగులో నడుస్తున్నాయి. అలా చూసినప్పుడు ఓ జానపద కథా నిర్మాణాన్ని ఎన్నుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాల మధ్య గీతను చెరిపేయడం ద్వారా బాహుబలి ప్రయోజనం సాధించింది.

ఇకపోతే, నటీనటులు కూడా పాత్రలు మాత్రమే రూపు కట్టడం బాహుబలి సినిమా ప్రత్యేకత. సినిమా దృశ్యమాధ్యమమనే విషయాన్ని, దానికి అనవసరమైన సంభాషణల హోరు అవసరం లేదనే విషయాన్ని రాజమౌళి సమర్థంగా చెప్పగలిగారు. తమన్నా పోషించిన అవంతిక పాత్రలోని వైరుధ్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా రూపుదిద్దడంలో రాజమౌళి ప్రతిభ కనిపిస్తుంది. లక్ష్యానికి, వాంఛకు మధ్య గల వైరుధ్యాలను చెప్పడంలో రాజమౌళి ప్రతిభావంతంగా వ్యవహరించారు. స్త్రీపాత్రలను రక్తమాంసాలతో తీర్చిదిద్దడం చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో (బహుశా అరుంధతి సినిమాను మినహాయిస్తే) చూస్తాం.

Rajamouli's Baahubali: Another angle

అనుష్క వేసిన దేవసేన, తమన్నా వేసిన అవంతిక, రమ్యకృష్ణ వేసిన శివగామి పాత్రలు రక్తమాంసాలతో దర్సనమిస్తాయి. వీరత్వాన్ని, స్త్రీసహజ లక్షణాలు కలబోసిన అవంతిక పాత్రను తమన్నా అద్భుతంగా పోషించింది. గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తమన్నాలో ఇంతటి స్ట్రామినా ఉందా అనిపించింది. రమ్యకృష్ణ వీరోచిత నారిగా, విలువలకు కట్టుబడిన రాజ్యాధికారిగా చాలా అద్భుతంగా నటించింది. అనుష్క పాత్ర వేసిన అవంతిక పాత్ర ఈ భాగంలో పూర్తిగా రివీల్ కాలేదనిపిస్తుంది. వచ్చే భాగంలో అవంతిక పాత్ర హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇక బాహుబలి, భల్లాలదేవుడి పాత్రలకు ఇతర తెలుగు నటులైతే ఎలా ఉండేదనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. తెలుగులోని ఇతర హీరోలు ఈ పాత్రలకు సరిపోయేవారా అనేది ప్రశ్న. రానా, ప్రభాస్‌ల రూపాలు సినిమాకు బాగా పనికి వచ్చినట్లు అనిపించింది. కట్టప్ప పాత్రను రాజమౌళి చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు కనిపిస్తారు.

సినిమా మొదటి భాగం ఎన్నో ప్రశ్నలను రేకెత్తించే విధంగా ముగిసింది. మొదటి భాగం చూసినవారు తప్పకుండా రెండో భాగం చూడక తప్పని పరిస్థితిని రాజమౌళి కల్పించారు. అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, శివగామి శివుడిని ఎందుకు కాపాడింది వంటి పలు ప్రశ్నలను రేకెత్తిస్తూ శివుడు (బాహుబలి) భల్లాలదేవుడిపై ఏ విధంగా విజయం సాధిస్తాడనే కుతూహాలాన్ని కూడా రేపి బాహుబలి మొదటి భాగాన్ని రాజమౌళి వదిలేశాడు. మొత్తంగా, ఒక తెలుగు సినిమా ఇంతగా ప్రచారంలోకి వచ్చి, ఇంతగా ఆలోచనలు రేపిన అరుదైన సన్నివేశాన్ని ప్రస్తుత తరం చూస్తోంది.

English summary
Rajamouli's Baahubali picture became a talk of the cinegoers and film critics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X