హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన వైపు మినిస్టర్స్: హైద్రాబాద్‌పై పట్టు, చిట్టా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఢిల్లీలా చేయాలని, హెచ్ఎండిఏ పరిధి వరకు శాసన సభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు మంత్రుల బృందానికి(జివోఎం)కు నివేదిక ఇచ్చారు. కొత్త రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని, కృష్ణా, గోదావరి నదీ జాలల నిర్వహణ ప్రాధికారిక సంస్థను ఏర్పాటు చేయాలని, తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని, ముఖ్య నగరాలకు మెట్రో రైలు ప్రాజెక్టును ఇవ్వాలని నివేదికలో పొందుపర్చారు.

దాదాపు వారం రోజుల క్రితం కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు నివాసంలో భేటీ అయి నివేదిక పొందు పర్చారు. కేంద్రమంత్రులు దాదాపు ఆరు పేజీల్లో 11 అంశాలతో కూడిన ప్రతిపాదనలతో రూపొందించిన వినతిపత్రం జివోఎం ముందుంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఢిల్లీ, పుదుచ్చేరి తరహాలో రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. సీమాంధ్రలో మౌలిక సదుపాయాల కోసం దాదాపు 49 డిమాండ్లను పొందుపరిచారు. తమ డిమాండ్ల ద్వారా సీమాంధ్ర కేంద్రమంత్రులు విభఝనకు మానసికంగా సిద్ధపడినట్లుగా అర్థమవుతోంది.

Seemandhra ministers gives report to GoM

జివోఎంకు అందించిన సీమాంధ్ర కేంద్రమంత్రుల నివేదికలో పలు అంశాలు ఉన్నాయి. 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండి ఆ తర్వాత తెలంగాణలో కలిపిన ప్రాంతాలను తిరిగి సీమాంధ్రలో చేర్చాలి. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని కూడా సీమాంధ్రలో కలపాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గిరిజనులకు సంతృప్తికరమైన స్థాయిలో పునరావాసం కల్పించాలి. ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరి గ్రేటర్ హైదరాబాద్‌ను రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి.

హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలన్నీ ఉన్నాయి. గత 30 ఏళ్లలో 35 లక్షలమంది ప్రజలు సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. దీనివల్ల సీమాంధ్ర 12 అసెంబ్లీ సీట్లు కోల్పోగా, హైదరాబాద్‌కు పది సీట్లు పెరిగాయి. ఇటీవల కొందరు నేతలు చేసిన హెచ్చరికల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటి చేస్తేనే సీమాంధ్ర ప్రజల మనసులు శాంతిస్తాయి.

సీమాంధ్ర రాజధానిని కేంద్ర ప్రభుత్వమే తన నిధులతో నిర్మించాలి. కొత్త రాజధానిని రైలు, రోడ్డు, వాయు మార్గాలతో అనుసంధానించాలి. కొత్త రాష్ట్రానికి దాదాపు 20 ఏళ్లపాటు ఏటా రూ. 40 వేల కోట్ల చొప్పున నిధులు కేటాయించాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు మొదలైనవన్నీ ఉమ్మడిగా కొనసాగాలి. వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అవసరాలను పట్టించుకోవాలి. ఇందుకోసం 20 ఏళ్లపాటు పన్ను రాయితీలు కల్పించాలి.

విభజన తర్వాత అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా శాంతి భద్రతలు, సుహృద్బావ వాతావరణం కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో పోలీసు నియామకాలకు సంబంధించిన 14ఎఫ్‌ను పునరుద్ధరించాలి. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలను, కేంద్ర బలగాలను నియమించి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి. నదీ జలాలు, నీటిపారుదల వనరులు, బొగ్గు, నీరు, చమురు, సహజ వాయువు వంటి వనరుల పంపిణీ రెండు రాష్ట్రాల మధ్య సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. సింగరేణి బొగ్గును 60:40 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచాలి. గ్యాస్‌ను జనాభా ప్రకారం తెలంగాణకు కూడా పంచవచ్చు.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల నిర్వహణకు యాజమాన్య అథారిటీని ఏర్పర్చాలి. ఇందులో సభ్యులుగా ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జలవనరుల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సంబంధిత కార్యదర్శులు ఉండాలి. రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాజోలిబండ పథకం, పోతిరెడ్డిపాడు నుంచి సక్రమంగా నీరు విడుదలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పర్చాలి.

పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్, కంతానపల్లి ప్రాజెక్టులు ప్రత్యేక అథారిటీ పర్యవేక్షణలో ఉండాలి. విద్యుత్తు ఉత్పాదన, పంపిణీ, ప్రసారానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. ఆస్తులు, పబ్లిక్ ఫైనాన్స్, పబ్లిక్ కార్పొరేషన్లు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికగా జరగాలి. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలి. అఖిల భారత సర్వీసును కామన్ కేడర్ పరిగణించాలి.

371(డి) వల్ల తలెత్తే పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. దానిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలి. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు చెన్నై-నెల్లూరు-చిత్తూరు-బెంగళూరును అనుసంధానిస్తూ 8 లేన్ల జాతీయ రహదారి కావాలి. నడికుడి - శ్రీకాళహస్తితోపాటు పెండింగులో ఉన్న ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయాలి. విజయవాడ, విశాఖల్లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి.

విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాలి. కడప, నెల్లూరు, గుంటూరులలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలి. వాడరేవు, రామాయంపేట, నిజాంపట్నం రేవులు నిర్మించాలి. - కొత్త రాజధానిలో మెట్రో రైలు. విజయవాడ - గుంటూరు - గన్నవరం మధ్య మెట్రో నిర్మించాలి. కొత్త రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐఐటీలు, నల్సార్, ఎయిమ్స్ మొదలైన సంస్థలు, కర్నూలు, అనంతపురంలో సెజ్‌లు, సైనిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి.

నెల్లూరులో ఇఫ్కో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి. కోనసీమలో కొబ్బరి ఆధారంగా పారిశ్రామిక కారిడార్, విశాఖలో ఐటి, సినిమా పరిశ్రమల కారిడార్ అభివృద్ధి పరచాలి. కొత్త రాజధానిలో హైకోర్టు కర్నూలు, విశాఖలో హైకోర్టు ధర్మాసనాలు ఉండాలి. సీమాంధ్రలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

సీమాంధ్రలో ఉన్న ఐదు కోట్ల ప్రజలతో పాటు హైదరాబాదులో నివాసం ఉంటున్న ప్రజల గొంతు వినకుండా తెలంగాణ నేతలు అడిగిందల్లా ఇచ్చేయడం అప్రజాస్వామికం. ఢిల్లీ తరహా యూటి మాత్రమే చేయాల. ఆస్తులు, పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పులను మార్కెట్ విలువ ప్రకారం మదించి రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలి. ఇటీవల ఏర్పాటైన చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేని విధంగా ఉద్యోగులను కేటాయించాలి.

సీమాంధ్రలో పూర్తిస్థాయి విద్యావకాశాలు నెలకొనేంత వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, వరంగల్ ఎన్ఐటి, మెదక్ ఐఐటి, హైదరాబాదులోని మెడికల్, పిజి కాలేజీల్లో ఇప్పుడు అమల్లో ఉన్న ప్రవేశాల విధానం కొనసాగించాలి. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని వెనుకబడిన జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిని ఎనిమిది వరుసల దారిగా మార్చాలి. తూర్పు గోదావరి జిల్లా తాళ్ల రేవు వద్ద పెట్రోలియం విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. ప్రాచీన తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ఆర్థిక మండల్లు, సైనిక్ స్కూళ్లు నెలకొల్పాలి.

English summary
The Seemandhra Ministers gave report to Group of Ministers(GoM) and demanded Hyderabad as Union Territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X