స్వైన్ ప్లూ పంజా: ఐదు కేసులు నమోదు (ఫోటోలు)
హైదరాబాద్: నగర వాసులను మళ్లీ స్వైన్ ప్లూ భయపెడుతోంది. అక్కడక్కడ స్వైన్ ప్లూ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్లో వ్యాపించే స్వైన్ ప్లూ మూడు నాలుగు నెలలు ముందే తన పంజా విసిరింది. ఇప్పటికే ఆరుగురు స్వైన్ ప్లూ బారిన పడ్డారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో ఓ యువకుడు స్వైన్ ప్లూతో చికిత్స పొందుతున్నాడు.
ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పోరేట్ ఆసుపత్రులకు స్వైన్ ప్లూ బాధితులు వెళ్తుండటంతో కేసులు బయటకు రావడం లేదు. సహజంగా చలికాలంలో ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం వర్షాకాలం అయినప్పటికీ ఎండలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇంత వేడి వాతావరణంలోనూ వైరస్ తన ప్రభావాన్ని చూపడం గమనార్హం. ఇటీవల కాలంలో పుష్కరాలు, పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాలు ఎక్కువ కావడంతో జనం రద్దీలో ఒకరి నుంచి మరొకరి ఈ వైరస్ సోకి విస్తరిస్తోందని డాక్టర్లు భావిస్తున్నారు.

ఇప్పటికే ఐదు స్వైన్ ప్లూ కేసులు
నగరంలో ఇప్పటికే ఐదు కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో గత నెలలో నాలుగు కేసులు, ఈ నెలలో అప్పుడే ఒక కేసు నమోదైంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉన్నంత ప్రభావం ప్రస్తుతం లేదని డాక్టర్లు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఐదు స్వైన్ ప్లూ కేసులు జనవరిలో
292, ఫిబ్రవరిలో 444, మార్చిలో 318, ఏప్రిల్‌లో 38, మే నెలలో రెండు కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలలో ఒక కేసు కూడా నమోదు కాలేదు.

స్వైన్ ప్లూ లక్షణాలు ఇవీ?
జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నీటి నుంచి నీటిధార నిరంతరంగా రావడం, గొంతు గరగర, శరీరం నొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు ఉంటే స్వైన్ ప్లూగా అనుమానించాలి.

గాంధీలో స్వైన్ ప్లూ భయం
గాంధీ ఆసుపత్రికి మళ్లీ స్వైన్ ప్లూ కేసుల తాకిడి మొదలైంది. తాజాగా గాంధీకి ఓ యువకుడు వైరస్‌తో రావడంతో వైద్యుల అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సునీల్ తీవ్ర స్థాయిలో జ్వరం రావడంతో నగరంలోని పలు కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఫలితం లేకపోయింది. దీంతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుడికి వైద్యులు రక్త పరీక్షలు చేయగా స్వైన్ ప్లూ ఉన్నట్లు తేలింది.

ముందే వచ్చిన స్వైన్ ప్లూ వైరస్
సాధారణంగా స్వైన్ ప్లూ వైరస్ ఏడాది చివర్లో విజృంభిస్తోంది. శీతాకాలంలో చల్లటి వాతావరణం ఎక్కువగా ఉంటుండడంతో విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ఆగస్టులోనే ఈ వైరస్ దాడి చేయడం కాస్తంత కలవరపాటుకు గురి చేస్తోందని గాంధీ ఆసుపత్రి స్వైన్ ప్లూ కో ఆర్డినేటర్ డాక్టర్ నరసింహులు తెలిపారు.