వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేతన ప్యాకేజీ మినహా ‘రైజ్’తో మనోళ్లకు బోలెడు లాభాలు

అమెరికాలో విద్యాభ్యాసానికి ‘ఎడ్యుకేషన్ వీసా’పై వెళ్లి హెచ్‌1బీ వీసాపై ఉద్యోగంలో చేరి శాశ్వత నివాసానికి వెసులుబాటు కలిగిచే గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూసే ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/అమరావతి: అమెరికాలో విద్యాభ్యాసానికి 'ఎడ్యుకేషన్ వీసా'పై వెళ్లి హెచ్‌1బీ వీసాపై ఉద్యోగంలో చేరి శాశ్వత నివాసానికి వెసులుబాటు కలిగిచే గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూసే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అమెరికా తెస్తున్న కొత్త బిల్లు 'రైజ్‌' భారతీయులకు, రెండు తెలుగు రాష్ట్రాల యువతకు ప్రత్యేకించి ఐటీ ఇంజినీర్లకు మేలు చేస్తుందని పలువురు నిపుణులు సృష్టం చేస్తున్నారు.

నైపుణ్యం, తగిన అర్హతలు ఉన్న వారు ఏళ్ల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. అమెరికాకు చట్టబద్ధంగా వచ్చే వలసదారులను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్‌ ఆమోదించిన కొత్త బిల్లు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారత్‌ నుంచి విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారిలో ఎక్కువగా తెలుగువారే ఉంటుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. 'రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయిమెంట్‌ (రైజ్‌)' ప్రతిపాదిత బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న లాటరీ ఆధారిత వ్యవస్థ రద్దు అవుతుంది. జీతాల విషయమై విధించే నిబంధన కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటి వరకు గాలిలో దీపం మాదిరే

ఇప్పటి వరకు గాలిలో దీపం మాదిరే

ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్‌కార్డులు జారీ చేసేందుకు ఒక సృష్టమైన విధానం లేదు. సీనియారిటీ, లాటరీ ఆధారంగా ఇస్తున్నారు. దీని వల్ల తమ దేశ పౌరులు ఉద్యోగాల పరంగా కూడా నష్టపోతుండటంతో రైజ్‌ పేరిట తెచ్చిన బిల్లుకు ట్రంప్‌ ఆమోద ముద్ర వేశారు. గ్రీన్‌ కార్డు పొందడానికి ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయస్సు ప్రధానంగా తీసుకొని పాయింట్లు కేటాయిస్తూ... అందులో నిర్దేశించిన విధంగా పాయింట్లు దక్కితే గ్రీన్‌కార్డు ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. దీని వల్ల దేశానికి నిపుణులు దొరుకుతారని, అమెరికన్లకుకూడా నష్టం రాదని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

మనోళ్లదే హెచ్ 1 బీ వీసాలో సింహభాగం

మనోళ్లదే హెచ్ 1 బీ వీసాలో సింహభాగం

గ్రాడ్యుయేట్‌ (పీజీ) విద్యకు ఏటా భారత్‌ నుంచి 60 వేల నుంచి 70 వేల వరకు వెళ్తున్నారు. అమెరికాలో 2.06 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత రెండో స్థానం మనదే. భారతీయులు చదువు పూర్తయిన తర్వాత వెంటనే వెనక్కి వచ్చే వారు స్వల్పం. ఐచ్ఛిక ప్రాక్టికల్‌ శిక్షణ (ఓపీటీ) చేస్తూ హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేస్తారు. అమెరికాలో చదువుకొని ఓపీటీలో ఉన్న మన విద్యార్థులు విద్యార్థి కోటాలో 20 వేల వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. ఇక సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు చేసేందుకు విద్యార్థి కోటాతో కలిపి ప్రతి ఏటా అమెరికా 85 వేల హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తుంది. అందులో 72 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. గత ఏప్రిల్‌లో భారతీయుల నుంచి 2018కి 1.99 లక్షల దరఖాస్తులు అందాయి. గత 11 ఏళ్లల్లో 26 లక్షలు హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తులు రాగా అందులో 21 లక్షలు భారతీయులవే ఉన్నాయని ఇటీవల అమెరికా ప్రభుత్వం తెలిపింది. అందులో 20 లక్షలు కంప్యూటర్‌ నిపుణులే ఉన్నారు. తగిన విద్యార్హత, ఆంగ్ల, ఉద్యోగ నైపుణ్యం ఉండటమే ప్రధాన కారణం. దశాబ్దానికిపైగా అమెరికాలో ఉంటున్న వారికి కూడా గ్రీన్‌కార్డు దక్కడం లేదు. అందుకు కారణం సీనియారిటీ, లాటరీ ఆధారంగా ఇస్తుండటమే.

రైజ్‌తో తెలుగు యువతకు ఇలా లబ్ధి

రైజ్‌తో తెలుగు యువతకు ఇలా లబ్ధి

ప్రతిపాదిత రైజ్ బిల్లు ప్రకారం పాయింట్ల ఆధారిత వ్యవస్థ ద్వారా గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. ఇందులో ఆంగ్లభాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయస్సు ప్రాతిపదిక పెట్టారు. వీటిలో ఒక్కో అంశానికి పాయింట్లు కేటాయిస్తారు. ఆంగ్ల భాష, ఉన్నత విద్య, వయస్సు ప్రాతిపదికల్లో తెలుగు వారికి మెరుగైన పాయింట్లు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదువు విషయంలో 26-30 ఏళ్ల మధ్య వయస్సుకు బిల్లులో 10 పాయింట్లు వరకు పెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో చదువులు పూర్తి చేసే వారిలో ఎక్కువగా ఈ వయస్సులో వారే ఉంటారని ఐటీ నిపుణులు అంటున్నారు. స్టెమ్‌ విధానంలో విదేశీ మాస్టర్‌ డిగ్రీకి 7 పాయింట్లు, అమెరికా మాస్టర్‌కు 8 పాయింట్లు ఇస్తారు. వేతనాల్లోనూ చాలా మందికి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు తక్కువ ప్యాకేజీ ఉంటోందని ఇలాంటి వారికి కొంత ఇబ్బంది ఏర్పడొచ్చని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం అమెరికాలోని మధ్యస్థ గృహ ఆదాయం కంటే 150 శాతం వేతనం అధికంగా ఉండాలనే నిబంధనను బిల్లులో చేర్చారు. అమెరికా జన గణన సంస్థ నివేదిక - 2014 (సెప్టెంబర్‌) ప్రకారం 2013లో అమెరికాలో మధ్యస్థ గృహ ఆదాయం 51,939 డాలర్లని పేర్కొన్నారు.

మంచి గుర్తింపు కాలేజీల్లో చదివితే బెస్ట్

మంచి గుర్తింపు కాలేజీల్లో చదివితే బెస్ట్

జీతాల ప్యాకేజీ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు. అమెరికాలోనే చదువుకొని, అక్కడే ఉద్యోగాలు పొందే కొత్తవారికి ఈ పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం కొత్తగా విద్యాభ్యాసం పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరే వారి వేతనాలు 65-80 వేల డాలర్ల మధ్య ఉంటున్నాయని, సీనియర్లకు మాత్రం 1,30,000 డాలర్లు పైనే ఉంటోందన్నారు. గతంలో ఎక్కువగా కొత్తవారుబీటెక్‌ పూర్తయిన వెంటనే అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లేవారు. ఇప్పుడు ఈ విధానంలో కొంత మార్పు వచ్చిందన్నారు. మంచి గుర్తింపు ఉన్న కళాశాలల్లో చదివితే ఉన్నత విద్యకు వచ్చే పాయింట్లు పెరుగుతాయని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు.. ఆంగ్లభాషలో నైపుణ్యం తెలుగు వారిలో ఎక్కువగానే ఉంటుందని, మంచి కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేస్తే వేతనాల ప్యాకేజీ ఎక్కువేనని, గ్రీన్‌కార్డు లభించడం చాలా తేలికవుతుందని పేర్కొంటున్నారు. ప్రతిపాదిత బిల్లు.. చట్టంగా అమల్లోకి వచ్చినా తెలుగు వారికి అవకాశాలు తగ్గబోవని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిదులు తెలిపారు.

ఉత్తమ కళాశాలలో సీటు పొందితే..

ఉత్తమ కళాశాలలో సీటు పొందితే..

ప్రస్తుతం గ్రీన్‌కార్డు పొందడానికి ఒక సృష్టమైన విధానం లేదని, ఏటా ఎన్ని ఇస్తారో అన్నది కూడా తెలియదని వెంకట్ అండ్ మెక్ గ్రిబ్బిన్ సంస్థ భాగస్వామి ఐ వెంకట్ తెలిపారు. ఎన్నికల ఏడాదిలో మాత్రం భారీగా ఇస్తున్నారన్నారు. గత నాలుగు ఎన్నికల నుంచి ఈ విషయాన్ని తాను గమనిస్తున్నానని, ప్రస్తుతం ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ సంస్థ గ్రీన్‌కార్డుకు సిఫారసు చేస్తానని ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకుంటుందని వెంకట్ అండ్ మెక్ గ్రిబ్బిన్ సంస్థ భాగస్వామి ఐ వెంకట్ తెలిపారు. సిఫారసు చేస్తున్నందుకు వేతనాలు కూడా తగ్గించి ఇస్తారని, కానీ ప్రతిభను బట్టి గ్రీన్‌కార్డు ఇస్తే ఇలాంటి అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంగ్లం రాకున్నా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, చైనా లాంటి ఎన్నో దేశాల వారు అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడానికి పోటీ పడుతున్నా, తాజా బిల్లు వల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతారని ఐ వెంకట్ చెప్పారు. విద్యాభ్యాస సమయంలోనే ఉత్తమ కళాశాలలో సీటు పొందితే ఈ కొత్త బిల్లు చట్టం రూపంలో వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, విదేశీ చదువులకు విద్యార్థులను పంపించే పలు కన్సల్టెన్సీలు అభిప్రాయ పడ్డాయి. చదువు నుంచి పాయింట్లు ఎక్కువగా రావడంతో గ్రీన్‌కార్డుకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నాయి.

English summary
America 'RISE' bill mostly helpfull to indians particularly Telugu people. America president Donald Trump main object is reduce foreigners in their country. In this context America Congress and Senate will be approved this 'RISE' bill while there is so many benifits in this proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X