గ్రూప్పరీక్షల్లో తెలంగాణ:విద్యార్థుల సిలబస్ గందరగోళం
హైదరాబాద్: గ్రూప్ 1, గ్రూప్ 2లలో తెలంగాణ సాధన, ఉద్యమం పైన ప్రత్యేక పేపర్లు ఉన్నాయి. అయితే, పూర్తిస్థాయి సిలబస్ ఇంకా వెల్లడి కాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కొత్తగా గ్రూపు పరీక్షల్లో తెలంగాణ సాధన పేపర్ ప్రవేశ పెడుతున్నారు.
దీనిపై పూర్తిస్థాయి సిలబస్ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీని కోసం పూర్తిస్థాయి సిలబస్ ఖరారు చేయకపోవడం, తెలంగాణ సాధన, ఉద్యమం చరిత్ర చదివేందుకు పుస్తకాలు అందుబాటులో లేక అభ్యర్థులు సతమతమవుతున్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లను ఒక్కొక్కటి విడుదల చేస్తామన్న ప్రభుత్వం మొదటి దశలో సుమారు పదిహేనువేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది.
అయితే ఇప్పటి వరకు ఉన్న సిలబస్‌కు అదనంగా కొత్తగా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాల ప్రాధాన్యాన్ని గ్రూపు-2, గ్రూపు-1లో పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే పాత పేపర్లకు సిలబస్‌తోపాటు పుస్తకాలు దొరుకుతున్నాయి. కొత్త పేపర్లకే సిలబస్ ఏమి ఉంటుంది? పుస్తకాలు ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల్లో పరీక్ష అంటే ఎలా సన్నద్ధం కావాలో అభ్యర్థులకు అర్థం కావడం లేదు.
తెలంగాణ పేపర్ పైన టీఎస్పీఎస్సీ సభ్యుల్లోనూ చర్చ వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు అకాడమీచే ప్రామాణిక పుస్తకం రూపొందించాల్సిన అవసరం ఉందని భావించినట్లుగా సమాచారం. దీనిపై అకాడమీకి ప్రాథమికంగా సమాచారం అందించారు. అయితే, పూర్తిస్థాయి సిలబస్ ఏమిటన్నది తెలిశాకే ముందుకు వెళ్లే అవకాశముంటుందని చెబుతున్నారని సమాచారం.