షర్మిలకు జగన్ చేయి: విశాఖ నుంచి సుబ్బారెడ్డి
హైదరాబాద్: విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి వైయస్ షర్మిలను పోటీకి దించాలని పార్టీ శ్రేణులు చేస్తున్న డిమాండ్‌ను పక్కన పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పేరును ఖరారు చేశారు. నిజానికి, వైవి సుబ్బారెడ్డి ఒంగోలు సీటు అడిగారు. కానీ, విశాఖ నుంచి పోటీ చేయాలని జగన్ ఆయనకు సూచించారు.
సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో వైయస్ జగన్ కుటుంబం నుంచి పోటీ చేసేవారి సంఖ్య నాలుగుకు పెరిగింది. జగన్ జైలులో ఉన్న సమయంలో వైవి సుబ్బారెడ్డి పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. వైవి సుబ్బారెడ్డి జగన్ తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోదరి భర్త. జగన్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరైన వైయస్ అవినాష్ రెడ్డికి కడప పార్లమెంటు సీటు ఖరారైంది.

జగన్ పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఈ సీటు నుంచి విజయమ్మ ప్రస్తుతం శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం శాసనభా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
షర్మిల విశాఖ లోకసభ సీటు నుంచి పోటీ చేస్తే దాని సానుకూల ప్రభావం విశాఖపట్నం జిల్లాపైనే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాపై కూడా ఉంటుందని, అందువల్ల షర్మిలను విశాఖ నుంచి పోటీకి దింపడం అవసరమని ఉత్తరాంధ్ర పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
సుబ్బారెడ్డి ఏప్రిల్ 1వ తేదీ నుంచి విశాఖపట్నంలో ప్రచారం ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డి ఒంగోలు స్థానం అడిగినప్పటికీ దాన్ని చెన్నై వ్యాపారవేత్త బొమ్మిరెడ్ిడ సురేష్ రెడ్డికి కేటాయించాలని జనగ్ నిర్ణయించుకున్నారు. వైవి సుబ్బారెడ్డి బావ బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా సురేష్ రెడ్డి అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో విశాఖకు వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం వైవి సుబ్బారెడ్డికి లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications