• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అలారం మోగుతోంది: కెసిఆర్ అసలు సమస్యేమిటి?

By Pratap
|

హైదరాబాద్: పూర్తి అనుకూల వాతావరణం ఉన్న స్థితి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన ప్రతికూల వాతావరణంలోకి మారుతోంది. ఆయనకు వ్యతిరేకంగా పరిస్థితులు చాలా వేగంగా కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే కెసిఆర్ బలంగా ఉంటూ వచ్చింది. దానివల్లనే వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనని ఆయన అతి విశ్వాసం ప్రదర్శిస్తూ వచ్చారు. నిజానికి, వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందంటే ఇప్పటీకీ నమ్మలేని పరిస్థితే ఉంది. కానీ వేగంగా మారుతున్న పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయనేది చెప్పలేకుండా ఉంది.

ఇలా ప్రతికూల ప్రభావం పడడానికి కారణాలు ఏమిటని పరిశీలిస్తే ఆయనే తప్ప మరోటి కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనే కర్త, కర్మ, క్రియ. అందుకే సింహం ఒంటరిగానే వస్తుందని ఆయన తనయుడు, ఐటి మంత్రి కెటి రామారావు అన్నారు. కెసిఆర్‌ను ఢీకొట్టే నాయకులు ప్రతిపక్షాల్లో లేరనేది తెరాస నాయకుల ధీమా కూడా కావచ్చు. కానీ, అంత ధీమాగా ముందడుగు వేసే పరిస్థితులు మాత్రం లేవు.

ఉద్యమ స్ఫూర్తి లేనివారే ఎక్కువ....

ఉద్యమ స్ఫూర్తి లేనివారే ఎక్కువ....

కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా వ్యవహరించారు. ఆయనను ప్రశ్నించేవారే లేకుండా పోయారు. అందువల్ల మంచికైనా, చెడుకైనా ఆయనే బాధ్యుడవుతారు. బెల్లం ఉన్నచోటికే చీమలు చేరుతాయి. అదే విధంగా అధికారం రాగానే కెసిఆర్ చుట్టూ చేరినవారు అనేకానేకులు ఉన్నారు. వెనకా ముందూ చూడకుండా కెసిఆర్ తన ఉదార స్వభావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కనిపించినవారికి, తనను ప్రశంసించినవారికి పదవులు కట్టబెడుతూ వచ్చారు. సిఎం పీఆర్వో లాబీని తీసుకుంటే అది ఎలా జరిగిందో అర్థమవుతుంది.

  KTR visits Dalits And His Strategy On Nerella Dalit Incident
  వారిద్దరికీ అలా....

  వారిద్దరికీ అలా....

  సిఎం పిఆర్వో జాబితాలో ఉన్న ఓ వ్యక్తిని అక్కడి నుంచి తొలగించి విద్యుత్ శాఖలో ఘనమైన పదవిని కెసిఆర్ కట్టబెట్టారు. దాన్ని ప్రశ్నించినవారు లేరు. ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. అధికారంలో ఉన్నవారు ఏది చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత కూడా మరో ఇద్దరిని సిఎం పిఆర్వో కార్యాలయంలో చేర్చుకున్నారు. వారి పనితీరు నచ్చక వారిద్దరిని ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పనికి వారిని పరిమితం చేశారు. వారేం పోస్టులు పెడుతున్నారో, వాటిని నెటిజన్లు ఎలా ఎదుర్కుంటున్నారో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారికి బాగా తెలుసు. వారి పరిమిత జ్ఞానం, విషయాల పట్ల అవగాహనా లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

  నమస్తే తెలంగాణ పరిస్థితి ఇదీ....

  నమస్తే తెలంగాణ పరిస్థితి ఇదీ....

  మీడియా ప్రచారం అన్నింటినీ తలదన్ని అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని కెసిఆర్ బలంగానే నమ్ముతారు. అందువల్లనే లక్ష్మీరాజం చేతిలో ఉన్న నమస్తే తెలంగాణ పత్రికను తన చేతుల్లోకి తీసుకున్నారు. సంపాదకుడిని మార్చేసి దుమ్మురేపాలని అనుకున్నట్లే ఉన్నారు. కానీ అది ప్రతికూల ఫలితాలు ఇవ్వడం ప్రారంభించింది. పత్రిక తీరు పట్ల కెసిఆర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతూనే ఉంది. ఇటీవల ఓ కీలకమైన ఉద్యోగిని తప్పించారు. సంపాదకుడి పరిస్థితి కూడా ఏం బాగా లేదని ప్రచారం జరుగుతోంది. సిఎంవో నుంచి గతంలో ఈనాడులో చేసిన ఓ వ్యక్తిని తెచ్చి పెట్టి బాధ్యతలు అప్పగించారు. కానీ, పరిస్థితి మరింత దిగజారింది. సిఈవో దామోదర్ రావును కెసిఆర్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని అంటున్నారు. ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కున్న నేపథ్యంలో దాని ప్రభావం కూడా నమస్తే తెలంగాణపై పడింది. తెలంగాణ టుడే అనే ఆంగ్లపత్రికను ప్రారంభిస్తే అది అడుగు ముందుకు వేయడం లేదు. కెసిఆర్ చేయించిన సర్వేలోనే టీ న్యూస్ చానెల్ దిగదిడుపుగా ఉన్నట్లు తేలింది.

  స్ఫూర్తి లేనివారే.....

  స్ఫూర్తి లేనివారే.....

  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినవారు చాలా మంది కెసిఆర్ వలయానికి వెలుపల ఉన్నారు. పూర్తిగా తన వెంట నడిచి, తెరాస కార్యకర్తల మాదిరిగా పనిచేసేవారికే అందలాలు దక్కాయి. అయితే, అది కెసిఆర్ ఇష్టం. తెలంగాణ కోసం కెసిఆర్‌ను, తెరాసను ఉద్యమ కాలంలో బలపరచడం తెలంగాణ స్ఫూర్తితో పనిచేసినవారి తలనొప్పి. ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని నెత్తి కొట్టుకుని నోరు చేసుకుని అరవాల్సిన అవసరమేమీ లేదు. కానీ, పాలనలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్నవారి పాత్ర ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవి. సమర్థులైనవారిని నువ్వెంత అన్నట్లు కెసిఆర్ తీసిపక్కన పెట్టారు. కోదండరామ్, రఘు వంటి వారు సరే, తెలంగాణ కోసం పనిచేసిన చాలా మందిని ఆయన చేజార్చుకున్నారు. మినహాయింపులు ఉండవచ్చు గానీ అవార్డులు, రివార్డులు, అందలాలు తెలంగాణ స్పూర్తి కొరవడినవారికే దక్కుతూ వస్తున్నాయి.

  తెరాస పాలక పార్టీగా,

  తెరాస పాలక పార్టీగా,

  అధికార పార్టీగా ముందుకు వచ్చిన తర్వాత సహజంగానే ఇతర పార్టీలకు చెందినవారు చాలా మంది వచ్చి చేరారు. కెసిఆర్ కూడా పనిగట్టుకుని ఫిరాయింపులను ప్రోత్సహించారు. దానివల్ల గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించి ఉండవచ్చు గానీ ఆ తర్వాత పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. కెసిఆర్‌‌కు ఎదురులేదని భావించిన తర్వాత అనేక శక్తులు ఆయన చుట్టూ చేరాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. తెరాసలో వర్గపోరు పెరిగింది. అవి బజారును పడుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో రమేష్ రాథోడ్, రేఖా నాయక్ మధ్య చోటు చేసుకున్న వివాదమే దానికి తాజా ఉదాహరణ. తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యం ద్వితీయంగా మారిపోయే పరిస్థితి వచ్చి, పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యం ప్రధానంగా ముందుకు వచ్చింది.

  నేరెళ్ల ఘటన పరాకాష్ట....

  నేరెళ్ల ఘటన పరాకాష్ట....

  కెసిఆర్ పాలన ప్రజానుకూలంగా ఉంటుందని విశ్వసించారు. కానీ నేరెళ్ల ఘటన అది ఎంత దారుణంగా ఉంటుందో రుచి చూపించింది. పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించడానికి కూడా మాటలు సరిపోని స్థితి. దానిపై మాట్లాడుతూ కెసిఆర్ వాడిన బాష మరింత వ్యతిరేకతకు కారణమైంది. ఘటన జరిగిన ఐదు వారాల తర్వాత స్థానిక శాసనసభ్యుడైన ఐటి శాఖ మంత్ర కెటి రామారావు దిద్దుబాటు చర్యలకు దిగి, సర్దుబాటు చేసుకునే వైనం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. స్థానికంగా తెరాస నాయకుల వైఖరి ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా మారే వాతావరణానికి కారణమవుతున్నాయి. మంథని సంఘటన కావచ్చు, మరోటి కావచ్చు. ఉద్యమ స్పూర్తి, తెలంగాణ పట్ల నిబద్ధత లేని నాయకత్వాలే స్థానికంగా రాజ్యమేలుతున్నాయి. దానివల్ల చాలా వేగంగా కెసిఆర్‌పై వ్యతిరేకత పెల్లుబుకే ప్రమాదం ఉంది.

  మంత్రులు ఏం చేస్తున్నారు....

  మంత్రులు ఏం చేస్తున్నారు....

  కెసిఆర్ మంత్రివర్గ సభ్యులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. వారు మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. బహుశా, దీనికి కారణం కూడా కెసిఆరే కావచ్చు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందనే భయాలు వారిని పట్టిపీడిస్తున్నాయా అనేది తెలియదు. అంతా కెసిఆర్, ఆయన తనయుడు కెటిఆర్ మాత్రమే చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల తాము చేసేదేమీ లేదనే స్థితికి మంత్రులు వచ్చారా అనేది సందేహం.

  ఉత్కంఠగా ప్రారంభమై...

  ఉత్కంఠగా ప్రారంభమై...

  చాలా పెద్ద కేసును కెసిఆర్ ప్రభుత్వం పరిష్కరించడానికి పూనుకున్నట్లు తొలుత కనిపిస్తూ వచ్చింది. కానీ ఏ కేసు కూడా తుది వరకు సాగడం లేదు. నోటుకు ఓటు కేసు, నయీం కేసు, భూముల కుంభకోణం కేసు, తాజాగా డ్రగ్స్ కేసు కొంత వరకు చాలా ఉత్కంఠ భరితంగా సినిమాను తలపించేలా సాగి నీరు గారుతున్నాయి. ప్రధానమైన కేసులు ఇలా చప్పబడడానికి కారణాలు ఏమిటనేది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తమకు తోచిన కారణాలను తాము చెప్పుకుంటారు. ఇతరులు చెప్పింది విని తెలుసుకుంటారు.

   ఆంధ్రుల భూతం చూపించి...

  ఆంధ్రుల భూతం చూపించి...

  కొంత కాలం ఆంధ్రుల ఆధిపత్యం పోలేదని, అవకాశం చిక్కితే మళ్లీ తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటారని, అందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని నమ్మించడం ద్వారా చాలా కాలం కెసిఆర్ తనకు అనుకూలమైన వాతావరరణాన్ని కాపాడుకోగలిగారు. తన కోటరికీ చెందిన మేధావులు, రచయితల ద్వారా అదే మాట అనిపించారు. చాలా మంది నిజమేనని నమ్మారు. కానీ ప్రభుత్వం ఆంధ్ర సంపన్నవర్గాలతో సన్నిహితంగానూ, తెలంగాణ ప్రజలతో దూరంగానూ ఉంటూ వస్తున్న తీరు ఇప్పటికే బట్టబయలైంది. అందువల్ల అది పనిచేసే అవకాశం లేదు.

   పరిస్థితులను చక్కదిద్దితే తప్ప...

  పరిస్థితులను చక్కదిద్దితే తప్ప...

  ప్రమాద హెచ్చరికలు మోగడం ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికైనా కెసిఆర్ వాస్తవ పరిస్థితిని గ్రహించి, సమూలంగా మార్పులు చేస్తే తప్ప ఫలితం ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలుస్తానని, గెలిచే పాచికలు మాత్రమే కాదు, మాటలు కూడా తన వద్ద ఉన్నాయని అంటే ఎవరు చేసేది ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ తిరిగి అదికారంలోకి రారని చెప్పే ధైర్యం ఇప్పటి వరకు ఎవరికీ లేకపోవడం ఇప్పటికీ ఆయనకు ప్లస్ పాయింట్.

  English summary
  Opposition among Telagana public to CM and Telangana Rastra Samithi (TRS)chief K Chandrasekhar Rao (KCR) picking upmomeemtum.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X