By : Oneindia Telugu Video Team
Published : March 26, 2018, 05:13
02:02
బాల్ టాంపరింగ్ అంటే ఏంటి? ప్రయోజనం ?
బాల్ టాంపరింగ్.... గత రెండు రోజులుగా ప్రపంచ క్రికెట్లో మార్మోగుతున్న పేరు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజైన శనివారం ఆటలో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. తన ప్యాంట్ జేబులోంచి పసుపు రంగు పదార్థంతో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఇది కెమెరాల కంటికి చిక్కడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అంపైర్లకు అనుమానం వచ్చి అతడిని పిలిచి ప్రశ్నించారు. జేబుల్లో చేతులు పెట్టుకుని ఏమీ తెలియని అమాయకుడిలా వారి వద్దకు వెళ్లాడు. జేబులో ఏముందో చూపించమని అంటే అతను కళ్లద్దాల సంచిని తీసి చూపించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్ యధావిధిగా కొనసాగించారు. కానీ అసలు విషయం ఏంటంటే.. బాన్‌క్రాఫ్ట్ అంతకుముందే అప్రమత్తం అయ్యాడు. అతను బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు డ్రెస్సింగ్ రూమ్‌లోని టీవీలో చూసిన కోచ్ లీమన్ కంగారు పడ్డాడు. వెంటనే డగౌట్ దగ్గర ఉన్న సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మైదానంలోకి నీళ్లు తీసుకొని వెళ్లాడు. బాన్‌క్రాప్ట్‌కు టీవీ స్క్రీన్ దృశ్యాలకు చెందిన విషయం చెప్పడంతో జాగ్రత్త పడ్డాడు.
అతను వెంటనే జేబులో ఉన్న ఆ పరికరాన్ని తీసి ప్యాంటు లోపల వేసుకున్నాడు. అయితే, మూడో రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియో సమావేశంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ సీనియర్ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని అన్నాడు. దీంతో ఆటగాళ్లు అసలు బాల్ టాంపరింగ్ ఎందుకు చేస్తారు. దాని వల్ల కలిగే ప్రయోజనం సగటు క్రికెట్ అభిమానిని మదిని తొలుస్తున్నాయి.
బాల్ టాంపరింగ్ ఎందుకంటే?
బాల్ టాంపరింగ్ వల్ల బంతి స్వరూపం మారిపోతుంది. కొత్త బంతిని రివర్స్ స్వింగ్ కష్టం. అదే బంతి స్వరూపాన్ని మారిస్తే అది రివర్స్ స్వింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. తద్వారా ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చొచ్చు. ఇందులో భాగంగానే కెప్టెన్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం బంతి స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారు.
ఆస్ట్రేలియన్ల బాల్ టాంపరింగ్ వివాదంపై అటు మాజీ క్రికెటర్లతో పాటు ఆసీస్ మీడియా సైతం ఏకిపారేసింది. ఈ ఘటనను క్రికెట్లో ఓ చీకటి దినంగా అభివర్ణించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రవర్తన దేశానికి తలవంపులు తీసుకొచ్చిందని ఓ కథనంలో పేర్కొంది. ఆటగాళ్లకు జేబుల నిండా డబ్బు నింపి ఆడమని పంపిస్తే, మోసం చేశారని ద ఆస్ట్రేలియన్ పత్రిక తన కథనం ప్రచురించింది.