By : Oneindia Telugu Video Team
Published : February 21, 2018, 05:30

పాము తలను కొరికేసి, నమిలి పడేశాడు బాబోయ్ !

పాము అంటే చాలా మంది ఆమడ దూరం పరుగెడతారు. ఎందుకంటే.. పాము కాటెస్తే ఏం జరుగుతోందో తెలుసు కాబట్టి. అయితే, ఇక్కడ మాత్రం అలా జరగలేదు. పాము తనను కాటేసిందనే కోపంతో ఓ వ్యక్తి.. ఏకంగా దాని తలను నోటితో కొరికేసి, నమిలి పడేశాడు. ఆ తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతని శరీరంపై ఎక్కడా కూడా పాము కాటు వేసినట్లు దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్డోయిలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శుక్లాపూర్‌ భగార్‌ గ్రామానికి చెందిన సోనేలాల్‌ అనే రైతు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని వెంటనే ఘటనా స్థలానికి రావాలని మొఘాగంజ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)కి చెందిన అంబులెన్స్‌కు స్థానికుడు ఒకరు ఫోన్‌ చేశారు. దీంతో హుటాహుటిన అతన్ని సీహెచ్‌సీలోని అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు.
ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మహేంద్ర వర్మ, ఫార్మాసిస్ట్‌ హితేశ్‌ కుమార్‌ సదరు వ్యక్తికి వైద్యం అందించారు. సోనేలాల్‌ను పాము కాటేసిందని అతని స్నేహితులు రామ్‌ సేవక్‌, రామ్‌ స్వరూప్‌ ఈ సందర్భంగా వైద్యులకు తెలిపారు.
కాగా, అతని శరీరాన్ని పరిశీలించగా ఎక్కడా ఎటువంటి పాము కాట్లు కనిపించలేదని.. అతనికి అత్యవసర సేవలందిస్తూ.. పరిశీలిస్తున్నట్లు హితేశ్‌ వెల్లడించారు. కొంత సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన సోనేలాల్‌ మాట్లాడుతూ.. జరిగిన విషయం చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ‘పొలంలో పశువులను మేపుతుండగా నన్ను పాము కాటేసింది. కోపంతో దాన్ని పట్టుకొని తల కొరికి నమిలి తర్వాత ఉమ్మివేశాను' అని సోనేలాల్ చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా