By : Oneindia Telugu Video Team
Published : February 24, 2018, 10:15

అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీలు తనపైకి దెయ్యాలను వదిలారని, అందుకే తన అధికారిక భవనాన్ని ఖాళీ చేస్తున్నానని రెండ్రోజుల క్రితం ఎమ్మెల్యే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా, రాజస్థాన్ అసెంబ్లీలో కూడా దెయ్యాలు తిరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు చెబుతుండటం గమనార్హం. వెంటనే పూజలు చేసి శుద్ధి చేయాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని బీజేపీ ఎమ్మెల్యే హబిబుర్ రెహమాన్ చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రెహమాన్, కౌలాల్ గుర్జార్ ఈ దెయ్యాల ప్రస్తావన తెచ్చారు. అసెంబ్లీలో దెయ్యాలు పట్టిపీడిస్తున్నాయని.. అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారని అన్నారు.
ఇదంతా శ్మశానం మీద అసెంబ్లీని నిర్మించడంతో అక్కడ ఉన్న దెయ్యాలన్నీ ఇప్పుడు అసెంబ్లీలో తిరుగుతున్నాయని ఆ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. 200మంది సభ్యులు ఉండాల్సిన అసెంబ్లీలో వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని, కొంతమంది రాజీనామాలు చేస్తున్నారని చెప్పారు.
అంతేగాక, మరికొంతమంది జైళ్లకు వెళ్తున్నారని, ఇంకొంతమంది అనారోగ్యానికి గురై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా దెయ్యాల వల్లే జరుగుతోందని ఆరోపించారు. అసెంబ్లీ భవనాన్ని శ్మశానం మీద నిర్మించారనే విషయాన్ని తాను సీఎం వసుంధర రాజేకు తెలిపానని, హోమాలు, పూజలు నిర్వహించి దెయ్యాలను వెళ్లగొట్టాలని కోరినట్లు రెహమాన్ తెలిపారు.
కాగా, నథ్వారా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కళ్యాణ్ సింగ్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. గత ఆగస్టులో బీజేపీ ఎమ్మెల్యే కృతి కుమారి స్వైన్ ఫ్లూ కారణంగా కన్నుమూశారు. ఇది ఇలావుండగా, ఈ వాదనను అసెంబ్లీ సెక్రటరీ పృథ్వీరాజ్ కొట్టిపారేశారు. విధుల్లో భాగంగా తాము చాలా సార్లు అర్ధరాత్రి వరకు అసెంబ్లీ ప్రాంగణంలోనే గడిపామని, దెయ్యాలేమీ లేవని చెప్పుకొచ్చారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా