By: Oneindia Telugu Video Team
Published : January 30, 2018, 06:45

ఫిబ్రవరి 1న బడ్జెట్: ఆకాంక్షలు నెరవేరేనా?

Subscribe to Oneindia Telugu

సామాన్యులు.. కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు.. వివిధ పారిశ్రామిక రంగాలు ఎదురుచూస్తున్న బడ్జెట్.. అందునా ఎన్నికల ముంగిట మంత్రి అరుణ్ జైట్లీ వచ్చేనెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పారిశ్రామిక రంగాలు, ప్రముఖులు, ఆర్థిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు తమకు తాయిలాలు ప్రకటించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. పెట్టుబడుల పెంపునకు మార్గం సుగమం చేయాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. దేశ ప్రగతికి చుక్కాని అయిన వ్యవసాయంతోపాటు వ్యాపార అభ్యున్నతి కోసం రాయితీలు ప్రకటించాలని ఆశిస్తున్నారు. 2016 నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు, గతేడాది జూలై ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్రుద్ధిరేటు 6.75శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో జాతి ఆర్థిక, సామాజిక ప్రగతి పరుగులు పెట్టే దిశగా జీడీపీకి పూర్వ వైభవం సాధించే దిశగా విత్త మంత్రి అరుణ్ జైట్లీ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు ద్రవ్యలోటు లక్ష్యాలు చేరుకోగలమా? అని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. అదే జరిగితే లక్ష్యాలను ఛేదించడానికి బాండ్లు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ల అంచనాలు, ఆకాంక్షలు ఒకసారి పరిశీలిద్దాం..
కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల ఆధారంగా లభించే లాభాలపై విధించే కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కార్పొరేట్లు ఆశిస్తున్నారు. దీంతోపాటు కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5 నుంచి 15 శాతానికి తగ్గించాలని మరో అభ్యర్థన. టాక్స్ డిడక్షన్లు విస్తరించి.. వ్యక్తిగత ఆదాయ మినహాయింపులు పెంచాలన్నది ఇంకొక అభ్యర్థన. వ్యవసాయ రంగంలో ప్రోత్సాహం కోసం రుణ పరపతికి హామీ కోసం ఫండ్ ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాల కోసం అధిక నిధులు కేటాయించాలి. సూక్ష్మ సాగునీటి పరిశ్రమల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, కాలువల నిర్మాణానికి నిధుల పెంపు. వ్యర్థాల నివారణకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీల కొనసాగింపు. రసాయన ఎరువులపై సబ్సిడీలు తగ్గించాలి. మొండి బకాయిలపై పూర్తిస్థాయి టాక్స్ డిడక్షన్ అనుమతించాలి. బ్యాంకుల్లో రూ. 10 వేల డిపాజిట్లపై వడ్డీ మినహాయించాలి. రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఐదేళ్ల నుంచి మూడేళ్లకు పన్ను మినహాయింపు. ఇన్ సాల్వెన్సీ కోడ్ కింద పన్ను మినహాయింపు. ఇదిలా ఉంటే గత బడ్జెట్‌తో పోలిస్తే వచ్చే బడ్జెట్లో 10 - 15 శాతం పెట్టుబడుల పెంపు. పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాలను అనుసంధానించే భారతమాల ప్రాజెక్టుతోపాటు కీలక రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు పూర్తి మద్దతు ఇవ్వాలి. రైల్వే శాఖకు 10 శాతం పెట్టుబడులు పెంచాలి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా