By: Oneindia Telugu Video Team
Published : January 23, 2018, 02:29

2018 బడ్జెట్‌లో రైల్వే

Subscribe to Oneindia Telugu

రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో దాదాపు 12 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు 2018-19 బడ్జెట్‌లో సుమారు రూ.3000 కోట్ల మేర కేటాయింపులు జరపనున్నది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 395 రైల్వేస్టేషన్లు, 50 రైళ్లలో మాత్రమే సీసీటీవీ కెమెరాల వ్యవస్థ ఉంది. ఇకపై ప్రీమియర్‌, సబర్బన్‌ సహా 11వేల రైళ్లు సహా దేశవ్యాప్తంగా ఉన్న 8,500 రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. బోగీ ద్వారం మొదలుకుని, లోపల అన్ని చోట్లా నిఘా ఉండే విధంగా ఒక్కో కోచ్‌లో మొత్తం ఎనిమిది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
రానున్న రెండేళ్లలో రాజధాని, శతాబ్ది, దురంతో సహా అన్ని మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌, పాసింజర్‌ రైళ్లలో ఈ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి నిధుల కోసం రైల్వే శాఖ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అవసరమైతే మార్కెట్‌ నుంచి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది.
మరోవైపు గతేడాది పట్టాలు తప్పిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఎక్కువగా రైల్వేలో భద్రతకు పెద్దపీట వేస్తారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ప్రస్తావిస్తారు. 4,943 మానవ రహిత లెవెల్‌ క్రాసింగులను తొలగించడంతో పాటు, పాత పట్టాలను మార్చడం, పట్టాలను మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ కేటాయింపులు ఉండనున్నాయి. 2020 నాటికి అన్ని మానవరహిత లెవెల్‌ క్రాసింగులను తొలగించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రైల్వేల రాకపోకల గురించి 99.3 శాతం సరైన సమాచారం అందుబాటులోకి తేవడానికి జీపీఎస్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం దేశవ్యాప్తంగా తొలిదశలో ఈ ఏడాది చివరి వరకు 2700 ఇంజిన్లలో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెన్ చెప్పారు. మిగతా ఇంజిన్లు, స్టేషన్ల పరిధిలో దశల వారీగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తొలిదశలో న్యూఢిల్లీ - గువాహటి, న్యూఢిల్లీ - ముంబై మధ్య నడిచే రాజదాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆరింటిలో వీటిని ఏర్పాటు చేస్తారన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా