By : Oneindia Telugu Video Team
Published : December 28, 2017, 12:26

తత్కాల్ టికెట్లు దొరకట్లేదా ? కారణమిదే!

రైల్వేలో జరుగుతున్న భారీ మోసం వెలుగుచూసింది. తత్కాల్ టికెట్ల కోసం ఎప్పుడు ప్రయత్నించినా దొరక్కపోవడానికి కారణాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. కాగా, సీబీఐలో పనిచేస్తున్న వ్యక్తే ఈ మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. అందుకే ఆన్‌లైన్ ద్వారానో లేదా రైల్వే టికెట్‌ కౌంటర్ల ముందో ఎంతసేపే పడిగాపులు పడి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కస్టమర్లకు టికెట్లు దొరకడం లేదు. అయితే, ఈ టికెట్లు కొంతమంది దళారులకు మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ.. బుధవారం ఈ గుట్టురట్టు చేసింది.

వివరాల్లోకి వెళితే.. సీబీఐలో సహాయ ప్రోగ్రామర్‌గా ఉన్న అజయ్‌గార్గ్‌ (35) అనే వ్యక్తి రైల్వే కంప్యూటర్‌ వ్యవస్థలో దళారులు చొరబడేందుకు వీలు కల్పించే ప్రోగాంను రూపొందించాడు. అంతేగాక, తత్కాల్ టికెట్లను వారికి విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్న తీరు సీబీఐ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

2007 నుంచి నాలుగేళ్లపాటు భారతీయ రైల్వే ఆహార విహార సంస్థ (ఐఆర్‌సీటీసీ)లో పనిచేసిన అనుభవం ఉండడంతో అక్కడి కంప్యూటర్‌ వ్యవస్థలో లోపాలపై బాగా అవగాహన పెంచుకున్న అజయ్.. చివరకు ఈ అక్రమానికి తెరతీశాడని అధికారులు తెలిపారు. గార్గ్‌ను, అతనికి సహాయంగా ఉంటున్న అనిల్‌గుప్తాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరితో సహా 13 మందిపై కేసులు నమోదు చేశారు. అరెస్టయిన ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరచగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా