By : Oneindia Telugu Video Team
Published : March 16, 2018, 06:18

బాబుకి ముచ్చెమటలు పట్టిస్తున్న పవన్, జగన్

తెలుగుదేశం, బిజెపిల మధ్య తెగదెంపులు జరిగాయి. చాలా కాలంగా అనుకుంటోందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజు బిజెపిలో తెగదెంపులు చేసుకోక తప్పదని భావిస్తూ వచ్చినట్లే జరిగింది. చంద్రబాబును బిజెపి ఆ దిశగా నెడుతోందనే గత ప్రచారాలకు కూడా ఊతం ఇచ్చినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర బిజెపి నేతలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యసరంగా జరిగే ఆ సమావేశంలో బిజెపి జాతీయాధ్యక్షుడు కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఏ పార్టీతో కలిసి నడవాలనే విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఏ పార్టీతో వెళ్లాలనే విషయంపై బిజెపి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలుపుకోవాలా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి నడవాలా అనే విషయంపై మాట్లాడుతారని అంటున్నారు. అయితే, వారు ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకుంటారా అనేది సందేహమే.
జగన్, పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓ వైపు జగన్‌తోనూ మరోవైపు పవన్ కల్యాణ్‌తోనూ కేంద్రం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు విమర్శలను చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవిశ్వాసం ప్రతిపాదించి, ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని జగన్‌కు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తే హోదా ఇస్తామని పవన్‌కు కేంద్రం చెప్పిందని ఆయన అంటున్నారు. కేంద్రం నిజంగానే ఆలాచేసి ఇరువురితోనూ పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇప్పుడే చెప్పలేం.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్య కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ కల్యాణ్‌కు తాము సహకరిస్తామని ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. వరప్రసాద్ ప్రకటన తర్వాతనే చంద్రబాబుకు బిజెపి వ్యూహంపై ఓ స్పష్టత వచ్చి, తెగదెంపులు చేసుకున్నారని భావించవచ్చు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా