By : Oneindia Telugu Video Team
Published : February 15, 2018, 05:56

పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం, ఎంపీలకు ప్రశంస

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో తమ గళాన్ని గట్టిగా వినిపించిన ఎంపీలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసించారు. అలాగే పార్టీ నుంచి పదవులు పొంది సొంత ప్రయోజనాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న నేతలు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, మంత్రులతో గురువారం చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇకపై రోజూ పార్టీకి కొంత సమయం కేటాయిస్తానని చెప్పారు.
తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గుర్తు చేసిన చంద్రబాబు.. అనవసరంగా ఎప్పుడూ ఒకరిని నిందించబోమన్నారు. నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామన్నారు. రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామని..., అందుకు తగ్గ న్యాయం జరగాల్సిందేనన్నారు.
పార్లమెంట్ సమావేశంలో పార్టీ ఎంపీలు బాగా పనిచేసి ఏపీ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లారని చంద్రబాబు ప్రశంసించారు. రానున్న రోజుల్లోనూ ఇదే పోరాటం కొనసాగించాలని సూచించారు. కేంద్రంతో మిత్రపక్షంగా కొనసాగుతోంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పదవుల కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
పదవులకంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న ఆయన..., వాజ్ పేయి హయాంలో తొమ్మిది కేంద్ర మంత్రి పదవులు ఇస్తామన్నా వెంటపడలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇస్తామంటేనే ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు. ఈ విషయంపై నేతలంతా స్పష్టమైన వైఖరితో ఉండాలన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా