By : Oneindia Telugu Video Team
Published : December 12, 2017, 06:33

రేషన్ షాపుల స్థానంలో విలేజ్ మాల్స్...!

ఆంధ్రప్రదేశ్ లో పౌరసరఫరాల శాఖలో విప్లవాత్మకమైన మార్పు రానుంది. ఇప్పటివరకు అర్హులైన పేదలకు సబ్సిడీ మీద నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన రేషన్ షాపులు ఇకముందు తమ రూపురేఖలు పూర్తిగా మార్చేసుకోబోతున్నాయి. సంప్రదాయ రేషన్ షాపుల స్థానంలో ఆధునిక విలేజ్ మాల్స్ రానున్నాయి. వీటికి చంద్రన్న విలేజ్ మాల్స్ గా నామకరణం చేశారు.
ఈ విలేజ్ మాల్స్ పైలెట్ ప్రాజెక్టును ఎపి సిఎం చంద్రబాబు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ,గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగాత్మక విలేజ్ మాల్స్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రిలయెన్స్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీలు మంగళవారం ఉదయం అమరావతిలోని సెక్రటేరియట్‌ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభించారు.
చంద్రన్న విలేజ్‌ మాల్‌ను ప్రారంభించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం చంద్రబాబు లైవ్‌లో మాట్లాడారు. ఎవరైనా తమకు రేషన్ బియ్యం వద్దనుకునే తెల్లకార్డుదారులు అంతేవిలువైన నగదుకు చంద్రన్నవిలేజ్ మాల్ లో కావాల్సిన ఆహార పదార్ధాలు కొనుగోలు చేసుకోవచ్చని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న విలేజ్‌మాల్స్‌ని అధ్యయనం చేసిన అనంతరం ఈ తరహా విలేజ్ మాల్స్ మన రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు రిలయన్స్‌, వాల్‌మార్ట్‌ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఈ చంద్రన్న విలేజ్‌ మాల్స్ల్‌లో విక్రయం కోసం రిలయెన్స్‌ మొత్తం 320 రకాల సరుకులను సిద్ధం చేసింది. వీటిలో సాధారణ నిత్యావసరాలను సివిల్‌ సప్లయిస్‌ ఇవ్వనుండగా మిగతావి రిలయెన్స్‌ అందిస్తుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా