By : Oneindia Telugu Video Team
Published : March 03, 2018, 11:19

జైట్లీకి ఎంపీల దిమ్మతిరిగే కౌంటర్


ఏపీ అధికారులు వచ్చినప్పుడు కేంద్రం ఓ ఫార్ములా చెప్పిందని, దానిపై ఏపీ ప్రభుత్వం స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు కౌంటర్ ఇచ్చారు. వారు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఫార్ములా ఇచ్చామని చెబుతోందని విలేకరులు ప్రశ్నించగా.. ఏమిచ్చారో వారే చెప్పాలన్నారు.
తమకు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదని ఎంపీలు తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వాన్నే ఫార్ములా అడిగారని చెప్పారు. అసలు వాళ్లు ఫార్ములా ఇస్తే దానిని అంగీకరిస్తామా లేదా అన్న విషయం తాము చెబుతామన్నారు.
మార్చి నెలలో అన్నీ వస్తాయని, మీరు సన్మానం చేయించుకున్నారు కదా, ఏపీకి ఏం జరగలేదని చంద్రబాబు సహా అందరూ బాధపడుతున్నారని, ఇలాంటి సమయంలో సన్మానాల ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని ఓ విలేకరి గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులను ప్రశ్నించగా.. పార్టీ కేడర్ ఎమోషన్‌ను తాము ఆపలేమని చెప్పారు. తాము ఇప్పటి దాకా వెయిట్ చేశామని, ఇప్పుడు పోరాడుతున్నామన్నారు.
కేంద్రానికి నెల రోజుల పాటు గ్యాప్ వచ్చిందని, ఈ గ్యాప్‌లోను ఏం చేయలేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్మోహన్ నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిస్తే ఫలితం లేకుండా పోయిందని అబిప్రాయపడ్డారు. ఇప్పటి దాకా బీజేపీని నమ్మాని, ఇటీవల తాము బీజేపీపై నమ్మకం ఉందని చెప్పలేదన్నారు.
మార్చి 5 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, అప్పటి నుంచి తాము వ్యూహాత్మకంగా ముందుకు పోతామని ఎంపీలు చెప్పారు. డే బై డే, స్టెప్ బై స్టెప్ ముందుకు సాగుతామన్నారు. ఏం చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏం చేస్తామో ఇప్పుడే చెప్పమని, మిగతా వారు ప్రిపేర్ అవుతారని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాము ఏపీ ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నాం తప్పితే, సస్పెండ్ కావడం కోసం చేయడం లేదని ఎంపీలు అన్నారు. మిత్రపక్షంగా ఉండి తమను సస్పెండ్ చేస్తే అది హిస్టరీ అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదన్నారు.
ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం టీఆర్ఎస్ తమతో కలిసి వస్తుందా లేదా అంటే ఆ పార్టీ నిర్ణయించుకోవాలని ఎంపీలు చెప్పారు. తాము మాత్రం అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని తెలిపారు. తమకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కావాలన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా