By : Oneindia Telugu Video Team
Published : December 01, 2017, 12:28

'మెట్రో' కష్టాలు: అవగాహన లేకనే!

ఎప్పుడెప్పుడా అన్న నిరీక్షణకు తెరపడి భాగ్యనగర వాసులు మెట్రో ప్రయాణ కల నెరవేరింది. దేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే తొలి రెండు రోజులు భాగ్యనగర మెట్రోకు విపరీతమైన ఆదరణ లభించింది. మెట్రోతో నగరవాసుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ.. నిబంధనలపై అవగాహన లేకపోవడం కొంతమందిని గందరగోళానికి గురిచేస్తోంది. మెట్రో నిబంధనల గురించి ప్రజలకు ఇంకా పూర్తి స్థాయి అవగాహన ఏర్పడలేదు. దీంతో మెట్రో స్టేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు పాటించలేకపోతున్నారు. ఫలితంగా తమ స్మార్ట్ కార్డుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు అవుతున్నాయి. అంతేకాగా, రెండు గంటలకు మించి స్టేషన్లలో ఉండరాదన్న నిబంధన కూడా చాలామందికి తెలియలేదు. దీంతో నిబంధనలు తెలియక కొంతమంది జరిమానాలు చెల్లించేసుకుంటున్నారు.
దిగాల్సిన చోట కాకుండా మరో మెట్రో స్టేషన్ లో దిగడం ద్వారా కూడా కొంతమంది జరిమానాలు కట్టినట్లు తెలుస్తోంది. జరిమానాలు పర్సులు ఖాళీ చేయిస్తుండటంతో.. ఎల్&టీ మెట్రో యాజమాన్యం, ప్రభుత్వం మెట్రో నిబంధనలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మెట్రోలోకి వాటర్ బాటిల్స్ అనుమతించకపోవడం, స్టేషన్‌లో తాగునీటి, మరుగుదొడ్డి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పట్లేదు. అలాగే పరిమితికి మించి లగేజీని అనుమతించకపోవడం పట్ల కూడా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే 40కేజీలకు మించి లగేజీని అనుమతిస్తే.. ఎక్కువమంది వ్యాపారులు కూడా మెట్రో పైనే ఆధారపడే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా