By : Oneindia Telugu Video Team
Published : November 28, 2017, 12:03

రూ. 1.27 కోట్ల దోపిడీ : 6 గంటల వ్యవధిలోనే ?


హైదరాబాదులో మైసూరు నగల వ్యాపారుల నుంచి రూ.1.27 కోట్లను దోపిడీ చేసిన ముఠాను పోలీసులు ఆరుగంటల వ్యవధిలోనే పట్టుకుని తమ సత్తా చాటారు. పూర్తి సొమ్మును రికవరీ చేశారు. దోపిడీ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న మైసూర్‌కు చెందిన నగల వ్యాపారులు బషీర్‌బాగ్‌లోని స్కైలైన్ అపార్ట్‌మెంట్‌లోని పేయింగ్ గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. ఇక్కడ రాజస్థాన్‌కు చెందిన నానాలాల్ కుమావత్ వంటమనిషిగా పనిచేస్తున్నాడు
పేయింగ్ గెస్ట్ హౌస్‌కు వచ్చే వారివద్ద పెద్ద ఎత్తున డబ్బుంటుందని, వారిని దోచుకోవడానికి పథకం పన్నిన నానాలాల్ అవకాశం కోసం ఎదురు చూసి దొంగతనం చేసాడు. అయితే బషీర్‌బాగ్‌లో రాజ్‌కుమార్ అనే వ్యాపారి తన దుకాణానికి ఏర్పాటు చేసిన నేను సైతం కెమెరాలు దోపిడీ దొంగలకు సంబంధించిన క్లూను పోలీసులకు ఇచ్చాయని సీపీ చెప్పారు. దాని సాయంతో ఈ కేసును ఛేదించామని, కెమెరాలు ఏర్పాటు చేసుకున్న రాజ్‌కుమార్, వాటి ఏర్పాటుకు సహకరించిన రషీద్‌లను అభినందించారు.
ఆరుగంటల్లోనే కేసు ఛేదించిన ఇన్‌స్పెక్టర్ రవీందర్, డీఐ రాంబాబు, ఎస్సై శంకర్, క్రైం బృందానికి రివార్డులు ఇవ్వనున్నట్టు సీపీ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టుచేసి, పూర్తిసొత్తును రికవరీ చేశామని చెప్పారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవీస్ పాల్గొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా