By : Oneindia Telugu Video Team
Published : April 06, 2018, 04:11

''ఒక్కరి లోటుతో జట్టు బలం కోల్పోదు, ఈ సారి ట్రోపీ మాదే'

ఇంకో రెండ్రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్‌ను పురస్కరించుకుని గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులందరిని మీడియాకు పరిచయం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, సీఈవో షణ్ముకం సమక్షంలో జట్టులో చేరిన కొత్త ఆటగాళ్లకు జెర్సీలు అందజేశారు.
‘జట్టులో ఏ ఒక్కరో ముఖ్యం కాదు. సమష్టి కృషితోనే ఏదైనా సాధ్యం. 2016లోలా మళ్లీ ట్రోఫీ గెలవాలంటే సమష్టిగా రాణించాలి. క్రికెట్‌ జట్టుగా ఆడే ఆట. ఏ ఒక్క ఆటగాడిపై అతిగా ఆధారపడలేం. గత సీజన్‌లలో వార్నర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు. అనివార్య కారణాల వల్ల అతను జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీ ప్రభావం జట్టుపై కొద్దిగా ఉంటుంది.
బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి ఆటగాళ్ళున్నారు. అవకాశం లభిస్తే సత్తాచాటేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. వేలం పాటలో సమర్థులైన ఆటగాళ్లను తీసుకున్నాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకం ఉంది. అలెక్స్‌ హేల్స్‌ నాణ్యమైన కుడిచేతి వాటం ఆటగాడు. ఎడమచేతి వాటం ధావన్‌కు అతనే సరైన జోడీ. కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ రాణిస్తాడన్న నమ్మకముంది'' అని తెలిపాడు.
నటరాజన్, గోస్వామి, సాహా, ఖలీల్ అహ్మద్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, థంపీ, సచిన్ బేబీ, సందీప్, మెహదీ హసన్, స్టాన్‌లేక్, బ్రాత్‌వైట్, షకీబ్ ఈసారి కొత్తగా జట్టులో చేరారు. మరోవైపు జట్టు వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరిస్తాడని మెంటార్ లక్ష్మణ్ తెలిపాడు. గతంలో మా జట్టు అంతా బాగున్నప్పటికీ మిడిలార్డర్ కూర్పు సరిగా లేదు. ఈసారి ఆ లోటును భర్తీ చేసేందుకే ఐపీఎల్ వేలంలో నాణ్యమైన కొత్త ఆటగాళ్లను తీసుకున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నర్లే అని వీవీఎస్ వెల్లడించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా