By : Oneindia Telugu Video Team
Published : March 02, 2018, 05:13

మోడీపై టంగ్ స్లిప్ : కేసీఆర్‌కు ఝలక్ మీద ఝలక్ !


ప్రధాని నరేంద్ర మోడీపై తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాస్త కటువుగానే మాట్లాడారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం అన్నారు. ప్రధాని మోడీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
తన ప్రసంగంలో కేసీఆర్ మోడీని ఉద్దేశ్యపూర్వకంగా అనలేదని, మాట్లాడుతుండగా ఫ్లోలో అలా అన్నారని చెప్పారు. చిన్న పొరపాటును బీజేపీ నేతలు రాద్దాంతం చేయడం సరికాదన్నారు. రైతుల పట్ల ఆవేదనతో కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారన్నారు. గతంలో మోడీ కూడా పొరపాటున 600 కోట్ల మంది తనకు ఓటేశారని చెప్పారు కదా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై కవిత స్పందిస్తూ.. 'నాన్నగారు అలా మాట్లాడుతారని అనుకోను. స్లిప్ ఆఫ్ ది టంగ్ అయి ఉంటుందనుకుంటా' అని వ్యాఖ్యానించారు.
మోడీపై కేసీఆర్ వాడిన పదజాలం తనకు నచ్చలేదని, ీసఎం వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలను బాధించాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఎం, ప్రధాని వంటి వారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవుల్లో ఉన్నారని, అలాంటప్పుడు మాట్లాడే తీరు సరిగా ఉండాలన్నారు.
ప్రధాని మోడీని కేసీఆర్‌ ఏకవచనంతో సంభోదించడం సరికాదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదిభట్లలో బోయింగ్‌-టాటా కంపెనీ కార్యక్రమానికి హాజరుకావడానికి ముందే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ప్రధాని మోడీ పట్ల కేసీఆర్‌ అనుచితంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను ఈ కార్యక్రమానికి రావడం బాగుండదని చెప్పానని అన్నారు.
నేను రావాలా, వద్దా? అని కేటీఆర్‌ను ప్రశ్నించా. తన తండ్రి కేసీఆర్‌ పొరపాటున నోరు జారారని, ఆయన అలా మాట్లాడతారని తాననుకోనని కేటీఆర్‌ అన్నారు. చాలా వివరంగా సమాధానం ఇచ్చారు కాబట్టే నేను వచ్చా. సభా వేదికపైనా నేను కేటీఆర్‌ను నిలదీశా' అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా