By : Oneindia Telugu Video Team
Published : February 14, 2018, 12:43

భూమాఫియా అలా జరుగుతోందా?

అధికారుల ఆజ్యం.. కబ్జాదారుల భూదాహం.. వెరసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి స్వాహా అవుతోంది. ఆక్రమణలను గుర్తించిన తర్వాత కూడా అధికారులు చర్యలు తీసుకోకపోగా.. తిరిగి ఆక్రమణదారులకే ఆ భూములను కట్టబెట్టబోతుండటం విడ్డూరం. హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఆర్‌సి.పురం(రామచంద్రాపురం) మండలం కొల్లూరులో ఈ భూ బాగోతం వెలుగుచూసింది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న సర్వే నం.191 భూమి ఆక్రమణదారుల అడ్డాగా మారింది.
కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని సర్వే నం.191లో 283.05 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకు కూడా భూములను కేటాయించింది. అయితే అందులో కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగా లేక భూములు అమ్ముకున్నారు. వారి వద్ద నుంచి భూములు కొనుగోలు చేసిన కొంతమంది కన్ను పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల మీద పడింది.
కొంతమంది స్వాతంత్ర్య సమరయోధుల నుంచి భూములు కొనుగోలు చేసినవాళ్లు.. పక్కనే ఉన్న సర్వే నం.93,94 సబ్‌డివిజన్లలో ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు. అయితే అప్పట్లో ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో అధికారులు ఆ భూముల్లో 'ప్రభుత్వ భూములు' అని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
బోర్డులైతే పాతారు కానీ ఆక్రమణదారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇదే అలసత్వంగా తీసుకున్న కబ్జారాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. మళ్లీ ఆ 11ఎకరాల భూమిపై కన్నేసిన కొంతమంది కబ్జాదారులు అందులో కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. భూమిలోకి మరో వ్యక్తి అడుగుపెట్టకుండా నిత్యం అక్కడ కాపలా ఉంటున్నారు.
ఇటీవల ఆ భూమి వద్దకు రెవెన్యూ అధికారులు రావడం చాలా అనుమానాలకు తావిచ్చింది. ఈ భూమి తమదేనని చెప్పి కొంతమంది దరఖాస్తు చేసుకున్నారని, హద్దులు నిర్ణయించాలని తమకు వినతీపత్రం పెట్టారని రెవెన్యూ సిబ్బంది చెప్పారు. స్థానికులను అడిగితే.. కబ్జాదారులు ఇది మా భూమేనని వాదిస్తున్నట్టు తెలిపారు. నిజానిజాలను నిర్దారించకుండా అధికారులు హద్దులు నిర్ణయించడానికే వెళ్లారా?.. లేక కబ్జా భూమిని పరిశీలించేందుకే వెళ్లారా? అన్న దానిపై క్లారిటీ లేదు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా