By : Oneindia Telugu Video Team
Published : April 07, 2018, 03:57

వాళ్లే మన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు..:మోడీ


వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నత స్థానాన్ని చేరుకోవడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకే తనపై ఉన్న వ్యతిరేకత హింసాత్మక రూపం దాల్చుతోందని అన్నారు. బీజేపీ 38వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ నాయకులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దళిత సంఘాల 'భారత్ బంద్' హింసాత్మక రూపం దాల్చి 11మంది మృతి చెందిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓబీసీ వర్గానికి చెందిన, పేద తల్లి కుమారుడినైన తాను ప్రధాని కావడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారని మోడీ పేర్కొన్నారు. బీజేపీ ఎదుగుదలను చూసి వారు సహించలేకపోతున్నారని ఆరోపించారు.బీజేపీ 'గెలుపు తర్వాత గెలుపు' అన్నట్టుగా సాగుతుంటే.. కాంగ్రెస్ 'అబద్దం తర్వాత అబద్దం' అన్నట్టుగా సాగుతోందని విమర్శించారు.
'మోడీని తప్పించు, కుర్చీని లాక్కో' అన్నదే కాంగ్రెస్ ఎజెండా అని మోడీ విమర్శించారు.'ప్రతిపక్షం మన పట్ల రోజురోజుకు తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకుంటోంది. అది హింసాత్మకత వైపు మళ్లుతోంది. దీనికి కారణం.. మనమేదో తప్పు చేయడం కాదు. వాళ్లు మన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోవడమే' అని మోడీ చెప్పుకొచ్చారు.చాలాకాలం బ్రాహ్మణ-బనియాగా ముద్రపడ్డ బీజేపీ..సొంతంగా అధికారంలోకి వచ్చిన మొదటిసారే ఒక దళితున్ని రాష్ట్రపతి చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.బీజేపీ బడుగు బలహీన వర్గాల పార్టీగా మారడాన్ని,కింది స్థాయి వర్గాల నుంచే బీజేపీలో ఎక్కువమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటాన్ని ప్రతిపక్షం తట్టుకోలేకపోతోందని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా