By : Oneindia Telugu Video Team
Published : December 09, 2017, 01:15

ప్రభుత్వాలు కూలిపోతాయి : బాధితులతో పవన్ కళ్యాణ్


జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలులో ఫెర్రీఘాట్ పడవ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన వారికి అండగా ఉంటుందని అన్నారు.
విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద గత నెలలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృతులకు సంతాపం తెలిపిన ఆయన తరువాత స్వయంగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలుకు వచ్చారు.
పవన్ తమను పరామర్శించేందుకు రావడంపై బాధిత కుటుంబాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాదం జరిగిందని, హెచ్చరించినా వినకుండా బోటును లోపలికి తీసుకెళ్లారని వారు ఆయనతో తమ ఆవేదన పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరదాగా విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎవరింట్లో అయినా ఓ మనిషి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు. ప్రమాదానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. తాను అధికారులను నిందించేందుకు ఇక్కడికి రాలేదని అన్నారు. రాజకీయ నాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయిందని, ఏ ప్రమాదం జరిగినా ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసి చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైపోయిందంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా