By : Oneindia Telugu Video Team
Published : April 06, 2018, 11:26

వారి పోరటం వల్లే సల్మాన్ కి శిక్ష....!

20ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది జోధ్ పూర్ కోర్టు.ఈ కేసులో సల్మాన్ కి మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడి ఉంటే.. ఈపాటికే బెయిల్ మీద బయటకొచ్చేవాడు. కానీ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధించడంతో.. ఆ తీర్పును హైకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా ఉన్నత స్థాయి వ్యక్తులు, సెలబ్రిటీలు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు... సులువుగా తప్పించుకోగలరు అన్న అభిప్రాయం జనాల్లో బలంగా పాతుకుపోయింది. అందుకు భిన్నంగా సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లాంటి ఘటనలు ఆ అంచనాలు తప్పని నిరూపిస్తున్నాయి. సల్మాన్ విషయంలో మాత్రం 'బిష్ణోయ్' అనే తెగ చేసిన అలుపెరిగన పోరాటమే అతనికి శిక్ష పడేలా చేసిందంటున్నారు.
బిష్ణోయ్ తెగకు మూల పురుషుడు గురు జాంభేశ్వర్. చెట్లను, జంతువులను రక్షించుకోవడానికి ప్రాణత్యాగానికైనా వారు సిద్దపడుతారంటే వారి నిబద్దత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నమ్మిన ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి 1730లో రాజును సైతం ఎదిరించారు. తన ప్యాలెస్ నిర్మాణం కోసం కేజ్రీ అనే చెట్లను నరకాల్సిందిగా అప్పటి జోధ్ పూర్ రాజు ఆదేశాలిచ్చాడు. ఆ సమయంలో బిష్ణోయ్ తెగ ప్రజలు రాజు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
సైనికులు చెట్లను నరుకుతుంటే.. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో వారు చెట్లను వాటేసుకోగా.. సైనికుల గొడ్డలి వేటుకు బలైపోయారు. ఆ ఘటనలో వందలాది మంది బిష్ణోయ్ మహిళలు, పిల్లలు, పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి కాలంలో చిప్కో ఉద్యమ సృష్టికర్త అయిన అమృతా దేవికి ఈ ఘటనే స్ఫూర్తినిచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా