By : Oneindia Telugu Video Team
Published : January 04, 2018, 10:32

గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

మహిళా రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది. గజల్ శ్రీనివాస్‌ను సేవ్‌టెంపుల్స్‌ సంస్థ ప్రచారకర్త బాధ్యతల నుంచి తొలగించారు. ఈ మేరకు గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్‌ను తమ సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా, మరికొన్ని సంస్థలు కూడా గజల్ శ్రీనివాస్‌ను తమ సంస్థల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

సేవ్‌ టెంపుల్స్‌ సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో గజల్‌ శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం జనవరి 12 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులు, వికృత చేష్టలకు సంబంధించిన 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గజల్ శ్రీనివాస్‌ను ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెనుకేసుకు రావడం గమనార్హం. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి గజల్ శ్రీనివాస్ బాగా తెలుసని, అతను అలాంటివాడు కాదని అన్నారు. అతను ఏ తప్పూ చేయలేదని అనుకుంటున్నానని, అతనిపై కావాలనే కుట్ర చేశారని భావిస్తున్నానని అన్నారు. శ్రీనివాస్ చాలా చక్కగా కమ్మని పాటలు పాడతాడని, ప్రపంచ వ్యాప్తంగా గజల్స్ వినిపించాడని తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా