By : Oneindia Telugu Video Team
Published : February 05, 2018, 05:19

రెచ్చిపోతున్న సోము వీర్రాజు: రంగంలోకి చంద్రబాబు

బడ్జెట్ నేపథ్యంలో బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువర్గాలు సై అంటే సై అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీపై వీర్రాజు నిప్పులు చెరుగుతుంటే, అందుకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.
వ్యవహారం ముదిరే పరిస్థితులు కనిపిస్తుండటంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దని ఆయన నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత విమర్శలపై సంయమనం పాటించాలని సూచించారు.
సోము వీర్రాజు మనపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం లేదని టీడీపీ అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది. వీర్రాజు ఏం మాట్లాడినా మౌనం వహించాలని, అతిగా స్పందించవద్దని సూచించింది. దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హితవు పలికింది.
బడ్జెట్‌పై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆదివారం వరకు చెప్పారు. ఢిల్లీ పెద్దలు సముదాయించడంతో ఓ మెట్టు దిగారు. అయితే, టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలపై సోము వీర్రాజు ధీటుగా స్పందించారు.
దీంతో తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దా వెంకన్న, జీవీ ఆంజనేయులు, మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు తదితరులు సోము వీర్రాజుపై నిప్పులు చెరిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన చంద్రబాబు రంగంలోకి దిగారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా