By : Oneindia Telugu Video Team
Published : February 09, 2018, 04:06

అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు, పద్మావత్ మోసం లా ?


ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో బీజేపీ అగ్రనేత అద్వానీని కలిశారు. ఏపీ విభజన సమస్యలను ఆయనకు వివరించారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలన్నారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయాలన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడుతానని టీడీపీ ఎంపీలకు అద్వానీ హామీ ఇచ్చారు. మరోవైపు, అంతకుముందు, బీజేపీపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు మురళీ మోహన్, గల్లా జయదేవ్, అవంతి శ్రీనివాస్ తదితరులు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభ వాయిదాపడిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
లోకసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై ఏపీ ఎంపీలందరూ అసంతృప్తిగా ఉన్నారని మరో ఎంపీ అవంతీ శ్రీనివాస్ అన్నారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. పద్మావత్ సినిమాలో హీరోను విలన్ మోసం చేసినట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.ప్రతిసారి చర్చలకు పిలిచి, మోసం చేశారని అవంతి మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఒక్కసారి సహనం కోల్పోతే ఏం జరుగుతోందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పట్టకుండా చూసుకోవాలన్నారు. తమకు హైకమాండ్ ప్రజలే అని చెప్పారు. రైల్వే జోన్ గురించి ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా