By : Oneindia Telugu Video Team
Published : April 04, 2018, 06:40

ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా:విజయ్ సాయి రెడ్డి

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చానని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ బుధవారం ప్రశ్నించారు. హేమమాలిని తదితర బీజేపీ నేతలను కలిశారని చెప్పారు.హోదా ఏపీకి ఊపిరి వంటిది అన్నారు.ఊపిరి ఉన్నంత వరకు తాము హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రాజీనామాలు చేయగానే ఏపీ భవన్ వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.
నలభై ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉంటూ ఎవరో కొత్తగా పార్లమెంటులోకి వచ్చినట్లుగా నమస్కారం పెట్టడం, అదీ ఫోటోలకు ఫోజులు ఇస్తూ నమస్కరించడం విడ్డూరమని వరప్రసాద్ అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ప్రత్యేక హోదా కోసం రాలేదని, మేనేజ్ చేయడానికి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి బుధవారం అన్నారు.
హీరోలు,హీరోయిన్లతో చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని, సినిమా షూటింగ్‌కు క్లాప్ కొట్టినట్లు చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా అన్నారు.నిన్నటి వరకు బీజేపీ, జనసేన చక్రాలు టీడీపీకి ఉండెనని, ఇప్పుడు అవి లేకపోయేసరికి పార్ట్‌నర్ కోసం అర్రులు చాస్తూ, తిరుగుతున్నారన్నారు.
చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని విజయ సాయి రెడ్డి చెప్పారు. చంద్రబాబు అంతటా విశ్వసనీయత కోల్పోయారన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఏయే లావాదేవీలు చేశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ఫోటో షూట్ కోసమే ఢిల్లీకి వచ్చారని వ్యాఖ్యానించారు.
తనకు గత కొద్ది రోజులుగా రోడ్డుపై ఎక్కడ యూటర్న్ కనిపించినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నారని విజయ సాయి రెడ్డి అన్నారు.
చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఓ చక్రం జనసేన అయితే, మరో చక్రం బీజేపీ అన్నారు. గతంలో లెఫ్ట్ పార్టీ చక్రంపై నడిచారన్నారు. ఇప్పుడు ఏ చక్రం లేకపోవడంతో దానిని వెతుక్కునే పనిలో చంద్రబాబు పడ్డారన్నారు. కానీ ఎవరూ ముందుకు వచ్చేలా లేరని, ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేరని, ఆయన ఏకాకి అయ్యారన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా