By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 11:28

అఫ్రిది కశ్మీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఇలా: అఫ్రిది ఎవరని కపిల్ ప్రశ్న

కశ్మీర్ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మండిపడ్డాడు. తన జాతి ప్రయోజనాలను వ్యతిరేకించే ఎవరి అభిప్రాయాలకూ తన మద్దతు ఉండదని విరాట్ కోహ్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
'ఓ భారతీయుడిగా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం. కొన్ని అంశాలపై స్పందించాలా వద్దా అన్నది వాళ్ల వ్యక్తిగత విషయం. ఓ అంశంపై పూర్తి అవగాహన లేకుండా నేను మాట్లాడను. కానీ నా వరకు దేశ ప్రయోజనాలే ముందుంటాయి' అని విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
గత ఆదివారం కశ్మీర్‌లో భారత బలగాలు 13 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. ఇండియా ఆక్రమిత కశ్మీర్‌లో అమాయకులను అణచివేస్తున్నారంటూ అఫ్రిది తన ట్విటర్‌లో పేర్కొన్నాడు. ‘భారత్‌ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ఈ హింసను ఐక్యరాజ్యసమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి' అని ట్వీట్‌ చేశాడు.
మరోవైపు అప్రిది వ్యాఖ్యలపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా స్పందించాడు. అఫ్రిది ఎవరు అంటూ అతను ప్రశ్నించాడు. అతనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు అని కపిల్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా