By : Oneindia Telugu Video Team
Published : March 17, 2018, 05:50

ఉగాదికి పూజించిన దేవుడ్ని మరే పండుగకూ పూజించరు ఎందుకో తెలుసా ?


ఉగాది రోజున ఏ దేవుడ్ని ప్రార్ధించాలో అని చాలామంది అనుకుంటారు. ఉగాదికి ప్రత్యేకంగా ఏ దేవుడ్ని పూజించాలనే నియమనిబంధన లేకపోవడం విశేషం, అందుకే ప్రజలు అన్ని దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలతో పాటు ఇష్టదైవాలను కొలుస్తుంటారు. అయితే నూతన సంవత్సర ఆరంభం రోజున బ్రహ్మదేవున్ని ప్రార్ధిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మదేవున్ని ప్రార్ధించే ఏకైక పండగ ఈ ఉగాదే. గౌరీ వ్రతము, సౌభాగ్య వ్రతాలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోముకుడి బారి నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికిచ్చిన రోజు, సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజే ఉగాది.
ఈ పండగను ప్రజలందరు జరుపుకుంటారు. ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణులు ఎంతో ఘనంగా నిర్వహించు కుంటారు. ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంటికి, వ్యాపార సంస్థలకు సున్నాలు, రంగులు వేసుకుని చక్కగా రంగు రంగుల ముగ్గులతో అలంకరించుకుని ఉగాదికి ఒక రోజు ముందే అమవాస్య రోజునాడే పూజ ప్రారంభం చేస్తారు. పనిముట్లను శుభ్రపరచుకుని కులదైవాలైన విశ్వకర్మ భగవానుని, కాళికాదేవి అమ్మవారి,బ్రహ్మగారి పటాలకు నానావిధ పత్ర,పుష్పాలతో సుగంధ పుజా ద్రవ్యాలతో అలంకరించుకుని అఖండ దీపారాధన చేసి నిష్టతో పూజిస్తారు, దేవునికి ప్రత్యేకంగా "పడి" అనే మహానైవెద్యాన్ని మర్రి ఆకులతో విష్ణు చక్ర ఆకారంలో కుట్టి అందులో నివేదన చేస్తారు.
వారు తినేందుకు పచ్చని మోదుగ ఆకులతో విస్తర్లు తయారు చేసుకుని ఏక భుక్త భోజనం చేస్తారు. ఈ అఖండ దీపం కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకుని మరుసటి రోజైన ఉగాది నాటి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి పంచాంగ ఫలితాలను చూసుకుని ఆ రోజు కూడ నిష్టతో ఉంటారు. అఖండ దీపారాధన చేసిన మూడవ రోజు శుభముహూర్త శుభ ఘడియలలో కులదేవతలకు మహా నైవేద్య నివేదన చేసి మహాహారతినిచ్చి అఖండ దీపాన్ని, పూర్ణకలశాన్ని ,పనిముట్లను కదిపి (ఉద్వాసన చేసి) ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతపూజ చేసుకుని మూడు రోజుల పూజదీక్షనుండి విరమణ పొందుతారు. తిరిగి వారి వారి వ్యాపారంలో నిమగ్నమౌతారు.
ఈ విధంగా భారత దేశ హిందువులు ప్రకృతి అందించే కొత్తగా వచ్చే ఫల,దాన్య సంపందను తాను అనుభవిస్తున్నందుకు కృతజ్ఞతాభావం చేత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని తిని ఆ రోజే జ్యోతిష పండితులను కలిసి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు,ఈ పర్వదినం ప్రకృతి "సంపద" పండగా గుర్తించి దైవ దర్షనాలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా