By : Oneindia Telugu Video Team
Published : April 07, 2018, 05:01
01:33
డ్రామాలు ఆపు బాబూ!: వైయస్సార్ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా అనంతరం రాజీనామాలు చేసిన ఎంపీలు, ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. తమ దీక్షను రెండో రోజైన శనివారం కూడా కొనసాగిస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, దీక్ష విరమించాలని సూచించారు. అయితే ఎంపీ మేకపాటి మాత్రం దీక్ష కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రం దిగివచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తామని వైవీ స్పష్టం చేశారు.
గతంలో చెప్పిన విధంగానే రాజీనామాలు చేశామని చెప్పిన ఆయన,హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏం చేసేందుకైనా తాము సిద్ధమేనని తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరతీశారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా అన్యాయం జరుతున్నా ఏమాత్రం పట్టించుకోని బాబు, ఇప్పుడు అఖిలపక్షం సమావేశం అంటూ హడావిడి చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. జగన్ వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా సజీవంగా ఉందన్నారు.