By : Oneindia Telugu Video Team
Published : April 20, 2018, 03:12

టిడిపి బుజ్జగింపు తో మెత్తపడ్డ ఆనం...!

కేంద్రం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం చేస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న గురువారం అన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ 420 అని, కేంద్రంతో లాలూచీపడి ఎంపీలతో దీక్షలు, రాజీనామా నాటకం ఆడించారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే జగన్ రెండు పనులు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీకి సూచించారు. మొదటిది.. ఏపీకి జరిగిన అన్యాయంపై మీడియా సమక్షంలోప్రధాని మోడీని జగన్ గట్టిగా ప్రశ్నించాలన్నారు. రెండోది.. చంద్రబాబు దీక్షకు జగన్ వెళ్లి సంఘీభావం తెలపాలన్నారు.
మరోవైపు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన త్వరలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కేవలం నియోజకవర్గం విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడిందని, త్వరలో అది సమసిపోయి వైసీపీలో చేరుతారని భావించారు. కానీ ఇప్పుడు ఆనం మెత్తబడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బుధవారం ఆనం సోదరుడు జయకుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. బుజ్జగింపుల నేపథ్యంలో ఆయన మెత్తబడినట్లుగా తెలుస్తోంది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. ఆనం మెత్తబడ్డాడని టీడీపీ నేతలు అంటున్నారు.
శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే ధర్మపోరాట దీక్షలో పాల్గొనాలని కార్యకర్తలకు ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దీక్షలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని, ఆనం పార్టీ కార్యాలయం నుంచి సందేశాలు వెళ్లాయని సమాచారం. దీంతో ఆనం మెత్తబడినట్లుగా భావిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా