హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ రాజకీయ అపరిపక్వత

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని వాంఛించి దాన్ని అందిపుచ్చుకోవడంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లో రాజకీయ పరిపక్వత కనిపించడం లేదు. ఆయన అనుభవరాహిత్యం, వ్యూహలోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద మనిషిగా, ప్రజా బలమూ కార్యకర్తల బలగమూ శాసనసభ్యుల అండదందలూ ఉన్న నాయకుడిగా కనిపించడానికి ప్రయత్నిస్తూ అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ బెడిసి కొడుతుండడానికి ప్రధాన కారణం ఆయన అపరిపక్వతే. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఆ పార్టీ అధిష్టానం ఆలోచనలను పసిగట్టలేని అనుభవ రాహిత్యం కూడా ఆయనను వెంటాడుతోంది.

తనకు అధికార కాంక్ష లేదని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే తండ్రి అసంపూర్ణంగా వదిలి పెట్టిన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఏ కుమారుడైనా అనుకుంటాడని చెప్పడం ద్వారా తన రాజకీయ అపరిపక్వతను చాటుకున్నారు. తనకు పదవిపై కాంక్ష లేదని చెబుతూనే తన వర్గాన్ని ఉసిగొల్పుతున్న తీరు ఆయన వ్యూహంలోని ఘోర తప్పిదాన్ని బయటపెడుతోంది.

తన ఎత్తుగడలను దెబ్బ కొట్టడానికి అధిష్టానమే పూర్తిగా రంగంలోకి దిగిందన్న విషయాన్నికూడా ఆయన గుర్తించలేకపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోని ఒక వర్గం మాత్రమే తనకు వ్యతిరేకంగా పని చేస్తూ అధిష్టానం మనసు మారుస్తున్నారనే తప్పుడు అవగాహన ఆయనకున్నట్లు తోస్తోంది. ఇది ఏ మాత్రం నిజం కాదు. పార్టీ అధిష్టానమే స్వయంగా జగన్ ను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి వ్యూహాలు రచిస్తూ అమలు చేస్తోందన్న విషయాన్ని ఆయన గుర్తించడం లేదు. ప్రజారాజ్యంతో పొత్తు విషయంలో జగన్ శిబిరానికి చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టంగా పట్టిస్తాయి. అధిష్టానం ఆదేశాలు లేకుండా ప్రజారాజ్యంతో పొత్తుకు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రంగంలోకి దిగుతారని అంచనా వేయడమంత తెలివితక్కువ తనం మరోటి ఉండదు. తొలుత ఎవరైనా సూచించవచ్చు గానీ దానికి పచ్చజెండా ఊపి పొత్తులకు చర్చలు జరపాలని ఆదేశించిన తర్వాత రంగమంతా సిద్ధమవుతుందనేది కాస్తా పరిజ్ఞానం ఉన్నవారెవరికైనా అర్థమవుతుంది. అధిష్టానం మనసు మార్చడానికి ప్రయత్నిస్తామని, ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవద్దని అధిష్టానాన్ని కోరుతామని చెప్పడమంత అర్థరహితమైన ప్రకటన మరోటి ఉండదు.

వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయం సంఘటనా స్థలం నుంచి హైదరాబాద్ చేరక ముందు నుంచి జగన్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్న వర్గం పూర్తిగా పప్పులో కాలేస్తూ వస్తోంది. దాన్నిసరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నించిన దాఖలాలు లేవు.సోనియా మాట వింటానని చెబుతూనే తనకు అనుకూలంగా పార్టీ శాసనసభ్యులను, మంత్రులను జగన్ ఎగదోయడం అంత తెలివైన పనేం కాదని ఆయన గుర్తించడం లేదు. ప్రస్తుతం జగన్ వద్ద రెండే మార్గాలున్నాయి. ఒకటి - తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టుకోవడం, రోండోది - పార్టీ అధిష్టానానికి అణగిమణగి ఉండడం. అధిష్టానానికి అణగిమణగి ఉన్నా కూడా ఆయన ఆశించిన అధికారం ఇప్పట్లో దక్కుతుందనే గ్యారంటీ లేదు. అసలు దక్కుతుందో లేదో కూడా చెప్పలేం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X