వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగి సడలని అక్షరం

By Pratap
|
Google Oneindia TeluguNews

అనుభూతి ... ఆలోచన

ఈ రెండు పదాలు విభిన్నమైనవి. ఒకటి మనసుకు సంబంధించినది. రెండవది మెదడుకు సంబంధించినది. ఆలోచన తర్కిస్తుంది, విశ్లేషిస్తుంది, లాభనష్టాలను బేరీజు వేస్తుంది. మనసుకు తర్కవితర్కాలతో పనిలేదు. ఇష్టపడుతుంది. లేదా అయిష్టం చూపుతుంది. ఒక రాజకుమారిని ప్రేమించిన కూలివాడు మనసు మాట వినడం వల్లనే ప్రేమిస్తాడు. అందులో ఉన్న ప్రమాదాలను పట్టించుకోడు. అలాగే కూలివాడిని ప్రేమించిన రాజకుమారి కూడా మనసు మాటే వింటుంది కాని ఆ ప్రేమవల్ల ఎదురయ్యే కష్టాల గురించి ఆలోచించదు.

మనిషి ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. అనుభూతికి, మనసులోని ఇష్టాయిష్టాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే చాలా సందర్భాల్లో పిచ్చివాడిగా కనిపిస్తాడు. చిన్న పిల్లలు మనసు మాటే వింటారు. అందువల్లనే అమాయకంగా ఉంటారు. పెద్దలు ఆలోచిస్తారు అందువల్లనే తెలివిగా ఉంటారు.
అనుభూతి... ఆలోచన

ఈ రెండు పదాలు కవిత్వంలో చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు అంతే ముఖ్యమైన మరోపదం కూడా ఉంది. అది భావావేశం. నిజానికి అనుభూతి, ఆలోచన ఈ రెండింటికి మధ్య వారధిగా భావావేశాలు పనిచేస్తాయని చెప్పవచ్చు. అలోచించడం అన్నది కూడా భావావేశాల వల్లనే ప్రేరణ పొందుతుంది. అనుభూతి నిజానికి ఇంద్రియజ్ఙానానికి సంబంధించినదైనా పంచేంద్రియాలు మనకు చేరవేసిన సమాచారం వల్ల ప్రేరణ పొందిన భావావేశాలే అనుభూతిని కూడా కలిగిస్తాయి. కొందరు విమర్శకులు అనుభూతికి, ఆలోచన రెండు కలిసి ఉండడం సాధ్యం కాదని అన్నారు.

మరికొందరు విమర్శకులు అనుభూతి లేనిదే ఆలోచన లేదన్నారు. ఏది ఏమైనా ఫక్తు సౌందర్య దృష్టితో ఆలోచించినా అనుభూతి లేని ఆలోచన ఉండదనిపిస్తుంది. కవి మానసికంగా అనుభూతి చెందినప్పుడే అతని ఆలోచనల్లో అక్షరాలు ప్రవహిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆలోచనల ప్రవాహం అద్భుతమైన అనుభూతికి కారణం కావచ్చును.

కవి అనుభూతులు, ఆలోచనలు, భావావేశాలు ఇవన్నీ కలిసిన సృజనాత్మక కళారూపమే కవిత అవుతుంది. కేవలం అంతే కాదు, వీటన్నింటిపై సమాజం, సమకాలీన పరిస్థితుల ప్రభావం, ప్రేరణలు పనిచేస్తుంటాయి.

ప్రముఖ కవి జావేద్ అక్తర్ ఒక టీ.వీ. కార్యక్రమంలో మాట్లాడుతూ కవిత్వం అనేది Felt, Thought గా ఉండాలన్నాడు. ఈ పదాలు ఆలోచించదగ్గవి. ఒక కవిత రాస్తున్నప్పుడు కవిలో కలిగే భావావేశాలు, అనుభూతులు, ఆలోచనలు పాఠకుడిలోను ప్రతిబింబించాలి. కొన్ని కవితలు కేవలం గొప్ప అనుభూతిని ప్రసాదిస్తాయి. కొన్ని కవితలు భావావేశాల్లో ముంచెత్తుతాయి. ఈ భావావేశాలు కూడా కవి పాఠకుడిలో కోరుకునే భావావేశాలే. కవిత చదివిన తర్వాత పాఠకుడిలో తనవైన భావావేశాలు కాదు, కవి కోరుకున్న భావావేశాలే జనిస్తాయి. ఇదే కవి ప్రతిభ. కొన్ని కవితలు అనుభూతితో పాటు ఆలోచన రేకెత్తిస్తాయి. అలా ఆలోచన రేకెత్తించే కవితల్లోను కొన్ని కవి కోరుకున్న కోణంలోనే ఆలోచించేలా చేస్తాయి.

కాని, కొన్ని కవితలు పాఠకుడి ముందు పలు కోణాలను ఆవిష్కరిస్తాయి. పాఠకుడి ఆలోచనలను పరుగులు పెట్టిస్తాయి. కొత్త కొత్త కోణాల్లో ఆలోచించేలా చేస్తాయి. జావెద్ అక్తర్ చెప్పింది ఇదే. కేవలం అనుభూతి ప్రధానంగా లేదా కేవలం భావావేశాలను ప్రభావితం చేయడమే ముఖ్యంగా లేదా కేవలం కవి కోరుకున్న కోణంలో మాత్రమే ఆలోచించేలా చేసే కవితల కన్నా కవిత పాఠకుడిలో అనుభూతితో పాటు పాఠకుడి ఆలోచనా పటిమను, విశ్లేషణా సామర్థ్యాన్ని పెంచేదిగా ఉండాలి. ఇలాంటి కవిత్వమే అసలైన కవిత్వం అంటాడు.

రవీందర్ విలాసాగరం కవితలు చదివినప్పుడు జావెద్ అక్తర్ చెప్పిన ఆ మాటలే గుర్తొచ్చాయి. అనుభూతి, ఆలోచన రెండూ చెట్టాపట్టాలేసుకుని పాఠకుడిని పలకరిస్తాయిన ఈ కవితల్లో.

రవీందర్ విలాసాగరం, కవిసంగమంలో సుపరిచితమైన పేరు. అద్భుతమైన కవిత్వంతో కవిసంగమంలో ప్రతిరోజు కనిపించే పేరు. ఇప్పుడు కవిత్వసంపుటితో మన ముందుకు వస్తున్నాడు. ఈ కవిత్వసంపుటి గురించి రాస్తున్నప్పుడు కవిత్వంలో అనుభూతి, ఆలోచన గురించి ఇంతగా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ కవిత్వ సంపుటిలో చాలా కవితలు కవిత్వం గురించి, కవి గురించి, సాహిత్యం గురించి రాసిన కవితలు. నిజానికి రవీందర్ విలాసాగరం ఈ కవితల ద్వారా తనదైన కవిత్వ మ్యానిఫెస్టోను మన ముందుంచాడు.

''అక్షరం'' అనేది అలాంటి కవితే. ''అక్షరాలకు రోషముంటుంది/వాటికి రోషమొస్తుంది/ తేడా తెలియగానే,/ నిన్ను నడిబజారుకీడుస్తాయి'' అనే పంక్తుల్లో భావావేశాల ఉధృతి ఎంత ఉందో, ''అక్షరం/ అసమానతల తలలు నరికే/ వజ్రాయుధం'' అన్న పంక్తుల్లో ఆలోచనలను రేకెత్తించి పాఠకుడిని సమాజం వైపు మళ్ళించే గుణముంది. చివరిగా ''అక్షరాలు/ ... కన్నీటి చారికల/ తడిని ఆర్పే/ పిల్ల తెమ్మెరలు'' అనే పంక్తులు అద్భుతమైన భావుకతతతో అనుభూతి అలలుగా తాకుతాయి. ఈ కవితలో భావావేశాలు, అద్భుత అనుభూతిని కలిగించే కవనం, ఆలోచనలను రేకెత్తించే పంక్తులు అన్నీ ఉన్నాయి. నిజానికి ఈ సంపుటిలో ఇలాంటి కవితలెన్నో ఉన్నాయి.

రవీందర్ విలాసాగరం కవిత్వంలో భావావేశాలు, అనుభూతి ఆలోచనలకు ప్రేరణలయ్యే అనేక పంక్తులు మనకు కనిపిస్తాయి. ''పక్కలో విషపు పాలె పాము, దశాబ్ద కాలానికి పట్టిన చీడ, కోరల్ని పీకి దూరంగ విసిరేయ్యాలె'' అంటూ నిప్పులు కురిపించిన (రేపటి తెలంగాణ) కవి మరో చోట ''కడుపులో ఎలుకలకు , తినిపిద్దామని విప్పుతుంటే, కాలిన మాంసం వాసన వేస్తున్న, మధ్యాహ్నపు చద్దిమూట'' (చీకటి విందు)అంటూ అత్యంత ఆర్థ్రంగా మానవవినాశం పట్ల కన్నీరు కార్చడమే కాదు, మన కంటిలో నీరు సుళ్ళుతిరిగేలా చేస్తాడు. ''నా చిన్నతనంలో చెరువంటే సద్దిమూట'' అనే ఒక్క పంక్తిలోనే అనుభూతి వరదలో ఆలోచనల తుఫాను రేకెత్తిస్తాడు. అద్భుతమైన కవన ప్రతిభ ఉన్నప్పుడే ఇది సాధ్యం.

స్ధానిక భాషను బలంగా వాడడం వల్ల కవిత్వం ప్రజల్లోకి చొచ్చుకుపోతుందన్న వాస్తవం తెలిసిన కవి విలాసాగరం. అందువల్లనే అద్భుతమైన, ఎంతో అందమైన తెలంగాణ భాషను అంతే చాకచక్యంగా ఉపయోగించి ఔరా అనిపిస్తాడు.
నేను ఇంతకు ముందే చెప్పినట్లు తనదైన కవిత్వ మ్యానిఫెస్టో ఈ సంపుటిలో వివిధ కవితల ద్వారా ప్రకటించాడు. ''నిప్పు కణికలాంటి అక్షరాలు, నీ మనసును చేరడం లేదంటే, నువ్వు జీవమన్నా కోల్పోయి ఉండాలి, లేదా కన్నీటి తడి ఆరి, స్పందన లేనివాడన్నా కావాలి'' (వంచన) అంటూ కవిత్వంలో అక్షరాలు గుణగణాలను ప్రకటించడమే కాదు, ''సునామీలో చిక్కిన తీరంలాంటి, హృదయంలో కూడా ఆశను, రగిలిస్తాయి అక్షరాలు, తొలిపొద్దు వెలుగులా..'' అంటూ తన అక్షరాల స్వభావమేమిటో చెప్పాడు. వాటిని ఆస్వాదించాలంటే పాఠకుడిలో కూడా ఆ హృదయం ఉండాలి. కవిత్వం రాయడమే కాదు, కవిత్వాన్ని చదవడం, కవిత్వాన్ని వినడం, కవిత్వాన్ని ఆస్వాదించడం కూడా ఒక కళే. ఆ కళ తెలిసిన వారే మానవత్వంతో కళకళలాడే సమాజాన్ని నిర్మించగలరు. ఇదే విషయాన్ని ఈ కవిత చివరి పంక్తుల్లో అద్భుతంగా చెప్పాడు. ''నటనే జీవితంగా, ఉదాసీనతే జీవనంగా, పట్టింపులేనితనమే ప్రాణంగా గల, వారిని ఏవి కదిలించవు'' అంటూ తన కవితాగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

తన కవిత్వ మానిఫెస్టో మరింత స్పష్టంగా ప్రకటిస్తూ ''నా మాటల్లో సత్యం లేని వేళ, రాసి అక్షరాలన్ని, ముడుచుకుపోయి ఉంటయ్, శతాధిక వృద్ధుడిలా'' (వెలిసిపోతాయ్) అని చెప్పుకున్నాడు ఎలాంటి మొహమాటం లేకుండా. అంతేకాదు సత్యంలేని వేళ తన అక్షరాలు ''శరీరం మొత్తం కూలబడి, కళ వెలిసిపోతుంది, శవంలా...'' అంటూ చెప్పిన మాటల్లో తన అక్షరాలు జీవం వదిలిన శవాలు కానే కావని, అవి జీవకళతో ఎగిసిపడే కడలి కెరటాలని చాటి చెప్పుకున్నాడు. అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న కవి మాత్రమే ఇలాంటి మాటలు రాయగలడు. అలాంటి అక్షరాలతోనే తన కవిత్వం నిండి ఉందని చెప్పడమే కాదు, ''నాకు కొన్ని గంపలు కావాలి, మా ఇంటి అటక ఖాళీ కడుపుతో, నకనకలాడిపోతోంది, కొన్ని కవితలు నింపుకెళ్ళాలి... నాకు కొన్ని ముంతలు కావాలి, మా ఇంటి కిటికీల, మనస్సు బరువెక్కింది, కొన్ని పదచిత్రాలు పట్టుకెళ్లాలి'' (కవిత్వ దాహం) అంటూ తన కవిత్వ దాహాన్ని ప్రకటించాడు. ''... ఉదయం మొక్కలకు నీరుపోస్తున్నప్పుడో, కిటికీల నుండి వెలుగు ముక్కల్ని తింటున్నప్పుడో ... 'కవిసంగమం' దిగుడుబావి నుంచి, ముంచుకొచ్చిన పద్యాలను వల్లెవేస్తున్నప్పుపుడు, నాతో పాటు అవి కూనిరాగాలు తీస్తాయి...'' అంటూ తన కవిత్వదాహాన్ని అద్భుతమైన భావచిత్రాలతో ఒక రంగుల పెయింటింగులా గీస్తాడు.

కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపు రవీందర్ విలాసాగరం వంటి అనేక మంది కవులకు వేదిక కావడమే కాదు, వారి పదునైన కవిత్వానికి మరింత సానబెట్టింది. ''అక్షరాల చెట్టు'' అంటూ రాసిన కవితలో రొట్టమాకురేవు ప్రస్తావన రాకపోయినట్లయితే ఆ కవిత నిజానికి కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపు మొత్తానికి వర్తించే కవిత.

కవిలో సామాజిక చింతన, సామాజిక చైతన్యం, సమాజ ప్రయోజనాభిలాష ఎంతగా ఉండాలో కూడా రవీందర్ విలాసాగరం తన మ్యానిఫెస్టోలో చెప్పుకున్నాడు. ''కవి'' అనే కవితలోని చివరి పంక్తులు ''నాకు దూరంగా నడుస్తూ వాళ్ళు, ప్రజల వైపు అడుగులేస్తూ నేను.'' అంటూ ముగించిన ఈ కవిత రవీందర్ విలాసాగరంలో సమాజం పట్ల ఉన్న ప్రేమ, ప్రజల పట్ల ఉన్న అభిమానం, వారి సమస్యలను కవిత్వీకరించడం ద్వారా సమాజ ప్రయోజనాల కోసం శ్రమించాలన్న పట్టుదల అన్నీ కనిపిస్తాయి.

నేను ముందే చెప్పినట్లు ఈ కవిత్వసంపుటిలో కవిత్వం, సృజన, అక్షరం వంటి వస్తువుల ద్వారా తన కవిత్వ మ్యానిఫెస్టోను స్పష్టంగా రాసుకున్నాడు. ''కవిత రాసుడంటే కంకిదిన్నట్టే, మొదటి వాక్యం రావడానికి, అపసోపాలు పడుతుంది, దొరికినట్టే దొరుకుతుంది, బుక్కపిట్టలెక్క ఎగిరిపోతుంది.'' (సృజన) అంటూ అందమైన తెలంగాణ భాషలో తన కవితా సృజన గురించి వర్ణిస్తూ, చివరిగా ''కంకి ఆఖరు నాలుగు గింజలు అమృతం, ఆ రుచి బెండును గూడా దినమంటుంది'' అనడం గమనించదగింది. తాను రాసే కవితల్లో చివరి పంక్తి వరకు బిగింపు, గాఢత, సాంద్రత, ఉదాత్తభావాలు, భావుకత, అనుభూతి ప్రదానాలతో ఆలోచనలను అందించే అద్భుత ప్రతిభ అన్నీ, చివరి అక్షరం వరకు బిగి సడలవని ప్రకటించాడు.

Kavi Yakoob explains the essence of Ravinder Vilasagaram poetry in detail.

''పద్యం ఊరకనే వచ్చి సంటి పిల్లలా, నీ వొల్లో వాలదు, వక్క పొట్లంలా అల్కగ, నీ నోట్లోకి వచ్చి దూకదు'' (నిఖార్సయిన పద్యం) అంటూ కవిత రాయాలంటే ఎంత తపన పడాలో వివరించాడు. ''ఎర్రటి నిప్పుకణికవై వెలిగినపుడు, ఉక్కులాంటి పద్యం ఉనికి వస్తుంది'' అంటూ కవితకు ప్రాణం పోయాలంటే గుండెల్లో నిప్పుకణికలు మండాలని చేసిన ఈ తీర్మానం నిజానికి రవీందర్ విలాసాగరం రాసుకున్న మ్యానిఫెస్టో మాత్రమే కాదు, కవులందరూ చదవదగిన పద్యమిది. నరేంద్ర దభోల్కర్ గురించి రాసిన కవిత ఈ సందర్భంగా ప్రత్యేకంగా గమనించదగింది. ''రాలుతున్న నక్షత్ర దేహాలపై, ఎర్రని నెత్తుటి చుక్కలు, అక్షరాలకు, తిరుగుబాటు నేర్పినందుకే కావచ్చు, ఈ సాయంసమయమెందుకో మంటల్లో మండుతోంది'' అంటూ అద్భుతమైన ఒక దృశ్యకావ్యం మన ముందు చూపిస్తూ, అక్షరాలకు తిరుగుబాటు నేర్పిన ధభోల్కర్ ని స్మరిస్తూ ''పాపం అంథకారానికి తెలియదేమో, భూమండలమంతటా పాతిపెట్టిన వాక్యాలు, సునామీలా మొలకెత్తుతాయని..'' అంటూ కవితను ముగిస్తాడు.

ఈ ముగింపులో హెచ్చరిక గమనించదగింది. వాక్యాలను, పదాలను, అక్షరాలను పాతిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదని, అలా చేసినా అవి సునామీలా మొలకెత్తుతాయని ప్రకటించి, కవిత్వం సమాజ నిర్మాణానికి పునాదిరాయిగా స్పష్టం చేశాడు. హింసాత్మక అణిచివేతలకు తలొగ్గిది లేదని నిర్భయంగా చేసిన కవిత్వ ప్రకటన ఇది. ''మామూలు పదాలే, అప్పుడప్పుడు, హృదయాన్ని మెలిపెడతాయ్, విరిగిన ఎముకలా'' (పోలిక) అనే కవితలోను కవిత్వం గురించిన మ్యానిఫెస్టోయే కనబడుతుంది. ''అలతి అలతి పదాలే, అప్పుడప్పుడు, డెందాన్ని కూలగొడుతూ'' అంటూ కవిత్వం ధాటికి సింహాసనాలు కూడా గడగడవణికిపోక తప్పదని తేల్చి చెప్పాడు. ''ఒక ఉపమో, ఒక ఉత్ర్పేక్షో, మరో రూపకమో, ఏదయితేనేం, నిన్నూ నన్నూ ఛిద్రం చేయడానికి'' అని కవిత్వం బలమెంతో అక్షరాలు ఎంత శక్తిమంతమైన ఆయుధాలో చాటి చెప్పాడు.

రవీంద్ర విలసాగరం కవిత్వంలో ఆర్ధ్రత, భావుకత, అద్భుతమైన పదచిత్రాలు రసానుభూతిని ఎంతగా కలిగిస్తాయో, ప్రతి పంక్తిలోను ఆలోచనల నెగడుకు నిప్పు పెట్టే అగ్గిరవ్వల్లాంటి అక్షరాలు కూడా మిణుగురుల్లా ఎగురుతూనే ఉంటాయి. ఈ సంపుటిలో వివిధ వస్తువులపై రవీందర్ విలాసాగరం రాసిన కవితలు ఆయన దృష్టి ఎంత విశాలమైనదో తెలియజేస్తున్నాయి. తాత్విక చింతన, సామాజిక మార్పు, మానవసంబంధాలు, విప్లవకాంక్ష, ఉగ్రవాదంపై నిరసన, తెలంగాణ ప్రగతి పట్ల అపార ప్రేమ, భారత పాక్ సంబంధాలపై ఆందోళన, ఊరు, ఊరి చెరువు, పాతకాలం విలువల పట్ల నోస్టాల్జిక్ మెలోంకలీ, దోపిడీపై ఆగ్రహం, సామాన్యుల నిస్సహాయస్థితిపై ఆక్రోశం, తిరగబడాలన్న ఆవేశం, నేతల తీరు పట్ల వ్యంగ్యాత్మక నిరసన, సామాజికంగా ఖచ్చితమైన అభిప్రాయాలు, రైతు బాధల పట్ల ఆవేదన, ప్రేమప్రకటన ఇవన్నీ మనకు ఈ కవిత్వసంపుటిలో మిణుగురుల్లా ఎగిరే అక్షరాలై కనిపిస్తాయి. ప్రతి అక్షరం ఒక అనుభూతిని కలిగిస్తుంది, వెయ్యి ఆలోచనలను రేకెత్తిస్తుంది.

రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించిన విషాద సంఘటన, రోహిత్ మరణంపై ప్రతిస్పందిస్తూ ''వెలిగే వెన్నెల తునక, ఆ సాయంత్రం, మబ్బు వెనక ఎందుకో మాయమయింది'' (కార్యోన్ముఖులవుదాం) అంటూ ఆర్తిగా చెప్పిన మాటలు మృదువుగా వినిపించినా వజ్రాల్లా గుండెల్లో దిగే మాటలు. కవి ఎంతో ప్రతిభావంతుడైతే తప్ప ఇలాంటి విషాద సంఘటన గురించి రాస్తున్నప్పుడు తన ఆవేశాన్ని, తన భావావేశాలను పాఠకుల్లో ఆలోచనలను రేకెత్తించే అక్షరాలుగా మలచలేడు. ''ఒక్క మరణం, ఎన్ని వేల ప్రశ్నలు మొలకెత్తించింది, ఎన్ని జవాబు లేని ప్రశ్నలు సంధించింది'' అంటూ సమాజం జవాబు చెప్పవలసిన ప్రశ్నలను గుర్తు చేసాడు. ''చీమలకు పౌరుషముంటది కదా, ఎర్రటి ఎండల మట్టి పిసికి, ఇటుకల బంగారమోలే మలిచిన చేతులకు, నల్లటి బండలు కూడా ఇసురుడు, వస్తదని తెలసుకోండ్రి'' (ఎర్రచీమలు) అంటూ ఆవేశాన్ని ప్రకటించిన పంక్తుల్లో తిరుగుబాటు స్వప్నం దాగి ఉంది. ప్రజలపై దౌర్జన్యాలను, నిరుపేదల కష్టాలను, వారి దోపిడీని భరించలేని తిరుగుబాటు అక్షరాలు ఎర్రచీమల్లా కవితలో మారాయి.

మీడియా నిజరూపాన్ని బట్టబయలు చేస్తూ ''నా మనసుకు, నీ హృదయానికి, వాడి అంగట్లో టీ ఆర్ పీ రేటింగ్ తో, యం ఆర్ పీ స్టిక్కరుగా మారిపోతుంది'' (బ్రేకింగ్ న్యూస్) అనే పంక్తుల్లో వ్యంగ్యం, ఆగ్రహం ప్రకటిస్తే, ''ముంబయి మరక, నన్నెంత బాధపెట్టిందో, రనీ కంటిపాపల మరణం, నన్నంతకంటే ఎక్కువే, క్షోభింపజేసింది, దాయాదిగా చెప్పట్లేదు, ద్రవించిన హృదమయంతో దుఃఖిస్తున్నాను'' (విషకౌగిలి) పంక్తుల్లో ఆర్ధ్రత, ఆవేదన, ఉగ్రవాదం పంజా దెబ్బకు పొరుగుదేశంలో బలైన చిన్న పిల్లల పట్ల అపారమైన ప్రేమతో కూడిన ఆక్రోశం కవిలోని ఉదాత్త భావాలకు నిదర్శనం. కొన్ని సంఘటనలకు ప్రేరణ పొంది సాధారణంగా కవులు కవిత్వం రాస్తారు. కొన్ని సంఘటనలు ఆవేశాన్ని కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు విషాద సాగరాలవుతాయి. ఆవేశం కలిగించే నిర్దిష్ట సంఘటనలను కవిత్వీకరిస్తున్నప్పుడు ఆలోచనలను ప్రేరేపించే అక్షరాలను వాడడం, దోపిడీ దౌర్జన్యాల దుర్మార్గాల సామాజిక పరిస్థితులపై రాస్తున్నప్పుడు ఆగ్రహాన్ని అక్షరజ్వాలగా మండిస్తూ తిరుగుబాటు స్వరం వినిపించడం, రవీందర్ విలాసాగరం కవితల్లో ధ్వని, స్వరం పరిశీలిస్తే వస్తువుకు అనుగుణమైన శిల్పాన్ని, స్వరాన్ని, ధ్వనిని ఎంచుకోవడంలో చూపించిన జాగ్రత్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కవిత్వీకరించడం పరిణతి సాధించినప్పుడు ధ్వని విషయంలోను, కవితలోని స్వరం విషయంలోను కవి ప్రతిభావంతంగా రాయగలడు. ఆ పరిణతి మనకు విలాసాగరం కవితల్లో కనిపిస్తుంది.

''సాలెండిన బతుకులు, డొక్కలు మాడ్చుకోవడం, తలలు తెంపేసుకోవడం మినహా, మరేం చేయలేవా?'' (సోయి) కవితలో చివరి వరకు దుర్భరమైన రైతు బతుకుచిత్రాన్ని వర్ణించి ''రైతు మెడకు వేలాడుతూ కరువు ఉరితాడు''అని చెప్పడమే కాదు, ''ఎండిన డొక్కలు, నెగడును రగిలిస్తాయని తెలియజెప్పాలే'' అంటూ ప్రకటించిన ఆగ్రహంలోని గొంతు తిరుగుబాటను ధ్వనించింది. ఒక ఆర్ధ్రమైన సానుభూతి గొంతుతో ప్రారంభమైన కవిత, చివరి పంక్తుల్లో విప్లవ శంఖంలా మారింది. చదువరిలో భావావేశాలతో పాటు ఆలోచనలను కూడా కలుగజేసే అద్భుతమైన కవిత్వ నిర్మాణం ఇది.

ఈ కవిత్వ సంపుటి చదివితే కలిగే స్ఫూర్తి గురించి నేను చెప్పడం కాదు, మీరు చదవవలసిందే...''మెలకువ అంగీ వేసుకుని, కళ్ళు నులుముకుంది గాఢనిద్ర'' (తెల్లారగట్ల) అద్భుతమైన భావకవిత. ''బడి మొహం చూసాడో లేదో కాని, బహుభాషా పండితుడౌతాడు'' (ప్రయాణం) అంటూ బాలకార్మికుడి గురించి రాసిన పంక్తుల్లో అక్షరాలు అశ్రువులై పాఠకుడి చెంపలను నిమురుతాయి. ''ఉరికొయ్యకు వేలాడిన నాగండ్ల తలలు'' (ఒడువని ముచ్చట) అన్న ఒక్క వాక్యం చాలు కవి హృదయం రైతు, కూలి, చేనేత కార్మికుల బాధామయ జీవితాలను తన గుండెల్లో పొదివి పట్టుకుందని, వాటిన కవిత్వీకరిస్తూ, అక్షరం అశ్రువులు రాల్చుతుందని అర్ధమవుతోంది.

ఈ సంపుటిలో వహ్వా అనిపించే ''కంటిపాప'' వంటి భావకవితలే కాదు, లాకఫ్ డెత్ లను నిలదీసే ''గుండెకోత'', కవితలు కూడా చాలా ఉన్నాయి. ''నీ అసొంటోళ్ళు వూరుకొకలుంటే జాలు, ఊరంతా చెట్టు కింద నీడ లెక్క సల్లగుంటది'' (శభాష్ బక్కవ్వా) వంటి పంక్తులు ఈ కవిత్వ సంపుటినీ సౌందర్యదృష్టితోనే కాదు, సామాజిక దృష్టితోను గొప్ప సంపుటిగా మార్చే పంక్తులు.

ప్రతి కవిత గురించి రాయాలనిపించే అద్భుతమైన అనేక కవితలు ఇందులో ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే రవీందర్ విలాసాగరం కవిత్వం పాఠకుడిలో అనుభూతి అలలను, భావావేశ తుఫానులను, ఆలోచనల సుడిగుండాలను ఒకేసారి సృష్టించి ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు, నిజాలవానలో స్నానించిన పసిపిల్లల్లా మార్చేస్తుంది.
అద్భుతమైన ఇలాంటి కవిత్వ సంపుటులు మరిన్ని రవీందర్ విలాసాగరం కలం నుంచి వెలువడాలని మనసారా కోరుకుంటూ....

జయహో కవిత్వం !

- కవి యాకూబ్
'సూఫీ ఘర్', చైతన్యపురి, హైదరాబాద్

English summary
Kavi Yakoob explains the essence of Ravinder Vilasagaram poetry in detail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X