IT vs AI Jobs: ఐటీ ఆశలు గల్లంతు- నెల రోజుల్లో ఏఐ ఉద్యోగాల దూకుడు..!

భారత ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాల సరళి వేగంగా మారుతోంది. సరికొత్త సాంకేతికత విస్తరిస్తున్న వేళ, టెక్ దిగ్గజ సంస్థలు సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఐటీ పరిశ్రమలో సాధారణ ఉద్యోగాల భర్తీ క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ఏఐ ఆధారిత పోస్టుల నియామకాలు మాత్రం ఊపందుకుంటున్నాయని తాజా పరిశ్రమల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

ప్రముఖ ఉద్యోగాల వేదిక 'నౌక్రీ’ విడుదల చేసిన 'జాబ్‌స్పీక్’ నివేదిక ప్రకారం, గత నెలలో దేశీయ ఐటీ రంగంలో ఏఐ ఉద్యోగాల (AI Jobs) భర్తీ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం పెరిగింది. అదే సమయంలో, మొత్తం ఐటీ ఉద్యోగాల భర్తీ మాత్రం 3 శాతం తగ్గింది. దాదాపు 315 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ రంగం, ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు , సాంకేతిక ఆవిష్కరణల కారణంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా రానున్న రోజుల్లో సాధారణ నియామకాలను క్రమంగా తగ్గించుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. భవిష్యత్తులో మానవ శ్రామిక శక్తితో పాటు సమాన సంఖ్యలో 'ఏఐ ఏజెంట్లను’ తమ రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేయాలని ఈ సంస్థ యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నుంచి నికర ఉద్యోగుల సంఖ్య దాదాపు 23,000 వరకు తగ్గడం సాఫ్ట్‌వేర్ రంగంలో మారుతున్న ఈ ధోరణికి బలమైన సంకేతంగా నిలుస్తోంది.

Advertisement

ఈ సాంకేతిక మార్పుల ప్రభావం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. దేశంలోని దాదాపు 14 ప్రధాన రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషిన్ లెర్నింగ్ (ML) విభాగాల్లో ఉద్యోగాల నియామకాలు సగటున 25 శాతం పెరిగాయి. ముఖ్యంగా బీమా, నిత్యావసర వస్తువుల (FMCG) రంగాలలో ఈ తరహా నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోకపోతే భవిష్యత్తులో నిలదొక్కుకోవడం కష్టమనే గట్టి సందేశాన్ని ఈ తాజా నివేదిక ఇస్తోంది. కాబట్టి ఉద్యోగార్ధులు తాజా మార్పుల్ని బట్టి తమ కెరీర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

English Summary

As Indian IT firms navigate global economic uncertainty, hiring patterns are shifting drastically. Traditional software roles are witnessing a decline while AI-specialized positions are skyrocketing. Industry reports indicate that companies like TCS are prioritizing AI agents, urging professionals to upskill or risk losing competitiveness in this changing technological landscape of 2026.