Amazon: అమెజాన్‌లో 11వేల ఉద్యోగాలు- ఈ 3 నైపుణ్యాలు తప్పనిసరి..! 

అంతర్జాతీయ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది ఏకంగా 11 వేల మంది ఇంటర్న్‌లను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరిస్తున్న ఈ తరుణంలో, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం సాంప్రదాయ కోడింగ్ నైపుణ్యాలు మాత్రమే కాకుండా, అభ్యర్థులలో సరికొత్త వ్యక్తిగత నైపుణ్యాలను అమెజాన్ వెతుకుతోంది.

Advertisement

అమెజాన్ ఉద్యోగాలు-అర్హతలు (Amazon)

ఈ గ్లోబల్ మార్పుల గురించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సీఈఓ మ్యాట్ గార్మన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరాలనుకునే వారి వద్ద కేవలం ముందస్తు సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదని, మారుతున్న పరిస్థితులకు త్వరగా సర్దుకుపోయే తత్వం,, సరికొత్త విషయాలను శోధించే కుతూహలం, వేగంగా నేర్చుకునే మనస్తత్వం ఉన్న అభ్యర్థులకే తమ సంస్థలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ఆయన తేల్చిచెప్పేశారు.

Advertisement

ఫ్రెషర్స్ తో ప్రయోజనం

సాధారణ సాంకేతిక పనులను ఏఐ టూల్స్ సులభంగా పూర్తి చేస్తున్న ఈ రోజుల్లో, మానవ వనరుల వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా కొత్తగా విధుల్లో చేరే యువతను 'బ్లాంక్ స్లేట్' లాంటి వారని మ్యాట్ గార్మన్ చెప్తున్నారు. కంపెనీ కార్పొరేట్ సంస్కృతిని వారికి సులభంగా నేర్పించవచ్చని, సరికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌లపై త్వరగా శిక్షణ ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పాత సమస్యలకు భిన్నమైన ఆలోచనలతో సరికొత్త పరిష్కారాలు కనుగొనడానికి కొత్త తరం శక్తి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇంటర్న్ షిప్ లే కీలకం

చాలా ఏళ్లుగా ఒకే తరహా ఉద్యోగులు ఉండటం వల్ల కొత్త ఆలోచనలు రావడం తగ్గుతుందని, అదే ఫ్రెషర్లు అయితే సరికొత్త ఉత్తేజంతో పాటు నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తారని అమెజాన్ నమ్ముతోంది. ఇది సంస్థ నిర్వహణ వ్యయాలను సరైన రీతిలో ఉంచడమే కాకుండా, కొత్త వ్యాపార విభాగాలలో వేగంగా పురోగతి సాధించడానికి సాయపడుతుందని భావిస్తోంది. అందుకే ఏఐ కాలంలోనూ కంపెనీలో డెవలపర్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందనే విషయాన్ని అమెజాన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.8 లక్షల మంది పూర్తి స్థాయి, పార్ట్-టైమ్ ఉద్యోగులను కలిగి ఉంది. ఏఐ వాడకం వల్ల భవిష్యత్తులో కొన్ని విభాగాలలో ఉద్యోగాల అవసరం తగ్గినప్పటికీ, సంస్థలో తదుపరి తరం నాయకులను తయారు చేయడంలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అత్యంత కీలకమైన వేదికగా అమెజాన్ భావిస్తోంది. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారే ఈ మారుతున్న డిజిటల్ యుగంలో సుస్థిరమైన కెరీర్‌ను నిర్మించుకోగలరని ఈ నియామకాల ట్రెండ్ నిరూపిస్తోంది.

English Summary

AWS CEO Matt Garman explains Amazon's 2026 strategy for hiring 11,000 interns. Amid the rise of AI, the company is shifting its focus beyond traditional coding skills, seeking candidates with high adaptability, curiosity, and a willingness to learn to drive future innovation within the organization.